మూసీ ఏరియా వాళ్లను బలవంతంగా పంపించడం లేదు
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి తరలిస్తున్నం
మూసీ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీ దాన కిశోర్ వెల్లడి
2026 జులైలోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలి
ఇది సుందరీకరణ కోసం కాదు.. నగరాన్ని కాపాడుకునే ప్రాజెక్టు
రివర్ బెడ్, బఫర్ జోన్ ఏరియాలో 10,600 ఇండ్లు గుర్తింపు
ఇప్పటికే 50 కుటుంబాల తరలింపు..నేడు మరో 200 కుటుంబాల షిఫ్టింగ్
కిరాయి ఉన్నోళ్లకూ న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరినీ బలవంతంగా పంపించడం లేదని, అందరితో మాట్లాడి, ఒప్పించి, సురక్షితంగా తరలిస్తున్నామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిశోర్ చెప్పారు.
‘‘వాళ్లు ఉన్న ప్రదేశాలు మురికి కూపాలు. వానలు వచ్చినప్పుడల్లా వాళ్లకు చాలా ఇబ్బందులవుతున్నాయి. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపు బారిన పడుతున్నది. మూసీకి వరద వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే. ఆ తిప్పలు ఉండొద్దనే రివర్ బెడ్‌లోని వాళ్లను సురక్షితంగా డబుల్ బెడ్రూం ఇండ్లకు తరలిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు.
ఎవరికీ నష్టం జరగనివ్వబోమని, అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రివర్ బెడ్ ఏరియాలోని వాళ్లు చాలా మంది ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని దాన కిశోర్ తెలిపారు. 2026 జూన్-, జూలైలోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.
శనివారం సెక్రటేరియెట్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి దాన కిశోర్ మీడియాతో మాట్లాడారు. మూసీ ఏరియాలోని వాళ్ల అంగీకారమే ప్రభుత్వానికి డెడ్‌లైన్ అని తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాతే మూసీ ప్రాజెక్టు పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.‘‘ఎవరిని కూడా వెళ్లిపో.. తోసేయ్ అనేలా ఉండం. పారదర్శకంగా చేస్తాం” అని దాన కిశోర్ చెప్పారు.
10,600 ఇండ్లు గుర్తింపు
‘‘రివర్ బెడ్లో ఉన్న వాళ్లందరినీ కలిశాం. మూడు నెలల కిందట 55 కిలో మీటర్లు డ్రోన్ సర్వే చేస్తే.. దాదాపు 10,600 ఇండ్లు బఫర్ జోన్, రివర్ బెడ్లో ఉన్నాయి. నిర్వాసితుల తరలింపుపై ఎన్జీఓలతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్లు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు.
రివర్ బెడ్లో ఉన్నోళ్ల నివాసాలు తీసేయాలనుకుంటే ప్రభుత్వం ఎప్పుడో మొదలుపెట్టేది. ఆ ఉద్దేశమే ప్రభుత్వానికి లేదు. వాళ్లతో మాట్లాడి, వాళ్ల అంగీకారం తీసుకున్నాక డబుల్ బెడ్రూం ఇండ్లకు షిఫ్ట్ చేస్తున్నం. ఇరవై ముప్పై లక్షల రూపాయల విలువ చేసే ఇండ్లు ఇస్తున్నాం. అక్కడున్నోళ్లంతా డబుల్ బెడ్రూం ఇండ్లకు అప్లై చేసుకున్న వాళ్లే. అక్కడి నుంచి వెళ్లిపోతే పిల్లల చదువులు, వారి జీవనోపాధికి సంబంధించి కూడా పూర్తి సహకారం అందిస్తున్నాం. మెప్మాతో సర్వే చేయించి.. మహిళలకు పనిని కల్పించే ఏర్పాటు చేస్తున్నాం.
జీహెచ్ఎంసీలో రూ.2,500 కోట్లు మెప్మా ఖర్చు చేయాల్సి ఉన్నది. ఎన్జీఓల సహకారంతో పని చేస్తున్నాం. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇతర అధికారులో మీటింగ్ పెట్టుకుని.. ఎక్కడెక్కడ ఎవరికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించామో ఆ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నాం” అని దాన కిశోర్ వివరించారు. చట్టరీత్యా ముందుకు వెళ్లడమే కాకుండా.. నిర్వాసితులకు ఇంకా ఏం చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నదని తెలిపారు.
Also Read:-ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళే యజమాని
కిరాయి ఉన్నోళ్లకు ఇతర రకాలుగా సాయం చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు మాత్రమే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ‘‘బఫర్ జోన్ విషయంలో అక్కడ పట్టా భూమి ఉంటే.. దాని విలువ కంటే డబుల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇండ్లు కట్టి ఉంటే డబుల్ స్ట్రక్చర్ వాల్యూ మొత్తం ఇవ్వాలి. మేం బఫర్, రివర్ బెడ్ ఏరియాలో 10,600 స్రక్చర్ ఇండ్లను గుర్తించాం. ఏదో ఒకరోజు వారిని ఖాళీ చేయించాల్సిందే.
నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్‌లు పెట్టాం. ప్రభుత్వం 15 వేల ఇండ్లు సాంక్షన్ చేసింది” అని వివరించారు. నిర్వాసితులందరినీ కన్నబిడ్డలగా చూసుకుని షిప్ట్ చేస్తున్నామన్నారు. ‘‘పదేండ్ల కిందటి జీవో 165 ప్రకారం మూసీకి బఫర్ జోన్ 50 మీటర్లుగా ఉంది. అంతా ఎన్విరాన్మెంటల్ చట్టాలకు తగ్గటుగానే జరుగుతుంది. ప్రజలను సమ్మతితోనే పంపించడమే డెడ్‌లైన్ అన్నారు.
ఎంజీబీఎస్, మెట్రో స్టేషన్‌పై ఆలోచిస్తున్నం
మూసీలో వరదలు వచ్చిన ప్రతిసారీ.. పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్లను పోలీసుల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని దాన కిశోర్ గుర్తుచేశారు. ఇది ఎప్పుడూ జరిగే డ్రిల్ అని తెలిపారు. ‘‘మూసీ రివర్ బెడ్‌లోని ప్రజలు ప్రతి వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి శాశ్వత పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు 50 కుటుంబాలను అక్కడి నుంచి తరలించాం.
ఆదివారం మరో 200 కుటుంబాలను షిఫ్ట్ చేస్తున్నాం” అని తెలిపారు. మూసీ ప్రాజెక్టు కేవలం సుందరీకరణ కోసం కాదని.. దాని వెనుక చాలా పెద్ద లక్ష్యం ఉందన్నారు. మూసీలో ఉన్న ఎంజీబీఎస్, మెట్రో స్టేషన్ గురించి కూడా చర్చించి తగిన రీతిలో స్పందిస్తామని తెలిపారు. ఈ మెట్రో స్టేషన్‌పై ఎన్జీవోలు కూడా అడిగారని చెప్పారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్లాన్ ఇదే
‘‘రివర్ ఫ్రంట్ దగ్గర ఈస్ట్– వెస్ట్ కారిడార్ కడుతున్నాం. ప్రస్తుతం ముషీరాబాద్ నుంచి షామీర్పేట్ వెళ్లాలంటే దాదాపు గంట టైం పడుతుంది. ఈస్ట్ – వెస్ట్ కారిడార్ నార్సింగి దగ్గర నుంచి నాగోల్ వరకు 55 కిలో మీటర్లు కట్టగలిగితే 15-20 నిమిషాల్లో ఓఆర్‌ఆర్‌పైన ఉంటారు” అని దాన కిశోర్ తెలిపారు. అక్కడ 16–18 బ్రిడ్జిలు ఉన్నాయని, ఇందులోనూ హాకర్స్ జోన్ పెడుతామని, ట్రాఫిక్ సమస్య రాకుండా చేస్తామని వివరించారు.
నది వెంట రీక్రియేషన్ జోన్లు, పార్క్‌లు, బిజినెస్‌లు కూడా వస్తాయని.. యూరప్, అమెరికాలో ఎక్కడికి వెళ్లినా అక్కడ బిజినెస్‌లు జరుగుతుంటాయని.. మూసీ వెంట కూడా అలానే వస్తాయని తెలిపారు. ఇందులో పేద ప్రజలకు కూడా హక్కులు కల్పిస్తామని, హాకర్స్ జోన్లో స్థానం కల్పిస్తామని వివరించారు. ‘‘వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ చేయాలని సీఎం చెప్పారు. ప్రతి నగరంలో చేస్తాం. హైదరాబాద్ నగరాన్ని డిజాస్టార్ ఫ్రూఫ్‌గా చేయాలన్నదే మా తపన” అని వివరించారు.
మూసీని జీవనదిలాగా తయారు చేస్తామని, అక్కడక్కడ చెక్ డ్యాంలు కడ్తామని, రూ.10 వేల కోట్లు శాంక్షన్ అయ్యాయని చెప్పారు. ఈ వారంలో టెండర్ వస్తుందని, ఒక నెలలో ఏజెన్సీలు వస్తాయని, రెండు నెలల్లో పనులు మొదలుపెడుతామని వివరించారు. మొత్తం రూ.7 వేల కోట్లతో సీవరేజీ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు ఓఆర్ఆర్ లోపల ఉన్న మురికిని క్లీన్ చేసేందుకు 13 ఎస్టీపీలకు రూ.3800 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామన్నారు.
గోదావరి నుంచి నీటిని తీసుకువచ్చి జంట జలశాయాల్లో 5 టీఎంసీలు నింపుతామని తెలిపారు. హైదరాబాద్ నిర్మాణాలకు ఇప్పటివరకు నిబంధనల ప్రకారమే పర్మిషన్లు ఇచ్చామని.. కొన్ని చోట్ల తప్పులు జరిగిండొచ్చని, అలా తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. బిల్డింగ్ పర్మిషన్లకు త్వరలో కొత్త విధానం తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు.
మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో అక్టోబర్‌లో సియోల్ పర్యటన
లండన్ నగరం రీడెవలప్మెంట్ కావడానికి థేమ్స్ నది కారణమని దాన కిశోర్ చెప్పారు. చియాంగ్ చాంగ్ నది కూడా 8.7 కిలో మీటర్లు ఉంటుందని.. దానిని డెవలప్మెంట్ చేసిన తర్వాత మూడున్నర డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గిందని, అక్కడ 2 లక్షల కుటుంబాలను ఒక ఏరియాకు తరలించి.. 60 వేల దుకాణాల సముదాయాలను ఒకే దగ్గర పెట్టి డెవలప్మెంట్ చేశారని వివరించారు. ఇటువంటివి మన దగ్గర చేయాలనే లక్ష్యంతో.. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్ అంతా కలిసి అక్టోబర్‌లో సియోల్ వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.