మ్యూజియంలు సాంస్కృతిక కేంద్రాలు

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా నేడు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో మొదటిసారిగా ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌‌‌‌‌‌‌‌పో నిర్వహిస్తున్నాం. పురాతన వస్తువుల(యాంటిక్విటీస్)ను సంరక్షించడం, వారసత్వ సంపదకు సరైన గుర్తింపు, ప్రచారం.. అందుకు మ్యూజియంల సంపూర్ణ కన్జర్వేషన్ కోసం సమగ్రంగా, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించే మొట్టమొదటి సమావేశం ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భిన్న నాగరికతల్లో చాలా కనుమరుగైపోయాయి. కానీ నాటి నుంచి నేటికీ కొనసాగుతున్న చాలా తక్కువ నాగరికతల్లో భారతదేశం ఒకటి. అలాంటి భవ్యమైన మన చరిత్రను, నాగరిక విలువలను, మన కళలు, సంస్కృతిని, వారసత్వాన్ని మ్యూజియంలు ప్రతిబింబిస్తాయి. మ్యూజియంలు నిర్జీవ వస్తువుల సంగ్రహాలయాలు మాత్రమే కాదు మన చరిత్రను, మన పూర్వీకుల దైనందిన జీవన విధానాన్ని మరోసారి మన కళ్లముందు ఆవిష్కరించే సాంస్కృతిక కేంద్రాలు. మన పండగలు, తినే తిండి, నృత్యాలు, సంగీతం ఇవన్నీ మన నాగరిక విలువలను ప్రతిబింబిస్తాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పురాతన వస్తువులు, కళాఖండాలను నిర్వహించే పద్ధతిని సమతుల్యం చేస్తూ నాటి పరిస్థితులు అర్థమయ్యేలా మ్యూజియంల నిర్వహణ జరగాలి.

మ్యూజియం కేంద్రిత వ్యవస్థ నుంచి.. 

గత 9 ఏండ్లుగా మన వైభవోపేతమైన చరిత్రను ప్రతిబింబించే యాంటిక్విటీస్, ఆర్టిఫ్యాక్ట్స్‌‌‌‌‌‌‌‌ను తిరిగి మన దేశానికి తీసుకొచ్చే దిశగా గణనీయమైన ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి 244 విలువైన పురాతన వస్తువులు, కళాఖండాలు దేశానికి రాగా.. అందులో 231 కళాఖండాలు 2014 తర్వాత దేశానికి వచ్చినవే. ఇవి కాకుండా మరో 72 యాంటిక్విటీస్ అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల నుంచి భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నం సాగుతోంది. మన దేవీ, దేవతల విగ్రహాలను స్వదేశానికి తీసుకురావడం అనేది మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడమే. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘వికాస్ భీ ఔర్ విరాసత్ భీ’ ఆలోచనను ప్రతిబింబిస్తుంది. వివిధ దేశాల నుంచి స్వదేశానికి తీసుకొస్తున్న ఈ విగ్రహాలు, కళాఖండాలను.. మ్యూజియంలు, వేర్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ల్లో పెట్టడం కంటే.. అవి ఏ ప్రాంతం నుంచైతే దోపిడీ చేయబడ్డాయో.. అక్కడే పున:ప్రతిష్టించే ప్రయత్నం జరుగుతోంది. వారణాసి నుంచి తస్కరించిన అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం, తమిళనాడు నుంచి తీసుకువెళ్లిన విగ్రహాలను ఆయా ప్రాంతాలకు తరలించడం ఇందులో ఒక భాగం. ‘హిస్టరీ బిలాంగ్స్ టు జియోగ్రఫీ’ అనే సిద్ధాంతమే ఈ నిర్ణయం వెనకున్న ప్రధాన కారణం. 

పరస్పర సమన్వయంతో అపూర్వ అనుభూతి

మన దగ్గరున్న భిన్న సంస్కృతులు, మతాలు, శాస్త్రపరమైన విజయాలను గుర్తు చేసుకుంటూ.. మన నాగరికతను ప్రతిబింబించేలా.. మన దేశంలో 1200కు పైగా మ్యూజియంల నిర్వహణ జరుగుతోంది. ఈ మ్యూజియంలన్నీ ఒక్క సాంస్కృతిక శాఖ పరిధిలో మాత్రమే లేవు. 40 రైల్వే మ్యూజియంలు, క్రాఫ్ట్స్, టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ మ్యూజియంలు, డిఫెన్స్ మ్యూజియంలు, మింట్(నగదు తయారీ) మ్యూజియంలు, ఫుడ్ మ్యూజియంలు వంటి వివిధ మ్యూజియంలను ఆయా మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నాయి. అందుకే వాటిని సందర్శించే వారికి అపూర్వమైన అనుభూతిని కలిగించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఉదాహరణకు దేశవ్యాప్తంగా 50 సైన్స్ సిటీస్, సైన్స్ సెంటర్లు, సైన్స్ మ్యూజియంలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నిర్వహిస్తోంది. ఈ సంస్థ మ్యూజియంల నిర్వహణ కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్(సీఎస్​ఐఆర్​)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. శాస్త్ర, సాంకేతిక పరమైన అవగాహనను సందర్శకుల్లో మరీ ముఖ్యంగా విద్యార్థుల్లో కలిగించేందుకు ఆ రంగంలోని నిపుణులతో కలిసి అద్భుతంగా తీర్చిదిద్దడం, సరికొత్త, సృజనాత్మకమైన ఆలోచనలకు చోటు కల్పించడం దీని ఉద్దేశం. సందర్శకులకు చక్కటి అనుభూతి కలిగించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగుమెంటెడ్ రియాలిటీ వినియోగం మాత్రమే కాకుండా.. సాంకేతిక ఆవిష్కరణల కలెక్షన్, వాటి ఆధునీకరణ వంటివాటికి కూడా ప్రాధాన్యం కల్పిస్తున్నారు. నిరంతరంగా జరుగుతున్న ఈ ప్రక్రియ కారణంగా ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటీవలే ప్రారంభమైన ప్రధానమంత్రి సంగ్రహాలయం ఇందుకు ఓ మంచి ఉదాహరణ. బుద్ధిస్ట్ హెరిటేజ్ పై షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన తొలి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఎగ్జిబిషన్ (వర్చువల్ మ్యూజియం) ద్వారా భారత్‌‌‌‌‌‌‌‌తోపాటు కజకిస్తాన్, కిర్గిజ్‌‌‌‌‌‌‌‌స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, పాకిస్తాన్, చైనా దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తమ దగ్గరున్న బౌద్ధ కళలు, బౌద్ధధర్మం విషయంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రదర్శించాయి. 

ప్రపంచస్థాయిలో ఉండేలా..

మన నాగరికతను, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని, చరిత్రను ప్రతిబింబించే ప్రపంచస్థాయి మ్యూజియంలను ఏర్పాటు చేసుకోవడంలో ఎన్నో సవాళ్లుంటాయి. వాటిని అధిగమించి, అనుకున్న స్థాయిలో ముందుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంపూర్ణ సమన్వయమే సరైన పరిష్కారం. సామర్థ్యం, ఈ రంగంలో నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. ఈ దిశగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కొత్తగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి దీన్ని ప్రపంచస్థాయి యూనివర్సిటీగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రాచీన, సంప్రదాయ మ్యూజియంలను అత్యాధునికంగా మార్చడం కూడా పెనుసవాలే. వాటినీ అధిగమిస్తూ సాంకేతికతను సద్వినియోగపరుచుకుంటూ వినూత్న పద్ధతిలో ఊహాత్మకమైన స్టోరీ టెల్లింగ్ పద్ధతిలో ఆ చిత్రం, కళాఖండానికి సంబంధించిన విషయంలో ప్రతి సందర్శకుడు లీనమయ్యేలా ఈ మ్యూజియంల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డిజిటలైజేషన్, రెపోగ్రఫీ వంటి వాటి ద్వారా నాగరికత విలువలు ప్రతిబింబించేలా ఆయా మ్యూజియంలను పునర్నర్మించేందుకు తీవ్ర కష్టంతోపాటు ఏండ్ల సమయం పడుతోంది.

గుణాత్మక మార్పు దిశగా..

ఈ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం.. మన మ్యూజియంల పరిస్థితిని చక్కదిద్దుతూ దేశానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్న మన సంస్కృతిని ప్రతిబింబించేలా మ్యూజియంలకు సరికొత్త శోభను అందించేందుకు ఒక సందర్భంగా చూడాలి. గత 9 ఏండ్లుగా దేశ సంస్కృతిని కాపాడుకుంటూ ముందుతరాలకు అందించే ప్రయత్నంలో గుణాత్మకమైన మార్పు స్పష్టంగా కనిపించింది. మూడు అంశాల్లో మనం ఆ మార్పును చూడాల్సిన అవసరం ఉన్నది. మొదట మ్యూజియం కేంద్రిత వ్యవస్థ నుంచి ఓ సాంస్కృతిక కేంద్రంగా వీటిని తీర్చిదిద్దడం, ఈ మ్యూజియంలు అద్భుత అనుభూతిని కలిగించేలా ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్’ (కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం)తో ముందుకెళ్లడం, మూడోది.. మ్యూజియంల నిర్వహణలో మనకున్న సామర్థ్యాన్ని సద్వినియోగ పరుచుకుంటూ.. వీటిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం. 

ఎక్స్​పోతో అనేక ఉపయోగాలు

ఆధునీకరణ, అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్, కొత్త మ్యూజియంల స్థాపన విషయంలో మన సంస్థలను 21వ శతాబ్దపు అంతర్జాతీయ మ్యూజియాలజీ ప్రమాణాలకు అనుగుణంగా తీసుకెళ్తున్నాము. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.. అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్‌‌‌‌‌‌‌‌పో ద్వారా మన మ్యూజియంలకు ప్రపంచస్థాయి అనుభూతిని అందించేందుకు, ఈ విషయంలో మన నైపుణ్యాలు, సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఓ వేదికగా చూస్తోంది. 11 ప్యానల్స్, 75 మంది ప్రఖ్యాత ప్యానలిస్టుల మధ్య మ్యూజియంల అభివృద్ధికి సంబంధించి ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో వేదిక ద్వారా విపులంగా చర్చ జరగనుంది. అబుదాబి, లండన్, న్యూయార్క్, బుడాపేస్ట్ వంటి వివిధ ప్రాంతాల నిపుణులు చర్చలు జరపడంతోపాటు మాస్టర్ క్లాసెస్ తీసుకుంటారు. ఇదీగాక దేశవ్యాప్తంగా 25 మ్యూజియంలు, సంస్థల నుంచి వచ్చిన 75 క్యురేటెడ్ ఆబ్జెక్ట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. వివిధ మ్యూజియంలు, మ్యూజియాలజీ, కన్జర్వేషన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన 500 బుక్ కవర్స్‌‌‌‌‌‌‌‌ను, రాగమాల సిరీస్ (రాగమాల పెయింటింగ్స్ పై సంబంధిత ఆడియో, విజువల్ ఎగ్జిబిషన్)ను  ప్రదర్శిస్తారు. నిరుడు ఫిబ్రవరిలో ‘రి ఇమేజింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా’ గ్లోబల్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌కు ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌‌‌‌‌‌‌‌పోను కొనసాగింపుగా చూడొచ్చు. ఆ సదస్సు నుంచి నేర్చుకున్న అంశాల ద్వారా భారతదేశంలో మ్యూజియంల పునర్నిర్మాణానికి, వాటిని ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దేందుకు వేసిన ముందడుగును విశ్లేషించుకునేందుకు ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌‌‌‌‌‌‌‌పో ఎంతో తోడ్పడుతుంది.


–జి. కిషన్ రెడ్డి,కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి