- రక్షణ శాఖ భూముల వ్యవహారం కొలిక్కి
- నాలుగు విడతల్లో మూసీ పునరుజ్జీవం
- తొలి దశ పనులకు రూ. 5,863 కోట్లు అవసరమని ఎంఆర్డీసీఎల్ అంచనా
- ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 4 వేల కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవం పనులను వచ్చే నెలలో బాపు ఘాట్ దగ్గర మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే బాపు ఘాట్ వద్ద పనులకు డీపీఆర్పూర్తయింది. వివరాలను కూడా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. పైగా ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ పునరుజ్జీవనం కోసం రూ.4 వేల కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్వచ్చింది. బాపు ఘాట్ దగ్గర ఉన్న రక్షణ శాఖ భూముల విషయంలోనూ కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
ఈ విషయంలో ఒక అడుగు ముందుకుపడగానే పనులను మరింత స్పీడప్చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది బాపు ఘాట్దగ్గర 90 శాతం పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. ఆ తరువాత మిగిలిన 55 కిలో మీటర్ల మూసీ స్టెచ్లో దశల వారీగా పనులను పూర్తి చేసుకుంటూ వెళ్లనుంది.
2030 నాటికి మొత్తం కంప్లీట్
2030 నాటికి మూసీ పునరుజ్జీవం మొత్తం కంప్లీట్చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మల్లన్న సాగర్‌నుంచి మంచి నీటిని తీసుకునేందుకు ట్రంక్పైప్లైన్ కోసం టెండర్లను కూడా పిలిచినట్లు తెలిసింది. మూసీ పునరుజ్జీవంకు సంబంధించి ప్రభుత్వం రివర్ బెడ్ లో ఉన్న వాళ్లను తరలించే క్రమంలో ఆందోళనలు జరిగాయి. దీంతో ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో సాయం అందించింది.
ఇప్పుడు బీజేపీ పార్టీలోని పెద్దలు సైతం మూసీ పునరుజ్జీవం మంచి విషయమని సపోర్ట్ చేస్తుండటంతో వేగంగా పనులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒక్కో ప్రాంతాన్ని పూర్తి చేసుకుంటూ వెళితే.. బఫర్ జోన్లో ఉన్న వారు కూడా అంగీకరించి.. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
నాలుగు లక్ష్యాలతో ముందుకు
నాలుగు లక్ష్యాలతో మూసీ పునరుజ్జీవాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. తొలుత నదీ జలాల శుద్ధితోపాటు వర్షపునీటి నిర్వహణ, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ , రెండో లక్ష్యం ల్యాండ్‌స్కేపింగ్‌ను అభివృద్ధి చేయడం, మూడోది మూసీ పరీవాహక కారిడార్‌లలో రవాణా హబ్‌లను ఏర్పాటు చేయడం కాగా..నాలుగోది ఆదాయార్జన కోసం మూసీ చుట్టూ వాణిజ్య, సాంస్కృతిక ఆదాయ వనరులను గుర్తించడం.
రక్షణ శాఖకు ప్రత్యామ్నాయ భూములు
మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఫేజ్-1లో నార్సింగి నుంచి బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర అబివృద్ధి చేయనున్నారు. మొదటి దశ ప్రాంతంలో మూసీ వెంట గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూమి ఉంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం రేవంత్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.
వాటికి బదులు మరో ప్రాంతంలో భూములు ఇస్తామన్నారు. ఈ భూములను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. రక్షణశాఖ అధికారులు భూములివ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 100 ఎకరాల భూములు ఉన్నాయి. దీంతో మూసీవెంట ఉన్న 21 కిలోమీటర్ల మేర మరో వాణిజ్య నగరాన్ని నిర్మించడానికి వీలువుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ఫేజ్1కు రూ.5,863 కోట్లు
ఫేజ్1లో ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు రూ.5,863 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో రూ.4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తే, మిగిలిన రూ.1,763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఫేజ్-2లో నాగోల్ నుంచి బాచారం వరకు ఉందని తెలిసింది. ఇక మూసీ పునరుజ్జీవం పూర్తి చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పర్యాటకం, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) కింద నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆయా నిధులను సమకూర్చే సంస్థలకు గ్రీన్‌బాండ్లను జారీ చేయనున్నట్లు తెలిసింది. అలాగే.. మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్పానర్ షిప్‌లు, టూరిజంతో ఆదాయ వనరులను ప్రభుత్వం సృష్టించనుంది.