సమస్యల వలయంలో మూసీ పునరుజ్జీవనం

సమస్యల వలయంలో మూసీ పునరుజ్జీవనం

హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నది మొత్తం పొడవు దాదాపు 260 కిలోమీటర్లు.  వికారాబాద్ కొండలలో  పుట్టే ఈ నది 90 కిలోమీటర్లు ప్రవహించి హైదరాబాద్ చేరుకున్నప్పటి నుంచి కలుషితం అవుతున్నది. నగరంలో దీని పొడవు కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే.  కానీ, హైదరాబాద్ అందించే  విష జలాల ప్రభావం మొత్తం నది మీద పడుతోంది. 20 కిలోమీటర్లలో జరిగే  ప్రకృతి విధ్వంసం ఈ నీటి మీద ఆధారపడిన గ్రామాలు, ప్రజలు, వివిధ వృత్తులకు, మూగజీవాలకు ప్రాణ సంకటంగా మారింది.  

తేటగా కనిపించే నీళ్ళలో అనేక ఖనిజాలు, రసాయనాలు, రసాయన మిశ్రమాలు, భార లోహాలు ఉండవచ్చు.  నల్లటి నీళ్ళలో ఏమేమి ఉన్నాయో పరీక్షిస్తే కానీ తెలియదు.  ప్రతి రోజూ 1800 మిలియన్ లీటర్ల నివాసాల మురికి నీళ్ళు మూసీనదిలో కలుస్తున్నాయని ఒక అంచనా.  అంటే 0.06 TMC.   నగర పరిధిలో ఉన్న పారిశ్రామికవాడల నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థ జలాలు, పటాన్​చెరు 18 కిలోమీటర్ల  పైపులైన్ నుంచి వచ్చే వ్యర్థ జలాలు వంటివి కలిపితే ఇంకా ఎక్కువే ఉండవచ్చు.  

మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవాడలన్నింటి వ్యర్థ జలాలు అంతిమంగా మూసీ నదిలోకి  పారుతాయి. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న జవహర్ నగర్  చెత్తగుట్టల నుంచి వ్యర్ధాల జల ఊట కూడా దగ్గరలో ఉన్న చెరువులకు చేరి, చివరికి మూసీ నదిలోకి వస్తాయి. ఆధునిక జీవనంలో అభివృద్ధికి ఇచ్చే నిర్వచనం పరిశుభ్రత.  మురికి నీటి ప్రక్షాళన, శుద్ధి చేసిన నీటిని తిరిగి వినియోగించడం మానవ నాగరికతలో భాగం.  పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను బయట పారబోసి తమ ఖర్చును ఎట్లా తగ్గించుకుంటాయో, మున్సిపల్​ కార్పొరేషన్ కూడా అట్లే తగ్గించుకుంటున్నది.  హైదరాబాద్​లో  మంచి నీటికి,  మురికి నీటి నిర్వహణకు ఉన్న ప్రత్యేక సంస్థ హైదరాబాద్ జల మండలి. 

స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యాన నడిచే ఈ సంస్థ మురికి నీటి నిర్వహణ మీద 10 రూపాయలు పెడితే,  మంచి నీటి మీద 90 రూపాయలు ఖర్చు చేస్తది.  నగరంలో ప్రత్యేక మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదు.  ఎక్కడపడితే అక్కడ మురుగు నీటిని భూగర్భ పైపులైన్ల ద్వారా, సహజ వాగుల ద్వారా  మూసీ నదిలోకి చేర్చుతున్నారు. పరిపూర్ణ మురుగు నీటి వ్యవస్థకు  దాదాపు రూ.18 వేల కోట్ల పెట్టుబడి కావాలని హైదరాబాద్ జల మండలి అంచనా వేసింది. ఇంకా రెండింతలు ఎక్కువే కావచ్చు. హైదరాబాద్ జల మండలి దగ్గర, తెలంగాణా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి ఈ పెట్టుబడికి అప్పు చేయాల్సిందే.  అప్పు చేసి పెట్టుబడి పెట్టి మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటు చేసింది అనుకుందాం. చేసిన అప్పు ఎవరు కట్టాలి? 

చెరువులలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాలం నుంచి చెరువులలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం మొదలుపెట్టారు. హుసేన్ సాగర్, సరూర్ నగర్,  దుర్గం చెరువు,    అంబర్​పేట్,  అత్తాపూర్  ఉదాహరణలు.  కొత్తవి కూడా చెరువులు, కుంటలలోనే  ఏర్పాటు చేస్తున్నారు. బహుళ అంతస్తులు నాకు,  మురికి నీరు మిగతా అందరికీ.  హైదరాబాద్​లో అంతర్లీనంగా అమలు అవుతున్న ఈ సూత్రాన్ని మూసీ పునరుజ్జీవన పథకం మార్చుతుందా?  నగరంలో ఒకరి ఇంటి నుంచి వచ్చిన మురికి నీరును ఇంకెవరు భరిస్తారు?  ఇక్కడే రాజకీయం ఉన్నది. 

హైదరాబాద్ నగర  మురికి నీరును 40 గ్రామాలు3 దశాబ్దాల నుంచి భరిస్తున్నాయి.  నగరంలో కూడా పైన ఉన్న కాలనీల మురికి నీరు.. కింద ఉన్న కాలనీలకు ప్రవహిస్తోంది. తమ మురికి నీటిని ఖర్చు లేకుండా సహజ వాగులు,  చెరువుల నాలాలు, నదుల గుండా ఇతరులకు చేర్చడమే ఆధునిక నగర అభివృద్ధి.  ఇటువంటి అభివృద్ధికి ప్రతీక హైదరాబాద్ నగరం.  భాగ్యనగరంలో  అభాగ్యులను, భాగ్యులను వేరు చేసేది మురికి నీటి వ్యవస్థ. 

అందరిని కలిపేది మురుగు నీటి వరద.  ఆహారంలో చేరుతున్న మురుగు నీటి  కలుషితాల వల్ల  బాధితులు అనారోగ్యం బారిన పడుతున్నారు. అందుకే ఆధునిక హైదరాబాద్ అభివృద్ధిలో గతి అందుకున్న దిక్కు ఏది అంటే ఆగ్నేయం.  హిమాయత్​నగర్,  ఆదర్శ్ నగర్,  బంజారా హిల్స్,  జూబ్లీహిల్స్,  మాదాపూర్,  నార్సింగి,  కోకాపేట్ ప్రాంతాలలో భూమి రేట్లు పెరగడానికి కారణం, ధనికుల  నివాసాలుగా మారడానికి కారణం అవి పైన ఉండడమే.

మూసీ సమస్యల పరిష్కారానికిఅధ్యయనం చేయాలి

మూసీ పునరుజ్జీవన పథకంలో ఉన్న ఒక ఆలోచన ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు తెచ్చి ఉస్మాన్ సాగర్ (గండిపేట్)లో నింపి,  నిత్యం మూసీనదిలో నీటిని పారబెట్టడం.  మురుగు నీరు కనపడకుండా ‘ఖరీదు’ అయిన మంచి నీటితో పారదోలడం. ఇదొక ఎత్తిపోతల పథకం. అయితే, వ్యవసాయానికి కాకుండా మురుగు నీటిని పలుచన చేసే వినూత్న ఆలోచన. దీనికి పెడుతున్న పేరు మూసీ సుందరీకరణ.  సుందరీకరణ అయ్యేది 20 కిలోమీటర్లు మాత్రమే. మళ్లీ కింద గ్రామాలకు మిగిలేది మురుగు నీటితో కూడిన వరద.

రోజుకు 0.06 TMC వస్తేనే  బెంబేలు ఎత్తుతున్న గ్రామాలు అదనంగా ఇంకొక టీఎంసీ నీళ్ళు వస్తే తట్టుకోగలవా?  ఈ ఖర్చు ఎవరు భరిస్తారు?  ఎట్లాగు అప్పు కాబట్టి అప్పు కట్టేది హైదరాబాద్ నగర ప్రజలా,  సమస్త తెలంగాణా ప్రజలా?  3 దశాబ్దాల మూసీ ధ్వంసాన్ని మార్చాలంటే అంత సులభం కాదు. అనేక సంక్లిష్టతలు ఉన్నాయి. తెలంగాణా ప్రభుత్వం మొట్టమొదట ఈ సంక్లిష్టతలను గుర్తించాలి. వాటిపై ఆధ్యయనాలు చెయ్యాలి.  సమస్యలకు పరిష్కారాలు వెతకాలి.  ప్రజలతో  సంప్ర దింపులు చెయ్యాలి.  ఈ లోపు కొత్త నగర అభివృద్ధిలో ‘సుస్థిరత’ సూత్రాలు అమలు చెయ్యాలి.  కొన్ని విధానాలు మార్చాలి.  సంస్థల ప్రక్షాళన చెయ్యాలి.  కొత్త నియంత్రిత వ్యవస్థ గురించి ఆలోచన చెయ్యాలి.

మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు నిధుల కొరత

నగరంలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి.  కొన్ని కొత్తగా కడుతున్నారు. మొత్తానికి కట్టిన వాటి సామర్థ్యం దాదాపు 700 MLD.  ఇంకా 1100 MLD సామర్థ్యం కట్టాలి. ఈ మధ్య  కట్టినవాటికి కేంద్రం నిధులు ఇచ్చింది. కట్టాల్సిన వాటికి కేంద్రం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. పైపులైన్ల వ్యవస్థకు రూ.18 వేల కోట్లు అయితే.. మొత్తం మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు కట్టినవి ప్రాథమిక స్థాయి శుద్ధి కేంద్రాలు. అంటే ఇవి మురుగు నీటిలో వాసనను, రంగును మార్చగలవు.  మురుగు నీటిని తిరిగి మంచి నీటి స్థాయికి శుద్ధి చెయ్యలంటే ఇంకా ఖర్చు అవుతుంది.

ఈ పెట్టుబడులు,  ఖర్చులు ఎవరు భరించాలి?  కాలుష్యం చేసేవాళ్ళే కట్టాలి.  పర్యావరణ పరిరక్షణ చట్టాలలో ఇది ప్రాథమిక సూత్రం.  మూసీ పునరుజ్జీవన పథకంలో ఈ సూత్రం పాటిస్తారా?  తెలంగాణా ప్రభుత్వంగాని, GHMC గాని ఈ దిశగా అలోచిస్తున్నయా? లేదు.  మురుగు నీరు మూసీనదికి  చేరకుండా ఉండాలంటే మురుగు నీరు దాని దరి చేరకుండా ఆపాలి. అది చెయ్యాలంటే, హైదరాబాద్ నగరంలో నిత్యం ఉత్పన్నమయ్యే మురికి నీరు శుద్ధి చెయ్యాలి.   హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లో, ఇంకా ఇతర అనేక రకాల మాస్టర్ ప్లాన్లలో మురుగు నీటి కాలువలకు, శుద్ధి కేంద్రాలకు జాగా కోసం ప్రణాళిక చెయ్యాలి.

- డా. దొంతి నరసింహారెడ్డి