
హిస్టారికల్, సైన్స్ వంటి అంశాలకు సంబంధించిన మ్యూజియాలు చూసి ఉంటాం. అలాగే బొమ్మలు, వింత వస్తువులకు సంబంధించిన మ్యూజియాల గురించి కూడా విన్నాం. కానీ, లాఫ్టర్ మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా..? కచ్చితంగా విని ఉండరు. ఎందుకంటే మొట్టమొదటి లాఫ్టర్ మ్యూజియం ఈ మధ్యే ప్రారంభం అయింది కాబట్టి. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందామా..ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది తమ జీవితంలోని నెగెటివిటీ నుంచి తప్పించుకోవడానికి నానారకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఎన్నో కుటుంబాలు సంతోషానికి దూరమయ్యాయి. ఎప్పుడు? ఏం జరుగుతుందోననే ఆందోళనలోనే బతుకుతున్నారు.
టెన్షన్, భయం, అనుమానం వంటి నెగెటివ్ ఆలోచనలతో జీవితాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నారు. అందుకే గతంలో కొన్ని దేశాలు నవ్వడానికి చట్టాలు కూడా తీసుకొచ్చాయి. అయితే క్రొయేషియాకు చెందిన ఆండ్రియా గొలుబిచ్ అనే అమ్మాయి అందరూ మనసారా నవ్వాలనే ఉద్దేశంతో ఏకంగా మ్యూజియాన్నే ఏర్పాటు చేసింది. మోడర్న్ లైఫ్ స్టయిల్‌కి అలవాటు పడి పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు బుర్ర హీటెక్కిపోయేలా పనిచేస్తూ గడిపేస్తున్నారంతా. అందుకే మనసారా నవ్వుకోవడానికి, సంతోషాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడానికి లాఫ్టర్ మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుందట ఆండ్రియా. 23 ఏండ్ల ఆండ్రియా ప్రపంచంలోనే మొట్టమొదటి లాఫ్టర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. దీనిపేరు ‘హహహౌస్’(HahaHouse). ఇది క్రొయేషియాలోని జాగ్రెబ్ అనే ప్రాంతంలో ఉంది.
ఈ ఆలోచన ఆండ్రియాకి కొవిడ్ ప్యాండెమిక్ టైంలోనే వచ్చింది. ఆ సమయంలో చాలామంది ఒంటరిగా ఉంటూ డిప్రెషన్లోకి వెళ్లడం చూసి, వాళ్లను సంతోష పెట్టాలంటే ఏం చేయాలా? అని ఆలోచించినప్పుడు ఆమెకి ఈ ఐడియా వచ్చింది. మరో వ్యక్తితో కలిసి ఈ లాఫ్టర్ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. దీన్ని ప్రారంభించడానికి 78 మంది సందర్శకులను లిస్ట్‌లో రాసుకున్నారట. వాళ్లతోనే ఈ మ్యూజియం మొదలైంది. ఈ మ్యూజియం చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందర్నీ ఆకర్షించేలా డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల్లా అల్లరి చేస్తూ గడిపేయొచ్చు. మ్యూజియంలో ఎనిమిది రకాల జోన్లు ఉన్నాయి. అందులో పురాతన కాలం నాటి హాస్య చరిత్ర నుంచి నేటి సినిమాలు, నాటకాలు, ఇంటర్నెట్ వరకూ అన్నీ ఉన్నాయి.