- పలు చోట్ల టీమ్స్‌ను అడ్డుకున్న కొందరు స్థానికులు, లీడర్లు
- తాము ఎక్కడికీ వెళ్లబోమంటూ ఆందోళనలు
- ‘కారం తీసుకురండి.. అధికారులను తరిమేయండి’ అంటూ నివాసితులను రెచ్చగొట్టిన లోకల్ లీడర్లు
- కొన్నిచోట్ల షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి మరో 33 కుటుంబాల తరలింపు.. వాళ్ల పిల్లల చదువుకు ఇబ్బందులు
- లేకుండా సమీప స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు
హైదరాబాద్ సిటీ / ఎల్బీనగర్, వెలుగు : మూసీ రివర్‌బెడ్‌లో రెవెన్యూ అధికారులు చేస్తున్న సర్వేకు రెండో రోజు శుక్రవారం కొన్ని చోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి. సర్వేకు వచ్చిన అధికారులను కొందరు స్థానికులు, లోకల్ లీడర్లు అడ్డుకున్నారు. ‘ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం.. ఎక్కడికీ పోం’ అంటూ నిరసనలకు దిగారు. పలు చోట్ల మాత్రం రివర్ బెడ్లోని వాళ్లు ముందుకు వచ్చి.. తమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. 33 కుటుంబాలను ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు అధికారులు తరలించారు.
కొనసాగిన మార్కింగ్..
చైతన్యపురి, లంగర్‌హౌస్, రాజేంద్రనగర్, పురానాపూల్, జియాగూడ, బహదూర్‌పురా వంటి ఏరియాల్లో సర్వే సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైతన్యపురిలో నివాసం ఉంటున్న వారికి మద్దతుగా బీజేపీ ఆందోళన చేపట్టింది. అయితే చాలాచోట్ల మూసీ రివర్‌బెడ్‌లో ఉన్నవారు డబుల్బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని, కానీ కొందరు కావాలనే వాళ్లను రెచ్చగొడుతున్నారని అధికారులు అంటున్నారు. అక్కడక్కడా ఆందోళనలు జరుగుతున్నా, అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.
రాజేంద్రనగర్ మండల పరిధిలో మూసీ రివర్‌బెడ్‌లో 300 ఇండ్లు ఉన్నట్టు గుర్తించి, ఇప్పటికే 150 ఇండ్లకు రెడ్ మార్క్ వేయగా.. శుక్రవారం మరో 57 ఇండ్లకు మార్క్ వేశారు. రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ లో 111 ఇండ్లకు రెడ్ మార్క్ వేశారు. గండిపేట్ మండల పరిధిలో 32 నిర్మాణాలను నివాసితులు ఇప్పటికే స్వచ్ఛందంగా కూల్చివేసుకోగా, మిగిలిన వారు శుక్రవారం కూల్చివేశారు. హైదరాబాద్ జిల్లాలో 1,077 నిర్మాణాలను గుర్తించిన అధికారులు.. ఫీల్డ్ లోకి వెళ్లాక 1,500కు పైనే కట్టడాలు ఉన్నట్టు గుర్తించి మార్కింగ్ చేశారు.
గురువారం 940 నిర్మాణాలకు మార్కింగ్ చేయగా, శుక్రవారం చాలా వరకు పూర్తి చేశారు. నాంపల్లి, బహదూర్ పురా మండలాల్లో, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కొన్ని నిర్మాణాలు మార్కింగ్చేయనివి ఉన్నాయని.. శనివారం అవి కూడా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
ఎక్కడెక్కడ ఆందోళనలు జరిగాయంటే..
రాజేంద్రనగర్ లో అధికారులు మార్కింగ్చేయడానికి రాగా.. రివర్ బెడ్ లో ఉన్న వారితో పాటు బఫర్ జోన్ లో ఉన్నవారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ ఇండ్లకు మార్కింగ్చేశారు. జియాగూడ పరిధిలోని మూసీ రివర్ బెడ్ లో మార్కింగ్ చేస్తుండగా వంద మందికి పైగా బాధితులు పటేల్ హోటల్ వద్ద నిరసనకు దిగారు. నాంపల్లి మండల పరిధిలో పురానాపూల్దర్వాజ దగ్గర కూడా మూసీ రివర్బెడ్, బఫర్జోన్వాసులు అధికారుల మార్కింగ్‌ను అడ్డుకున్నారు. లంగర్ హౌస్‌లో రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తుండగా కొందరు అడ్డుకున్నారు.
పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే 102 పిల్లర్ నంబర్ వద్ద మూసీ రివర్ అలైన్మెంట్తప్పుగా సర్వే జరిగిందని.. రాందేవ్ గూడ, లంగర్ హౌస్, అంబేద్కర్ నగర్, బాపూనగర్, డిఫెన్స్ కాలనీలకు చెందిన సుమారు 150 మంది ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అత్తాపూర్ వైపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వారిని సముదాయించి, మూసీ రివర్ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడిస్తామని చెప్పారు. సౌత్ అండ్ వెస్ట్ జోన్ అడిషనల్డీసీపీ అశ్వక్ ఆధ్వర్యంలో 10 మందిని ప్రగతిభవన్ కు తీసుకువెళ్లారు. అక్కడ ప్లానింగ్ కమిటీ చైర్మన్ చెన్నారెడ్డిని కలిసి బాధితులు వినతి పత్రం ఇచ్చారు. అలాగే కాశీబుగ్గ టెంపుల్వద్ద మూసీ రివర్ బెడ్, బఫర్‌జోన్ వాసులు రోడ్డుపై బైఠాయించారు.
కారం తీసుకురండి..అధికారులను తరిమేయండి
కొత్తపేటలోని సత్యనగర్, చైతన్యపురిలోని మారుతి నగర్, ఫణిగిరి కాలనీల్లోని మూసీ రివర్బెడ్, బఫర్జోన్వాసులతో కలిసి బీజేపీ లీడర్లు, కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఉదయం 9:30 గంటలకు సత్యనగర్ చేరుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అక్కడి రివర్బెడ్ఇండ్లను పరిశీలించారు. తర్వాత మారుతీనగర్‌కు వెళ్లి అప్పటికే మార్కింగ్చేస్తున్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. వై జంక్షన్‌వద్ద రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్అధ్యక్షుడు సామ రంగారెడ్డి, స్థానిక బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బైఠాయించారు. మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు.
ఆ తర్వాత కార్పొరేటర్లు సత్యనగర్వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వారిని అధికారులు షిఫ్ట్ చేస్తుండగా అడ్డుకున్నారు. ‘మేం ఉన్నాం మీ వెంట..వెళ్లొద్దు..ఆఫీసర్లు అట్లనే చెప్తరు’ అంటూ తహసీల్దార్, అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో అధికారులపై దాడికి యత్నించారు. ‘కారం తీసుకురండి.. అధికారులను ఇక్కడి నుంచి తరిమేయండి’ అంటూ అక్కడున్న వారిని లీడర్లు రెచ్చగొట్టారు. డబుల్ ఇండ్లకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలపై దాడి చేశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే వాహనాలను తగలబెడతామని హెచ్చరించడంతో డీసీఎం డ్రైవర్లు, అధికారులు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ అక్కడి నుంచి చెదరగొట్టారు.
రాత్రి 7 గంటల కు హనుమాన్ టెంపుల్లో మారుతీనగర్ కాలనీ పెద్దలతో ఈటల మాట్లాడారు. అక్కడికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వచ్చి ఈటలకు మద్దతు పలికారు. రాత్రంతా నిరసన తెలపాలని బీజేపీ లీడర్లు అనుకున్నా రాత్రి 9 గంటల ఈటల అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎఫ్టీఎల్పరిధిలో ఉన్న పేదల ఇండ్లు కూలగొట్టమని పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు.. ఎక్కడో కూర్చుని మాట్లాడడం కాదు. ప్రజల మధ్యకు వచ్చి భరోసా ఇవ్వాలె. దొంగల్లా వచ్చి శనివారం, ఆదివారం ఇండ్లను కూలగొడతామంటే చూస్తూ ఊరుకోం’’ అని హెచ్చరించారు.
డబుల్ ఇండ్లలోకి మరో 33 కుటుంబాలు
ఓవైపు ఆందోళనలు జరుగుతుండగా, మరోవైపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నోళ్లను అధికారులు ప్రభుత్వ ఖర్చులతో తరలిస్తున్నారు. గురువారం జై భవానినగర్ నుంచి 11 కుటుంబాలను వనస్థలిపురంలోని డబుల్బెడ్రూమ్ ఇండ్లలోకి తరలించగా.. శుక్రవారం మరో 9 కుటుంబాలను తరలించారు. అలాగే నాంపల్లి మండలంలో 11 కుటుంబాలను జియాగూడ డబుల్ ఇండ్లలోకి, హిమాయత్నగర్మండలం నుంచి 9 కుటుంబాలను పిల్లి గుడిసెల్లోని ఇండ్లలోకి తరలించారు. రాజేంద్ర నగర్ పరిధిలో మరో నాలుగు కుంటుంబాలను కూడా డబుల్ఇండ్లలోకి తరలించారు. వనస్థలిపురంలో 97, తిమ్మాయిగూడలో 100, ప్రతాపసింగారంలో 40 డబుల్బెడ్రూం ఇండ్లు ఖాళీగా ఉన్నాయని..
మూసీ రివర్ బెడ్వాసులు ఎక్కడ కోరుకున్నా ఇస్తామని కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి తెలిపారు. కాగా, మూసీ రివర్ బెడ్ వాసులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.. వాళ్ల పిల్లల చదువులకు ఇబ్బందుల్లేకుండా సమీపంలోకి స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. మరోవైపు మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్లలో ఇండ్లను కోల్పోతున్న వారికి సాయం చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా 14 మందిని నియమించింది. బాధితులను డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు తరలించేందుకు ఈ సిబ్బంది సాయం అందించనున్నారు.