
ఢాకా: బంగ్లాదేశ్ వెటరన్ వికెట్‌కీపర్, బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని గురువారం సోషల్ మీడియాలో వెల్లడించాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టడంతో ముష్ఫికర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘ఈ రోజు నుంచి నేను వన్డే ఫార్మాట్‌లో ఆడను. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. నాకు వచ్చిన ప్రతి అవకాశానికి దేవుడికి కృతజ్ఞతలు. ప్రపంచ స్థాయిలో మా విజయాలు పరిమితం అయినప్పటికీ ఒక విషయాన్నైతే కచ్చితంగా చెప్పగలను.
నా దేశం తరఫున బరిలోకి దిగినప్పుడు అంకితభావం, నిజాయితీతో కష్టపడ్డా. వంద శాతం శక్తి సామర్థ్యాలను ప్రదర్శించా. గత కొన్ని వారాలుగా చాలా కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇదంతా విధి అని మాత్రమే నమ్ముతున్నా. గత 19 ఏళ్లుగా క్రికెట్ ఆడేందుకు నాకు సాయం అందించిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అభిమానులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా’ అని ముష్ఫికర్ వ్యాఖ్యానించాడు. కెరీర్‌లో 274 వన్డేలు ఆడిన ముష్ఫికర్ 36.42 యావరేజ్‌తో 7795 రన్స్ సాధించాడు.