బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో ముసలం మొదలైంది

మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా నస్పూర్​, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో ముసలం మొదలైంది. పాలకవర్గాలు ఏర్పడి మూడేండ్లు కావడంతో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సొంత పార్టీ లీడర్లే రెడీ అయ్యారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపడం, కొంతమంది కౌన్సిలర్లకే ప్రాధాన్యం ఇవ్వడం, అవినీతి, అక్రమాల ఆరోపణలతో చైర్మన్లను కుర్చీ నుంచి దించేందుకు పావులు కదుపుతున్నారు. నస్పూర్​ మున్సిపల్​ చైర్మన్​ ఈసంపల్లి ప్రభాకర్ ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ వైస్​ చైర్మన్​ తోట శ్రీనివాస్​ ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా కౌన్సిలర్లు ఏకమయ్యారు. మొత్తం 25 మంది కౌన్సిలర్లకు గాను బీఆర్​ఎస్​కు​ 16, కాంగ్రెస్​కు ఆరు, సీపీఐకి ఇద్దరు, బీజేపీ ఒక్కరు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్​కు చెందిన ఎనిమిది మందితో పాటు కాంగ్రెస్​, బీజేపీ సభ్యులు ఏడుగురు కలిపి 15 మంది అవిశ్వాసానికి సై అంటున్నట్టు సమాచారం. దీంతో చైర్మన్​ ప్రభాకర్​కు పదవీగండం పొంచివుంది. అవిశ్వాసం విషయమై ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుతో చర్చించనున్నట్టు వైస్​ చైర్మన్​ శ్రీనివాస్​ తెలిపారు. 

కౌన్సిల్​ మీటింగ్​ బహిష్కరణ... 

చైర్మన్​ ప్రభాకర్​ వ్యవహార శైలిని నిరసిస్తూ సోమవారం జరిగిన మున్సిపల్​ కౌన్సిల్​ మీటింగ్​ను కౌన్సిలర్లు బహిష్కరించారు. బీఆర్ఎస్​కు చెందిన వైస్​ చైర్మన్​ శ్రీనివాస్​, కౌన్సిలర్లు కుమార్​, మల్లయ్య, ప్రకాశ్​రెడ్డి, బౌతు లక్ష్మి, కాంగ్రెస్​ ఫ్లోర్​ లీడర్​ సురిమిళ్ల వేణు, కౌన్సిలర్లు గెల్లు రజిత, సంధ్యారాణి, సుమతి, బి.సంధ్యారాణి, బీజేపీ కౌన్సిలర్​ అగల్​డ్యూటీ రాజు సమావేశాన్ని బాయ్​కాట్​ చేశారు.  

బెల్లంపల్లిలో....

బెల్లంపల్లి మున్సిపల్ చైర్​పర్సన్​ జక్కుల శ్వేతకు అవిశ్వాస గండం పట్టుకుంది. మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల అభివృద్ధిని పట్టించుకోకపోవడం, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 34 మంది కౌన్సిలర్లకు గాను సుమారు 28 మంది ఒక్కటై అవిశ్వాసానికి ప్లాన్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. చైర్​పర్సన్​ తీరుపై కొందరు కౌన్సిలర్లు నిరుడు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఫిర్యాదు చేసినా ఆమె తన వైఖరి మార్చుకోలేదని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం, కొత్త ఇంటి నంబర్ల జారీ విషయంపై ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ వార్డులకు నిధులు కేటాయించడం లేదని కోపంతో ఉన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అసమ్మతి కౌన్సిలర్లు ఒక జట్టుగా ఏర్పడి శ్వేతను తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మున్సిపల్​ నిధులు దుర్వియోగం...

నస్పూర్​ మున్సిపల్​ చైర్మన్​ ప్రభాకర్​ కౌన్సిల్​ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నరు. అభివృద్ధి పనులకు, వాహనాలకు టెండర్లు నిర్వహించకుండా నిధులను దుర్వినియోగం చేస్తున్నరు. ఒక్క నర్సరీ పనుల్లోనే సుమారు రూ.14 లక్షల అవినీతి జరిగింది. ఇంటి నంబర్లు, ఇల్లీగల్​ వెంచర్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డరు. ఈ విషయమై లోకల్​ బాడీస్​ అడిషనల్​ కలెక్టర్​ రాహుల్​కు సైతం ఫిర్యాదు చేసినం. ఎమ్మెల్యే దివాకర్​రావు దృష్టికి తీసుకెళ్లి అవిశ్వాసంపై నిర్ణయం తీసుకుంటం.   
–తోట శ్రీనివాస్​, నస్పూర్​ వైస్​ చైర్మన్​  

పాలన కుంటుపడ్డది... 

నస్పూర్​ మున్సిపాలిటీలో పాలన పూర్తిగా కుంటుపడ్డది. వార్డుల్లో ఎలాంటి డెవలప్​మెంట్​జరగలేదు. డ్రైనేజీలు సక్కగ సాఫ్​ చేస్తలేరు. స్ర్టీట్​ లైట్లు పోతే నాలుగైదు రోజులైనా కొత్తవి పెడ్తలేరు. అజెండా అంశాలన్నీ తప్పులతడకే. మున్సిపాలిటీలో టీఎస్​ బీపాస్​ చట్టం అబాసు పాలవుతోంది. చైర్మన్​, కమిషనర్​ కుమ్మక్కై ఇల్లీగల్​ వెంచర్లలో పర్మిషన్లు, ఇంటి నంబర్లు ఇస్తున్నరు. ప్రతి పనిలో అవినీతికిపాల్పడుతున్నరు. మున్సిపాలిటీ డెవలప్​ కావాలంటే ఈ చైర్మన్, కమిషనర్​ పోవాల్సిందే.  
–అగల్​డ్యూటీ రాజు, బీజేపీ కౌన్సిలర్​ 

ప్రజా సమస్యలపై పట్టింపులేదు... 

నస్పూర్​ మన్సిపల్​ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి మూడేండ్లు గడిచాయి. ఇప్పటివరకు అభివృద్ధి గురించి, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్​ కౌన్సిలర్ల వార్డుల్లో పనులు చేస్తలేరు. బీఆర్​ఎస్​ కౌన్సిలర్లపై వార్డులకు నిధులు కేటాయించినా పనులు అయితలేవు. చైర్మన్​, కమిషన్​, అధికారులు వాళ్ల జేబులు నింపుకోవడానికే పనిచేస్తున్నరు. ఆర్టీఐ కింద కోరిన సమాచారం ఇస్తలేరు. నాన్​ లే అవుట్​ వెంచర్లలో పైసలు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నరు. మున్సిపాలిటీని అవినీతిమయం చేసిన్రు. 
–సురిమిళ్ల వేణు, కాంగ్రెస్​ ప్లోర్​ లీడర్