మూసీ రివర్​ బెడ్​లోని 178 కుటుంబాలకు డబుల్ బెడ్​రూమ్​ ఇండ్లు

మూసీ రివర్​ బెడ్​లోని 178 కుటుంబాలకు డబుల్ బెడ్​రూమ్​ ఇండ్లు
  •  కోరుకున్న చోట కేటాయిస్తున్న అధికారులు
  • ప్రభుత్వ ఖర్చులతో సామాను తరలింపు
  • శుక్రవారం 33, గురువారం 11 కుటుంబాలకు ఇండ్లు
  • అందరికీ న్యాయం చేస్తాం: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్ సిటీ/ గండిపేట/మెహిదీపట్నం/పంజాగుట్ట,వెలుగు: మూసీ నది బ్యూటిఫికేషన్​లో భాగంగా ప్రభుత్వం రివర్​బెడ్ వాసులను ఇండ్లను ఖాళీ చేయిస్తోంది. వారు కోరుకున్న చోట డబుల్​బెడ్​రూమ్​ఇండ్లను కేటాయిస్తోంది. శనివారం గ్రేటర్​పరిధిలో 178  కుటుంబాలకు అధికారులు ఇండ్లు కేటాయించి, ప్రభుత్వ ఖర్చుతో సామాను తరలించారు. గురువారం మేడ్చల్ జిల్లా కొత్తపేటలోని భవానీనగర్ కు చెందిన 11 కుటుంబాలకు వనస్థలిపురంలో, శుక్రవారం ఇదే ప్రాంతం నుంచి 9 కుటుంబాలకు వనస్థలిపురంలో, నాంపల్లిలోని 11 కుటుంబాలకు జియాగూడలో, హిమాయత్​నగర్​లోని 9 కుటుంబాలకు మలక్​ పేటలో, రాజేంద్రనగర్ లోని 4 కుటుంబాలకు కలిపి మొత్తం 33 కుటుంబాలకు డబుల్ ఇండ్లు కేటాయించారు. వీరందరి ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నారు. పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమీప స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. రివర్​బెడ్​పరిధిలో పట్టా ఇండ్లు ఉంటే స్థలానికి, ఇంటికి నష్టపరిహారం చెల్లిస్తామని హైదరాబాద్​ జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి రివర్ బెడ్ పరిధిలో పట్టా ఇండ్లు ఉన్నట్లు తమ దృష్టి రాలేదని, ఒకవేళ వస్తే పరిశీలించి నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ప్రస్తుతం మూసీ రివర్​ బెడ్​ లో నిర్మించుకున్న రేకుల ఇండ్లు, పెంకుటిండ్లు, కొన్ని శ్లాబ్ ఇండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. రెండో విడతలో బఫర్ జోన్ లోని  వారిని తరలించి.. వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్​రూమ్​ ఇండ్లు కేటాయించడంతోపాటు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

స్పెషల్​ టీమ్స్​తో అవగాహన

రివర్ బెడ్ ప్రాంతలో మార్కింగ్​చేసిన ఇండ్లను ఖాళీ చేయించి, డబుల్ ఇండ్లకు తరలించేందుకు అధికారులు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. వీరంతా గురు, శుక్రవారాల్లో నిర్వాసితులతో మాట్లాడారు. గురువారం 11, శుక్రవారం 33, శనివారం ఏకంగా 151 కుటుంబాలను ఒప్పించి డబుల్​ఇండ్లకు తరలించారు. శనివారం వినాయక వీధి(రసూల్ పురా)లోని 100 కుటుంబాలను మలక్ పేటలోని, సైదాపూర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు తరలించామని హైదరాబాద్​కలెక్టర్ అనుదీప్​తెలిపారు. శంకర్ నగర్ మూసీ నిర్వాసితులను పిల్లిగుడిసెలతో పాటు, జియాగూడలోని డబుల్ బెడ్​ రూం ఇండ్లకు తరలిస్తామని స్పష్టం చేశారు. మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి కలెక్టర్​వినాయక వీధి, శంకర్ నగర్ ను సందర్శించారు.

 హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మొదటిసారి చేసిన సర్వేలో 1,077 నిర్మాణాలను గుర్తించగా, ఇటీవల 1,600కు పైగా ఇండ్లకు మార్కింగ్​చేశారు. వీరికి జియాగూడ పరిధిలో 260, పిల్లి గుడిసెలలో 140, జంగంమెట్ లో 200, కొల్లూరులో 190, ప్రతాప సింగారంలో 170, కరుణా నగర్ లో 60, సాయి చరణ్ కాలనీలో 8 డబుల్​బెడ్​రూమ్​ఇండ్లను కేటాయించారు. మేడ్చల్​జిల్లాలో మొత్తం 239 నిర్మాణాలను గుర్తించగా, ప్రతాప సింగారంలో 38, తిమ్మాయిగూడలో 100, వనస్థలిపురంలో 97 డబుల్​ఇండ్లను కేటాయించారు. వీరంతా నచ్చినచోట డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఎంచుకోవచ్చని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​పరిధిలో 300 నిర్మాణాలు ఉండగా, నిర్వాసితులకు జంగంమెట్, జియాగూడ, నార్సింగిలోని డబుల్ ఇండ్లను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. 

మూసీ నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్​లు

మూసీ నిర్వాసితుల కోసం 6 చోట్ల హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శనివారం తెలిపారు. ఒక్కో హెల్ప్ డెస్క్ ను నోడల్ అధికారులు(డిప్యూటీ కమిషనర్లు) పర్యవేక్షిస్తారన్నారు. జీయాగూడ, పిల్లి గుడిసెలు, జంగంమెట్, సాయిచరణ్ కాలనీ, కమలానగర్, జైభవనీ నగర్ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ లు అందుబాటులో ఉన్నాయి. నిర్వాసితులకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఇక్కడి అధికారులను సంప్రదించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారు.

ఒకవైపు ఆనందం.. మరోవైపు ఆందోళన

కొందరు మూసీ నిర్వాసితులు సంతోషంగా డబుల్​బెడ్​రూమ్​ఇండ్లకు వెళ్తుంటే, మరికొందరు ఆందోళన బాట పడుతున్నారు. తాము ఖాళీ చేయబోమని నిరసనకు దిగుతున్నారు. మార్కింగ్, అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. శనివారం బహదూర్​పురా తహసీల్దార్​ ఆఫీసు ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 302 ఇండ్లకు మార్కింగ్​చేశామని, కొన్ని భవనాలు మూడు ఫ్లోర్లతో ఉన్నాయని, వాటన్నింటికి నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ముందుకొచ్చిన ఐదు కుటుంబాలకు డబుల్ బెడ్ రూములు అందజేస్తామన్నారు. అలాగే పేదల ఇండ్లు కూల్చడాన్ని తాము అంగీకరింబోమని సీపీఎం రాష్ట్ర నాయకుడు ఎండీ అబ్బాస్​ అన్నారు. లంగర్​ హౌస్​ డివిజన్​ పద్మనగర్, రామన్​గూడలోని మూసీ నిర్వాసితులతో కలిసి శనివారం బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద ధర్నా చేశారు. పరిహారం ఇచ్చాకే ఇండ్లు ఖాళీ చేస్తామని చెప్పారు.