ఫ్రెంచ్ మహా రచయిత విక్టర్ హ్యూగో అన్నట్టు ‘NO FORCE ON EARTH CAN STOP AN IDEA WHOSE TIME HAS COME’ మూసీ పునరుజ్జీవం కోసం పుట్టిన ఆలోచనకు, సంకల్పానికి ఇప్పుడు సమయం వచ్చింది. దాన్ని నెరవేర్చే నాయకుడు, ఆకుంఠిత దీక్షాదారుడు రేవంత్ రెడ్డి రూపంలో వచ్చాడు. ఇక ఈ భూలోకంలో ఏ శక్తి ఈ సంకల్పాన్ని ఆపలేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను.. ‘పేరులో మిషన్.. జేబులో కమిషన్’ అనే రీతిలో చేపట్టారు.
అందుకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఉదాహారణలు ఎన్నో ఉన్నాయి. పదేండ్ల గ్రహణం తర్వాత తెలంగాణోదయం జరుగుతోంది. ఈ పదినెలల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రగతి వెలుగులు విరజిమ్ముతూ కనిపిస్తోంది. మనిషికి – నదికి అవినాభావ సంబంధం ఉంది. సివిలైజేషన్ మొత్తం నదీ కేంద్రంగానే సాగింది.
70శాతం మహానగరాలు ఇలా ఉద్భవించినవే
అలా మన భాగ్యనగరంలోని మూసీ సైతం రామలింగేశ్వరుడి పాదాల దగ్గర జనించి మోజెస్ – మూసా, ఈసా – ఈషా రెండు నదుల సంగమం అయింది. అది పవిత్ర మక్కా మసీదు ఆలవాలమైన పాత నగరం గుండా పారుతూ నిజమైన మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మూసీ పునరుజ్జీవం కేవలం హైదరాబాద్‌కే కాదు. యావత్ తెలంగాణ తద్వారా మొత్తం దేశానికే అన్నిరకాలుగా ఉపయోగపడే ప్రాజెక్ట్. చార్మినార్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ట్యాంక్ బండ్ వంటి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు మన హైదరాబాద్ నెలవు. దశాబ్దాలుగా వీటిని నాశనం చేసేలా మూసీని ప్రగతి పేరుతో చంపేస్తూ వచ్చారు. నదిని తల్లితో పోల్చే సంస్కృతి మనది, ఇలా మూసీని నిర్లక్ష్యం చేయడం మాతృమూర్తిని చంపినంతటి పాపం.
మూసీ నిర్లక్ష్యంతో ప్రకృతి ప్రకోపం
మూసీ నిర్లక్ష్యం గ్లోబల్ వార్మింగ్‌కు, తద్వారా జరిగే ప్రకృతి ప్రకోపానికి కారణమౌతుంది. అందువల్ల వచ్చే అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, గొంతెం డిపోయే కరువులు సమీప భవిష్యత్తులో సంభవిస్తాయి. అందుకే ఇప్పటికే మూసీ పునరుజ్జీవం జరిగి కోటిమందికి పైగా నివసించే హైదరాబాద్ వాసులకు ప్రకృతి కష్టాలను, నష్టాలను తొలగించాల్సి ఉంది. ఇది కేవలం నేడున్న కోటి మంది హైదరాబాద్ జనాభాకే కాదు.
యావత్ తెలంగాణ నాలుగు కోట్ల జనాభాకు సంబంధించింది. కానీ, గత పాలకులు మా చేతులకెందుకు బురందంటాలి అన్న చందంగా స్వార్థంతో వ్యవహరించారు. కేవలం నేడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ప్రజా సంక్షేమం కోసం, విస్తృత తెలంగాణ ప్రయోజనాల కోసం మూసీని ప్రక్షాళన చేసి, మురికి కూపం నుంచి నిర్వాసితుల్ని ఆదుకుంటున్నారు. తనకు బురద అంటినా సరే, రేపటి తరం బాగుండాలే అనే సంకల్పంతో రక్షిస్తున్నారు.
అభివృద్ధిలో బ్యాలెన్స్ ఉండాలి
దురదృష్టవశాత్తు కేబుల్ బ్రిడ్జి నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకూ ఒక్క వీధినే చూపించి డెవలప్మెంట్ అని భ్రమలు కల్పించారు. ఆ ఒక్క వీధి కాకుండా హైదరాబాద్‌లోని మిగతా చాదర్ ఘాట్, సీతాఫల్ మండి, సికింద్రాబాద్, చిక్కడపల్లిలను ఎందుకు అభివృద్ధి నమూనాలుగా చూపలేదు. ఇందులో ప్రభుత్వ కట్టడాలు కానీ, భాగస్వామ్యం కానీ లేదు. కానీ, ఇందులో కమీషన్లు నొక్కుతూ తన ఘనతగా కేటీఆర్ చెప్పుకుంటే ఇక ఆయన తండ్రి కేసీఆర్ సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, ఒక్క అమరుని ఫొటోలేని అమరుల స్థూపాన్ని మాత్రమే చూపించి పబ్బం గడుపుకున్నారు.
బెస్ట్ టూరిజం సెంటర్‌గా..
మూసీ పునరుజ్జీవంలో అన్ని రంగాలకు అభివృద్ధి చెందేలా అవకాశం కల్పించే టూరిజం డెవలప్మెంట్ అనేది మరో ప్రధానాంశం. సమ్మర్ వచ్చినా, సెలవులు వచ్చినా సింగపూర్, హాంకాంగ్, దుబాయ్ మొదలు మాల్దీవులు, ఊటీ, బెంగళూరు, ఢిల్లీ ఇలా ఎక్కడెక్కడికో వెళతాం. తద్వారా ఆయా ప్రాంతాల్లో రిక్షా కార్మికుడు మొదలు బెంజ్ నడిపేవాడిదాకా, రోడ్డుపై పూలు, పండ్లు అమ్ముకునేవారు మొదలు పైవ్ స్టార్ హోటళ్ల దాకా అందరూ లబ్ధి పొంది తమ ఆర్థిక వ్యవస్థనే అభివృద్ధి చేసుకుంటున్నారు. మన ప్రజలెందుకు లబ్ధి పొందొద్దు?
అభివృద్ధి మన రిక్షా కార్మికుడికి, గిగ్ వర్కర్‌కి దక్కొద్దా...
అత్యుత్తమ వసతులు అన్ని రకాలుగా ఉంటేనే టూరిస్టులు వస్తారు. పొద్దున వాడుకునే బాత్రూం మొదలు, రాత్రి పడుకునే బెడ్డు వరకూ అన్ని సౌలత్ గా ఉండాలి. అందుకే మన దగ్గరా అత్యుత్తమ ఫెసిలిటీస్ రావాలి. ఇప్పటికే చార్మినార్, గోల్కొండ, టూంబ్స్ వంటి చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఈ హెరిటేజ్‌కు మోడర్న్ స్ట్రక్చర్స్ తోడైతేనే టూరిజం అభివృద్ధి చెందుతుంది. ఇవి జరిగితేనే వీధి వ్యాపారాలు మొదలు అన్నిరంగాల్లో మన సిటీలో, మన రాష్ట్రంలో అవకాశాలు అందిపుచ్చుకొని ఎదుగుతారు.
హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాల చలువే
నీళ్ల చోటును లాగేసుకొని విచ్చలవిడిగా అవి జనావాసంలోకి వచ్చి నష్టపరుస్తుంటే... నేడు నీళ్ల స్థానాల్ని తిరిగి నీటికి అప్పజెప్తుంటే తప్పనడం విడ్డూరం. పైగా ఆ నిర్వాసితులకు సైతం శాశ్వత ఇండ్లు ఇచ్చి, ఖర్చులకు డబ్బులిచ్చి చేయడం గొప్పపని. అందుకే హైదరాబాద్‌కు నాడు రింగురోడ్డు, ఎయిర్ పోర్టు కట్టి, మెట్రోను మొదలుపెట్టి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్టుకు, ఫార్మాసిటీలను ఏర్పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. నేడు మూసీ పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మార్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణను నిజాం నుంచి సర్దార్ పటేల్, ఐటీ హంగులతో రాజీవ్ గాంధీ, ఆర్థిక సంస్కరణలతో పీవీ, స్వరాష్ట్రాన్ని ఇచ్చి సోనియమ్మ, రాహుల్ చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవం ద్వారా రేవంత్ రెడ్డి ఆ వరుసలో నిలుస్తారు.
ఐ సపోర్ట్ మూసీ అందాం
మరో ఐదేండ్లలో అత్యుత్తమ సిటీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మొదటి ఐదు పేర్లలో నిలిచేలా హైదరాబాద్ కాబోతుంది. అందుకే ఈ ఘనత చేయ చాతకాని బీఆర్ఎస్.. చేస్తున్నవాళ్లను వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తున్నది. కానీ, మన బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఈ ప్రాజెక్టును కట్టాలని మనం నినదించాలి. మూసీ చెయ్యలా కాదు. చేద్దాం అనాలి. ఎలా చేద్దాం, ఎంత మంచిగ చేద్దామో చెప్పాలి. అందుకే ప్రతి ఒక్కరం I Support Musi అందాం.
మూసీని ఒక గ్రోత్ ఇంజిన్ చేద్దాం
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో అటు గ్లోబల్ వార్మింగ్ తద్వారా సంభవించే వరదలనునివారించగలుగుతాం. ఇటు టూరిస్ట్ హబ్ గా ప్రపంచ పటంలో నిలిపే అవకాశాలను పొందుతాం. ఇలా మూసీ పునరుజ్జీవం అనేది రాష్ట్రానికి, దేశానికి గ్రోత్ ఇంజిన్. గతంలో సుందర చెరువులతో ఉన్న భాగ్యనగరంలోని 400కు పైగా చెరువులను కబ్జా చేసింది బీఆర్ఎస్ నేతలే. వాటితో రియల్ ఎస్టేట్ దందాలు చేసి అందినకాడికి కమీషన్లు గుంజింది వాళ్లే. ఇప్పుడు వాళ్లే వచ్చి అడ్డుకుంటామంటున్నారు.
సంజీవిని లాంటిది
గతంలో దావోస్ పర్యటనల్లో, ఇతర విదేశీ పర్యటనల్లో ఫొటోలకు ఫోజులు, ట్విట్టర్లో కూతలు అన్నట్టుగానే కేటీఆర్ అతని అనుచరగణం వ్యవహరించారు. అంతర్జాతీయ వేదికల్లో చినుకు తడికే మీ నగరం మునిగిపోతుంటే, గ్లోబల్ వార్మింగ్ పెరిగితే అనవాళ్లు లేకుండా పోదా... అలాంటి చోట మేమెలా పెట్టుబడులు పెట్టాలి అని అడిగితే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. మీ సిటీని కాపాడడానికి మీరేం చేస్తున్నారు? అని అడిగితే చెప్పలేక పైపై పూతలతో నెట్టుకొచ్చారు. ట్రిలియన్ ఎకానమీగా మారాలంటే అందుకు ఇంధన చోదకం హైదరాబాద్ మాత్రమే. ఎప్పుడైతే మన సిటీ 600 బిలియన్ ఎకానమీగా మారుతుందో అప్పుడే దేశం లక్ష్యం నెరవేరుతుంది. ఇందుకు మూసీ పునరుజ్జీవన పథకం ఒక సంజీవినీ లాంటిది. ఇది అన్నిరంగాల్లో ఇప్పుడున్న గ్రోత్ ను సూపర్ గ్రోత్ గా ముందుకు తీసుకెళుతోంది.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,టీశాట్ సీఈవో–