మంత్రి తలసానిపై ముషీరాబాద్ వాసులు గరం
ముషీరాబాద్ (హైదరాబాద్), వెలుగు: బస్తీలో, ఇండ్లల్లో నీళ్లుండి అవస్థ పడుతున్నప్పుడు ఎవరూ రాలేదు గాని ఇండ్లల్లోని నీళ్లు ఎత్తి పోసి క్లీన్ చేసినంక తీరిగ్గా వస్తారా. ఇదేనా మీ తీరు’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ను ముషీరాబాద్ జనం నిలదీశారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని అరుంధతి నగర్, అడిక్‌మెట్ డివిజన్ నాగమయ్య కుంట, పద్మ కాలనీలో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను పరామర్శించడానికి తలసాని, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వెళ్లారు. ఈ సందర్భంగా నాగమయ్య కుంటలోని మహిళలు.. ‘నీళ్లున్నప్పుడు రాకుండా క్లీన్ చేసుకున్నంక వస్తారా’ అని నిలదీశారు. పడుకోవడానికి స్థలం లేక పిల్లలను ఎత్తుకుని నీళ్లలో నిలబడ్డామని.. నీళ్లు గాని, తిండి గాని ఎవరూ అందించలేదని చెప్పారు. దీంతో మంత్రి ఏం వినపడనట్లు ముందుకు సాగిపోయారు. తర్వాత తలసాని మాట్లాడుతూ.. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
For More News..