
హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరికైనా అపోహలుంటే నివృత్తి చేస్తామని చెప్పారు. మూసీ పునరుజ్జీవన కార్యక్రమంపై శాసనమండలిలో సభ్యులు మహేశ్ కుమార్ గౌడ్, టి.జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. 'మూసీ ఒడ్డున ఉంటున్న పేదలు, మధ్య తరగతి ప్రజల కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వాళ్లు ఇతరులను నమ్మి మోసపోయారని గుర్తించి వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నం. తెలిసి తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు. తెలియకుండా ఇబ్బంది పడుతున్న వారికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తా'మన్నారు.
ALSO READ | బీసీల లెక్కలు తీసి లాకర్ల దాసుకోలె .. బిల్లు పాస్ చేసినం.. ఇది మా చిత్తశుద్ధి: సీఎం రేవంత్
గంగానది, సబర్మతి నది పునరుజ్జీవం కార్యక్రమానికి ఇచ్చినట్లు మూసీ నదికి కూడా నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే అనేక సార్లు సీఎం కూడా కోరారని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం గుజరాత్, యూపీలపై చూపిస్తున్న ప్రేమ తెలంగాణ రాష్ట్రంపై చూపించడం లేదని విమర్శించారు. ప్రజలకు కాలుష్యం లేని నీళ్లు, గాలి అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ విషయంలో విపక్షాలు మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్న మంత్రి, రాజకీయాలు చేయొద్దని సూచించారు.