మూసీ పై బ్రిడ్జిలు మంచిగున్నయా

మూసీ పై బ్రిడ్జిలు మంచిగున్నయా
  • చెక్​ చేయించనున్న మూసీ రివర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ 
  •  నిజాం హయాంలో కట్టిన 17 బ్రిడ్జిలను పరిశీలించాలని నిర్ణయం
  •  ముంబైకి చెందిన కంపెనీకి బాధ్యతలు  

హైదరాబాద్, వెలుగు : మూసీ నది సుందరికీరణ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ రివర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే మూసీ పరీవాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు తాజాగా మూసీపై నిజాం కాలంలో 58 కిలోమీటర్ల పొడవున నిర్మించిన17 బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దశాబ్ధాల కింద నిర్మించిన ఈ బ్రిడ్జిలు స్ట్రాంగ్​గా ఉన్నాయా లేవా? ఇంకా ఎంత కాలం తట్టుకుని నిలబడగలవు? లాంటి అంశాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఓ ఏజెన్సీని నియమించింది. 

పురాణాపూల్​, చాదర్​ఘాట్​తో పాటు మరో 15​..

మూసీపై నిర్మించిన బ్రిడ్జిల్లో నయాపూల్​(పాతది, కొత్తది), పురాణాపూల్​(పాతది,కొత్తది), నాగోల్​ (ఓల్డ్​ అండ్​ న్యూ), ఇమ్లిబన్​( ఇన్​ అండ్​ ఔట్​), ముస్లింజంగ్​(ఓల్డ్​ అండ్​ న్యూ), టిప్పు ఖాన్​(ఓల్డ్​ అండ్​న్యూ), బాపూఘాట్, సాలార్​జంగ్, అత్తాపూర్​, చాదర్​ఘాట్​, గోల్నాక బ్రిడ్జిలను పరిశీలించనున్నారు. ఈ బ్రిడ్జిలు నిజాం కాలంలో నిర్మించినవి కావడం, చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే కూల్చడం కంటే..వారసత్వ కట్టడాలుగా భావించి రిపేర్లు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు. 

ముంబై కంపెనీకి బాధ్యతలు 

బ్రిడ్జిల పటిష్టత పరీక్షలు నిర్వహించేందుకు పలు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించి ముంబైకి చెందిన  స్ర్టక్ట్​వెల్​ డిజైనర్స్​ అండ్​ కన్సల్టెంట్స్​ ప్రైవేట్ ​లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా బ్రిడ్జిల పటిష్టతను పరిశీలించడానికి సదరు కంపెనీ రీబౌండ్​ హ్యామర్​ టెస్ట్​, గ్రౌండ్​ పెనిట్రేటింగ్​ రాడార్​, డైనమిక్​ లోడ్​ టెస్టింగ్స్​నిర్వహించనున్నది. రెండు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది. 

 రెస్టారెంట్లు, ఎమ్యూజ్​మెంట్​పార్కులు

తూర్పున ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి నుంచి మొదలుకుని పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు నార్సింగి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో ఇప్పటికే ప్లాన్లు రూపొందించారు. మూడేండ్లలో మూసీ అభివృద్ధి పనులు పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. విదేశాల్లో పలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించిన అధికారుల బృందం మూసీ అభివృద్ధికి రూ.58 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసింది.

మూసీనది అభివృద్ధిలో భాగంగా పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాక్స్​, గ్రీన్​వేలు , హాకర్​జోన్లు, వంతెనలు, వినోద, పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మురికికూపంగా మారిన మూసీని ఉపాధి కల్పనా జోన్​గా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.  అలాగే నదికి రెండువైపులా ఉన్న భూమిని పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. నదిలో మురుగును పూర్తిగా మళ్లించడం, ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు.