![మూసీలో అసంపూర్తి ఇండ్ల నేలమట్టం](https://static.v6velugu.com/uploads/2025/02/musi-demolition-activity-resumes-at-chaderghat_Y74DuNy0ml.jpg)
- అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో పూర్తిగా కూల్చేసిన అధికారులు
హైదరాబాద్ సిటీ/మలక్‌పేట, వెలుగు: మూసీ రివర్ బెడ్లో నాలుగు నెలల కింద అసంపూర్తిగా కూల్చిన ఇండ్లను అధికారులు పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. చాదర్‌ఘాట్‌లోని శంకర్‌నగర్, మూసానగర్లోని ఇండ్ల గోడలను బుధవారం కూల్చివేశారు. తర్వాత శిథిలాలను తరలించారు. మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా రివర్ బెడ్లో నిర్మించిన ఇండ్లను తొలగించాలని నాలుగు నెలల కింద ప్రభుత్వం నిర్ణయిచింది. ఆ ఇండ్లల్లో ఉంటున్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి అందులోకి తరలించింది. ఆ వెంటనే ఇండ్లను కూల్చడం ప్రారంభించింది. ప్రతిపక్ష పార్టీల ఆందోళనలతో కూల్చివేతలు కొన్నాళ్లు నిలిచిపోయాయి.
ప్రస్తుతం ఆ ఇండ్లు ఖాళీగా ఉండడంతో ఆకతాయిలకు అడ్డాగా మారాయి. రోజూ రాత్రిళ్లు తాగుబోతులు, గంజాయి బ్యాచ్తిష్ట వేస్తున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. రంగంలోకి దిగిన అధికారులు బుధవారం అసంపూర్తిగా కూల్చిన ఇండ్లను జేసీబీలతో పూర్తిగా తొలగించడం ప్రారంభించారు. చాదర్ ఘాట్ శంకర్‌నగర్ ప్రాంతంలో రివర్ బెడ్ లో ఉన్న కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశారు. మిగతా ప్రాంతాల్లో కూడా పూర్తిగా తొలగించి రివర్ బెడ్ వెంట గోడ కట్టనున్నారు.
ఆందోళన వద్దు: ఎమ్మెల్యే బలాల
మూసీలో మళ్లీ కూల్చివేతలు అంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అలాంటి వదంతలును నమ్మొద్దని మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల కోరారు. ఇండ్లను అసంపూర్తిగా కూల్చడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, దీనిపై తనకు, అధికారులకు పలుమార్లు కంప్లయింట్స్ వచ్చాయన్నారు. స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నందున పూర్తిగా కూల్చేసి, శిథిలాలను తొలగిస్తున్నారని చెప్పారు.