మూసీ ప్రక్షాళన సరే.. డ్రైనేజీ కట్టడికి చర్యలేవి?: కిషన్​రెడ్డి

మూసీ ప్రక్షాళన సరే.. డ్రైనేజీ కట్టడికి చర్యలేవి?: కిషన్​రెడ్డి
  • మూసీ పేరిట రియల్​ఎస్టేట్​దందా!
  • పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోం
  • సర్కార్​ తీరుతో ప్రజలుభయం భయంగా బతుకుతున్నరు
  • నదికి రెండు వైపులా రిటైనింగ్ ​వాల్స్​ కట్టాలని డిమాండ్​అంబర్​పేట్​లో మూసీ నిద్ర

ముషీరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతున్నదని బీజేపీ స్టేట్​ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గండిపేట్ నుంచి చౌటుప్పల్ వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజీ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. నదికి రెండు వైపులా రిటైనింగ్​ వాల్స్​ కట్టాలని డిమాండ్​ చేశారు.పేదల ఇండ్లను కూలిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇండ్లు కూల్చేస్తారన్న భయంతో మూసీ పరిసరాల్లోని పేదలు అనారోగ్యాల పాలవుతున్నారని,  వారికి తాము అండగా ఉంటామని చెప్పారు. ‘‘మూసీ నదిని ప్రక్షాళన చేయండి.. కానీ పేదల ఇండ్లను కూల్చొద్దు” అనే నినాదంతో బీజేపీ నేతలు శనివారం రాత్రి మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. 

అంబర్​పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసీరామ్​నగర్​ ఏరియాలో  కిషన్ రెడ్డి పర్యటించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే భోజనం చేసి మూసీ నిద్ర చేపట్టారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మూసీ నదికి ఇరువైపుల నివాసం ఉంటున్న ప్రజల ఇండ్లను కూలుస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నది. ఎవరు అడ్డొచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదంటూ సీఎం చెప్తున్నరు. ముఖ్యమంత్రి ప్రకటనతో మూసీ ఏరియాలోని ప్రజలు భయం భయంగా బతుకుతున్నరు. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి ఇండ్లు కూలుస్తదోనని అనారోగ్యాల పాలవుతున్నరు. పేదలకు ఇండ్లు ఇవ్వకుండా, వారిని ఆదుకోకుండా.. ఇండ్లను కూలగొడ్తామని ప్రకటనలు చేయడం ఏమిటి?” అని ప్రశ్నించారు. 

కూల్చాలనే ఆలోచన విరమించుకోవాలి

మూసీ నిర్వాసితుల కోసం గత 4నెలలుగా బీజేపీ ఆందోళనలు చేస్తున్నదని, వారికి జాతీయ పార్టీగా ధైర్యం చెప్తున్నదని కిషన్​రెడ్డి అన్నారు. పేదల ఇండ్లు కూల్చనివ్వబోమని, కూల్చాలనే ఆలోచనలను ప్రభు త్వం విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. ‘‘రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత శక్తి ఉందో, ఎంత డబ్బు ఉందో మాకు తెలియదు. కానీ, మూసీ బ్యూటిఫికేషన్ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు సోనియా గాంధీ ఇస్తరా... రాహుల్ గాంధీ ఇస్తరా..? ఎక్కడి నుంచి తెస్తరు?”అని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలు మూసీ ఏరియాలో ఇండ్లు కట్టుకున్నారనే విషయం సీఎం రేవంత్​రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. కాగా.. మూసీ నిద్రలో భాగంగా మూసరాంబాగ్ శాలివాహన నగర్ లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పర్యటించారు.  స్థానికులతో ఆయన మాట్లాడారు. అనంతరం అక్కడే భోజనం చేసి.. నిద్ర చేశారు.  కమలానగర్ లో మాజీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి,  శాస్త్రి నగర్ లో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మూసీ నిద్రలో పాల్గొన్నారు.