PAK vs BAN 2024: తృటిలో డబుల్ సెంచరీ మిస్.. పాక్ బౌలర్లను వణికించిన రహీమ్

రావల్పిండి వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ వెటరన్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ చెలరేగి ఆడాడు. పాక్ బౌలర్లను చీల్చి చెండాడుతూ భారీ శతకం సాధించాడు. అయితే 9 పరుగుల తేడాతో తన డబుల్ సెంచరీ కోల్పోవడంతో తన అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. 341 బంతుల్లో 22 ఫోర్లు.. ఒక సిక్సర్ తో 191 పరుగులు చేసి మహమ్మద్ అలీ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

150 పరుగులకు పైగా స్కోర్ చేయడం రహీం టెస్ట్ కెరీర్ లో ఇది ఆరోసారి. 147 పరుగులకు 3 వికెట్ల వద్ద క్రీజ్ లోకి వచ్చిన ఈ సీనియర్ ప్లేయర్ జట్టు స్కోర్ 528 పరుగుల వద్ద ఔటయ్యాడు. రహీమ్ ఒక్కడే 57 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం విశేషం. రహీమ్ తో పాటు మిగిలిన ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇదే మ్యాచ్ లో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 171 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ ఇవ్వడంతో అతను కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 

ALSO READ | ENG vs SL 2024: నాలుగో మ్యాచ్‌కే ఆల్ టైం రికార్డ్.. శ్రీలంక కోచ్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ కృతజ్ఞతలు

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 6 వికెట్లను 448 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 565 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆట ఒక్క రోజే మిగిలిపోవడంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతగడ్డపై పాకిస్థాన్ బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేయలేక తొలి ఇన్నింగ్స్ లో వెనకపడింది.