
బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్.. మాజీ కెప్టెన్.. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ సెమీస్ కు అర్హత సాధించకపోవడంతో ఈ వెటరన్ క్రికెటర్ వన్డే కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. బుధవారం (మార్చి 5) ఇంస్టాగ్రామ్ ద్వారా తాను వన్డేల నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. గత రెండు వారాలుగా తనకు చాలా సవాళ్లు ఎదురయ్యాయని ముష్ఫికర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా వెల్లడించాడు. మంగళవారం స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించగా ఒక రోజు తర్వాత ఈ బంగ్లా క్రికెటర్ వన్డేల నుంచి తప్పుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో రహీమ్ తన చివరి వన్డే ఆడేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న అతను తన చివరి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ బంగ్లా వెటరన్.. ఇక ముందు టెస్ట్ క్రికెట్ లో మాత్రమే కొనసాగనున్నాడు. బోగ్రాలో జన్మించిన ముష్ఫికర్ 2006లో హరారేలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. 19 సంవత్సరాలు తన వన్డే కెరీర్ లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ గా నిలిచాడు.
ముష్ఫికర్ రహీమ్ తన వన్డే కెరీర్ లో 274 వన్డేలు ఆడాడు. 256 ఇన్నింగ్స్ ల్లో 36.26 యావరేజ్ తో 7795 పరుగులు చేశాడు. 9 సెంచరీలతో పాటు 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 7795 పరుగులతో బంగ్లాదేశ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్. తొలి స్థానంలో 8357 పరుగులతో తమీమ్ ఇక్బాల్ అతని కంటే ముందున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో ముష్ఫికర్ రహీమ్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. 260 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలతో 7254 పరుగులు చేశాడు. కుమార్ సంగక్కర (13341), ఎంఎస్ ధోని (10773), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (9410) మాత్రమే అతని కంటే ముందు ఉన్నారు.
JUST IN: Mushfiqur Rahim, Bangladesh's most-capped ODI cricketer, has announced his retirement after 274 matches for his country 🇧🇩 pic.twitter.com/KSAarJjULl
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2025