డబుల్ బెడ్రూం ఇండ్లకు మూసీ ఫండ్స్

డబుల్ బెడ్రూం ఇండ్లకు మూసీ ఫండ్స్
  • రూ.1200 కోట్లు బదిలీ చేయనున్న ప్రభుత్వం
  • నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఖర్చు చేయాలని నిర్ణయం
  • రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మి ఆ నిధులు ఖర్చు చేయాలని సీఎం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న డబుల్  ఇండ్ల పనులు వేగం కానున్నాయి. ఇప్పటి వరకు వాటిని పూర్తి చేయడానికి, కాంట్రాక్టర్ల పెండింగ్  బిల్లులు చెల్లించడానికి  నిధుల కొరత ఉండగా , ఆ నిధులను సమీకరించాలని అధికారులను సీఎం రేవంత్  రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో  ప్రస్తుతం 20 వేల డబుల్  బెడ్రూం ఇండ్లు నిర్మాణంలో ఉండగా, 60 వేల నివాసాలకు పనులు చివరి దశకు చేరుకున్నాయి.

అసలు పనులు ప్రారంభం కానివి  32 వేలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పూర్తయిన ఇండ్లకు మౌలిక వసతులను కూడా మూసీ నిధులతో ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల మూసీ సుందరీకరణలో భాగంగా నిరాశ్రయులవుతున్న బాధితులకు 15 వేల డబుల్  బెడ్రూమ్  ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఇండ్లను అధికారులు అప్పగిస్తున్నారు. ఈ 15 వేల ఇండ్ల నిధులను మూసీ రివర్  ఫ్రంట్  కార్పొరేషన్  నుంచి తీసుకొని డబుల్ బెడ్రూమ్  ఇళ్లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

అర్బన్ లో ఒక్కో డబుల్  బెడ్రూమ్  ఇంటికి సుమారు  రూ.8 లక్షలు ఖర్చు చేశారు. 15 వేల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 8 లక్షల చొప్పున సుమారు రూ.1200 కోట్లు మూసీ రివర్  ఫ్రంట్  కార్పొరేషన్  నుంచి హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు బదిలీ కానున్నాయి. ఇటీవల బడ్జెట్ లో మూసీ రెనొవేషన్ కు రూ. 1500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

పీఎం ఆవాస్ నుంచి మరికొన్ని ఫండ్స్ 

రాష్ర్టంలో నిర్మాణం పూర్తయిన డబుల్  ఇండ్లను దసరాలోపు లబ్ధిదారులకు అందజేయాలని, ఇందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించాలని హౌసింగ్  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ర్టంలో 39 వేల డబుల్  బెడ్రూమ్   ఇళ్లు ( జీహెచ్ఎంసీ మినహా ) పంపిణీకి రెడీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటితో పాటు గ్రేటర్ లో మూసీ నిర్వాసితులకు పోను మిగిలిన, పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

పీఎం ఆవాస్  యోజన స్కీంలో లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేసిన  తరువాత వాటి వివరాలను కేంద్రానికి పంపితే కేంద్రం ఫండ్స్  రిలీజ్  చేస్తుంది. దీంతో ఈ స్కీం కింద కూడా వచ్చే నిధులను నిర్మాణంలో ఉన్న డబుల్  ఇండ్ల నిర్మాణానికి, కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. గత ఏడాదిలో కొత్త ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సీఎం, మంత్రులు.. ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి ఫండ్స్  ఇవ్వాలని విన్నవించగా పీఎం ఆవాస్  పెండింగ్  బిల్లులను దశలవారీగా రిలీజ్  చేస్తున్నారు. ఇక రాష్ర్టవ్యాప్తంగా జిల్లాలు, జీహెచ్ఎంసీ పరిధిలో సాంక్షన్  అయి పనులు ప్రారంభంకాని ఇండ్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

రాజీవ్  స్వగృహ ఫండ్స్ కూడా డబుల్  నివాసాలకే

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజీవ్  స్వగృహ అపార్ట్ మెంట్లు, ప్లాట్ల వేలానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని హౌసింగ్  అధికారులు చెబుతున్నారు.  హైదరాబాద్ లో రాజీవ్  స్వగృహ టవర్లు బండ్లగూడ, పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్, ఖమ్మంలో టవర్ల వారీగా, సింగిల్, డబుల్, ట్రిపుల్, త్రిపుల్ డీలక్స్  ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. జాగాలు, అపార్ట్ మెంట్ల వేలంతో సుమారు  రూ. 2700 కోట్ల రెవెన్యూ వస్తుందని అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. 9 జిల్లాల్లో 100 గజాల నుంచి 250 గజాల వరకు 1,342 ప్లాట్లు వేలానికి రెడీగా ఉన్నాయి. 

ఆ జాగాలతో పాటు టవర్లను కూడా వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. టవర్లను గంపగుత్తగా కొనేందుకు బిల్డర్లు, రియల్  ఎస్టేట్ కంపెనీలు ముందుకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, గత బీఆర్ఎస్  ప్రభుత్వం వీరు కొనేందుకు ముందుకు వచ్చినా.. రూల్స్  సవరిస్తే కొంటామని అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో ముందుగా చెల్లించే డిపాజిట్  టైమ్ 15 రోజుల నుంచి నెలకు పెంచాలని,  ఫైనల్  పేమేంట్  చెల్లించేందుకు 6 నెలల గడువు ఇవ్వాలని బిల్డర్లు కోరారు.

ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో అప్పటి హౌసింగ్  మంత్రి ప్రశాంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లినా రూల్స్  సవరించలేదు. ఇపుడు వేలంవేసే టైమ్ లో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అడిగితే రూల్స్  సవరించి వాటిని అమ్మాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.