సంగీతంపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసిన అజయ్ అరసాడ.. మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. తను సంగీతం అందించిన ‘ఆయ్’ చిత్రం, ‘వికటకవి’ వెబ్ సిరీస్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సందర్భంగా అజయ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ ‘మాది వైజాగ్. ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండడంతో సంగీతంపై ఆసక్తి పెరిగింది. అలా గిటార్ నేర్చుకున్నా. ఇంజనీరింగ్ చేసేటప్పుడు మ్యూజిక్‌పై మరింత ఫోకస్ పెట్టా. 2018లో టీసీఎస్‌లో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమా ప్రయత్నాలు ప్రారంభించా. ‘జగన్నాటకం’ మూవీతో తొలి అడుగు పడింది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్నేహితుడు కావడంతో ‘గూఢచారి’ చిత్రానికి కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వర్క్ చేశా.
ఆ తర్వాత క్షీర సాగర మథనం, నేడే విడుదల, మిస్సింగ్, శ్రీరంగనీతులు సినిమాలకు పనిచేశా. అలాగే సేవ్ ది టైగర్స్ సీజన్1, సీజన్2లకు సంగీతాన్ని అందించాను. నా వర్క్ నచ్చి బన్నీ వాస్ గారు ‘ఆయ్’ చిత్రానికి అవకాశం ఇచ్చారు. ‘ఆయ్’కు వర్క్ చేస్తున్నప్పుడే ‘వికటకవి’ సిరీస్‌లో మూడు ఎపిసోడ్స్‌కు మ్యూజిక్ ఇచ్చా. ఆ చిత్రం విడుదల తర్వాత మరో మూడు కంప్లీట్ చేశా. ‘వికటకవి’కి వర్క్ చేయటం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. నేను డైరెక్టర్స్ టెక్నీషియన్‌ని. వాళ్లే నాకు గురువులు. ఏ జానర్ అయినా దర్శకులు కోరిన ఔట్‌పుట్ ఇవ్వడమే నా ఫస్ట్ ప్రయారిటీ. నాకు దేవిశ్రీ ప్రసాద్ గారంటే ఇష్టం. ప్రస్తుతం ‘త్రీ రోజెస్’ సీజన్ 2తో పాటు ఆహాలో మరో రెండు సిరీస్‌లకు వర్క్ చేస్తున్నా’ అని చెప్పాడు.