PAK vs BAN 2024: పాక్‌పై చారిత్రాత్మక విజయం.. వరద బాధితులకు విరాళంగా ప్రైజ్ మనీ

PAK vs BAN 2024: పాక్‌పై చారిత్రాత్మక విజయం.. వరద బాధితులకు విరాళంగా ప్రైజ్ మనీ

బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పటివరకూ 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా దేశ ప్రధాని షేక్‌ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు, అవామీ లీగ్ పార్టీ నేతలకు చెందిన ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. చాలా మంది ప్రజలు నిస్సహాయక పరిస్థితికి చేరుకున్నారు. ఈ దశలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అక్కడ ప్రజలకు తన వంతు సహాయాన్ని అందించాడు. 

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను బంగ్లాదేశ్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. టెస్టు ఫార్మాట్‌‌పై పాక్‌‌పై తొలిసారి గెలిచిన బంగ్లా టైగర్స్ చారిత్రక విజయం సొంతం చేసుకున్నారు. డ్రా పక్కా అనుకున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో చివరి రోజు స్పిన్నర్లు మెహిదీ హసన్ మిరాజ్‌‌‌‌‌‌‌‌ (4/21), షకీబ్ అల్ హసన్‌‌‌‌‌‌‌‌ (3/44) మ్యాజిక్ చేశారు. ఈ ఇద్దరు  కలిసి ఏడు వికెట్లు పడగొట్టి పాక్‌‌కు షాకిచ్చారు. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నా అతి విశ్వాసంతో  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను డిక్లేర్ చేసిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో పేకమేడలా కూలి ఘోర ఓటమి ఖాతాలో వేసుకుంది. 

తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసిన ముష్ఫికర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు అందుకున్న తర్వాత రహీం తన మంచి మనసును చాటుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తో అతనికి వచ్చిన ప్రైజ్ మనీతో పాటు జట్టు ప్రైజ్ మనీని తమ దేశంలోని వరద బాధితులకు విరాళంగా ఇస్తామని ప్రకటించాడు. దీంతో ఇప్పుడు ఈ సీనియర్ క్రికెటర్ కు నెటిజన్స్ హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను  పాక్‌‌‌‌‌‌‌‌ 448/6  స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. బంగ్లా 565 రన్స్‌‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో పాక్ 146 పరుగులకు ఆలౌట్ కాగా.. 30 పరుగుల స్వల్ప టార్గెట్ ను వికెట్ కోల్పోకుండా చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.