లిక్కర్ మత్తులో హత్యలు.. 15 రోజుల్లో మూడు ఘటనలు

  • 15 రోజుల్లో కరీంనగర్ సిటీలో మూడు ఘటనలు
  • పర్మిట్ రూమ్ లు, బార్ షాపుల్లో నిత్యం గొడవలు
  • పెరిగిన యాక్సిడెంట్స్ 

కరీంనగర్, వెలుగు: లిక్కర్ మత్తులో జిల్లాలో  హత్యలు పెరిగిపోతున్నాయి. అప్పటివరకు కలిసి తిరిగిన స్నేహితులే మాటమాట పెరిగి మర్డర్లకు పాల్పడుతున్నారు. 15 రోజుల్లో కరీంనగర్ సిటీ పరిధిలో మద్యం మత్తులో మూడు  హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఓ మర్డర్ ఇంట్లో జరగగా, మరొకటి పోలీస్ స్టేషన్ కు అత్యంత సమీపంలో, మరొకటి వైన్స్ పర్మిట్ రూమ్ లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. హత్యలేగాక డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా యాక్సిడెంట్లలో గాయాలపాలవ్వడం, చనిపోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పోలీసుల పర్యవేక్షణ లోపంతోనే బార్ లు, వైన్ షాపు పర్మిట్ రూమ్ ల్లో, ఎక్కడపడితే అక్కడ తాగి గొడవలకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బార్లను తలపిస్తున్న పర్మిట్ రూమ్‌లు 

కరీంనగర్ సిటీలో వైన్​షాపుల్లోని పర్మిట్ రూమ్ లు బార్లను తలపిస్తున్నాయి. పర్మిషన్‌కు మించిన విస్తీర్ణంలో పర్మిట్​రూమ్​లను ఏర్పాటు చేశారు. కొందరు మందుబాబులు వైన్స్ ఎదురుగా ఫుట్ పాత్ లు, రోడ్ల మీద కూడా బహిరంగంగానే మద్యం తాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. అంబేద్కర్ స్టేడియం, తెలంగాణ చౌక్, బస్టాండ్ ఎదుట, ఆదర్శనగర్ తదితర ఏరియాల్లో ఫుట్ పాత్ మీద సిట్టింగ్ వేస్తున్నారు. దీంతో అటువైపుగా మహిళలు, యువతులు నడిచి వెళ్లడం ఇబ్బందికరంగా మారింది.  మరోవైపు షాపుల నిర్వాహకులు తెల్లారకముందే షట్టర్ ఓపెన్ చేసి అర్ధరాత్రి దాటే వరకు లిక్కర్ అమ్ముతున్నారు. ఇంత ఓపెన్ గా లిక్కర్​అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. సర్కార్ విధించిన టార్గెట్లు, వైన్స్​షాపుల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు తలొగ్గి ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హత్యలతో ఆందోళన 

జిల్లాలో ఇటీవల జరుగుతున్న హత్యలు జనంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 3న కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వైన్స్ షాపు పర్మిట్ రూమ్ లో  కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన  మేస్త్రీ పులగండ్లల సిసింద్రీ(25) లిక్కర్ తాగుతుండగా కరీంనగర్ మండలం బొమ్మకల్ కృష్ణానగర్ కు చెందిన లారీ డ్రైవర్ జూపల్లి దత్తారావుతో గొడవ జరిగింది. సిసింద్రీ అక్కడి నుంచి బయటికి రాగా కోపంగా ఉన్న దత్తారావు అందరూ చూస్తుండగానే వెనుక నుంచి వచ్చి రాయితో దాడి చేశాడు. సిసింద్రీ తలకు తీవ్ర గాయాలై 
అక్కడికక్కడే చనిపోయాడు. 

ఈ నెల 14న  కరీంనగర్ రూరల్ మండలం రేకుర్తిలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మావురం నాగరాజు(38), మేక అజయ్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి అజయ్ ఇంట్లో లిక్కర్​తాగుతుండగా గొడవ జరిగింది. అజయ్.. నాగరాజును గొంతులో కత్తితో పొడిచాడు. రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. 

బుధవారం అర్ధరాత్రి రాంనగర్ లో నివాసం ఉంటున్న చేకూరి పవన్(38) మందు తాగేందుకు వైన్ షాపుకు వెళ్లాడు. అదే టైంలో అదే ప్రాంతానికి చెందిన అరుణ్, అఫ్రిద్ అక్కడికి వచ్చారు.  ఈక్రమంలో రెండు గ్యాంగుల మధ్య గొడవ జరిగి పవన్ పై దాడి చేశారు.  పోలీసులు అతడిని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు.

ఇష్టారాజ్యం నడిపితే చర్యలు తప్పవ్.. 

పర్మిట్ రూమ్ ల్లో నిబంధనల ప్రకారం నడపాలి. సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. గొడవలు జరగకుండా చూసుకునే బాధ్యత వైన్ షాపుల నిర్వాహకులదే. ఇక మీదట పోలీస్ పెట్రోలింగ్ ను ముమ్మరం చేస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ చర్యలు తీసుకుంటాం. 

నరేందర్, ఏసీపీ, కరీంనగర్