- ప్రపంచ నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తం
- డ్రై పోర్ట్ ఏర్పాటు చేసి బందర్ ఓడరేవుతో అనుసంధానిస్తం
- సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే హైదరాబాద్‌ను చైనాకు ప్లస్ సిటీగా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే గొప్ప నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలనుకుంటున్నామని, ఇందులో సేవారంగం మాత్రమే ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించామని, హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన ఫోర్త్ సిటీ.. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి నగరాలతో పోటీ పడేలా ఉంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలో శుక్రవారం నిర్వహించిన సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను వరదల్లేని నగరంగా తీర్చిదిద్దేలా అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ హైదరాబాద్ ను కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్టీసీలోకి 3,200 ఈవీ బస్సులను తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈవీలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామని చెప్పారు. దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.
మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నామని, 2050 నాటికి మహా నగరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణను ఇప్పటి నుంచే రూపొందిస్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ మధ్య ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతాలు తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతున్నాయని తెలిపారు. తెలంగాణకు తీరప్రాంతం లేదని, అందుకే రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేసి ఏపీలోని మచిలీపట్నం పోర్ట్‌ను అనుసంధానం చేస్తూ.. రోడ్డు, రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 360 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని, దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్‌కు ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. దీనిని మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో తోడ్పడాలని విజ్ఞప్తి చేశామన్నారు.
చైనా తరహాలో క్లస్టర్లు ఏర్పాటు
హైదరాబాద్‌లో చైనా తరహా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, అవుటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రతి ఏటా లక్షా పదివేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారని చెప్పారు. అయితే, ఎక్కువ మంది విద్యార్థుల్లో స్కిల్ ఉండడం లేదని తెలిపారు. టాటా గ్రూప్‌తో కలిసి 2,400 కోట్లతో రాష్ట్రంలోని ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని వివరించారు.
నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఐఎస్ బీ తరహాలో స్కిల్ యూనివర్సిటీ కోసం ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ కోసం సీఐఐ ప్రతినిధులు మద్దతు ఇవ్వాలని కోరారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీఐఐ ప్రతినిధులు ఎప్పుడైనా వచ్చి తనను కలవచ్చని, తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.