సెంచరీల మీద సెంచరీలు: భారత క్రికెట్‌లో ఖాన్ బ్రదర్స్ హవా

సెంచరీల మీద సెంచరీలు: భారత క్రికెట్‌లో ఖాన్ బ్రదర్స్ హవా

సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌.. ప్రస్తుతం ఈ బ్రదర్స్ భారత క్రికెట్ లో మారు మ్రోగిపోతున్నారు. మొన్నటివరకు సర్ఫరాజ్ అనుకుంటే ఇప్పుడు అతని తమ్మడు ముషీర్ సైతం పరుగుల వరద పారిస్తున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ సూపర్ సిక్స్ లో భాగంగా బ్లూమ్‌ఫోంటెయిన్‌లో ప్రస్తుతం న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో 18 ఏళ్ల ఈ కుర్రాడు సెంచరీ బాదేశాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేసి అదరగొట్టాడు. ముషీర్ సెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.

ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విఫలమైన ముషీర్..ఆ తర్వాత విశ్వరూపమే చూపించాడు. ఐర్లాండ్ పై సెంచరీ (118) చేసి అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు. అమెరికాతో 73 పరుగులు చేసి తన ఫామ్ కొనసాగించగా..తాజాగా కివీస్ పై శతకంతో మెరిశాడు. ఈ సెంచరీతో అండర్ 19 వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్ తర్వాత అత్యధిక సెంచరీలు(2) చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2004 లో ధావన్ రాయుడు కెప్టెన్సీలో 3 సెంచరీలు బాదాడు. 

ముషీర్ ఆటను చూసిన స్పందించిన సర్ఫరాజ్.. తనకంటే తమ్ముడు బాగా ఆడతాడని చెప్పుకొచ్చాడు. ఓ వైపు సర్ఫరాజ్ రంజీల్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తూ టాప్ స్కోరర్ గా నిలుస్తుంటే.. మరోవైపు అన్నకు ఏ మాత్రం తగ్గకుండా ముషీర్ అండర్ 19 లో దంచికొడుతున్నాడు. సర్ఫరాజ్ 2019-20 సీజన్ లో 928 పరుగులు చేయడంతో పాటు 2021-22 రంజీ సీజన్ లో 6 మ్యాచ్ ల్లోనే 982 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

హైదరాబాద్ టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్ రాహుల్ గాయపడటంతో సర్ఫరాజ్ టీంఇండియాలో చోటు దక్కించుకున్నాడు. అతని తమ్ముడు ముషీర్ ఇలాగే ఆడితే త్వరలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే త్వరలో భారత జట్టులో ఖాన్  బ్రదర్స్ ను చూసే అవకాశం లేకపోలేదు. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్.. హార్దిక్ పాండ్య, క్రునాల్ పాండ్య ఇప్పటికే భారత జట్టులో కలిసి ఆడారు. మరి ఈ జాబితాలో వీరిద్దరూ చేరతారా లేదో చూడాలి.