
‘ఖుషీ.. అతని సంగీతానికి, తన స్వరం తోడైతే... ఖుషీ అతని పాట వినబడితే...’ పాట లిరిక్స్ ఇవి కాదే అనుకుంటున్నారా? నిజమే. ఎందుకంటే ఇవి సమంత కోసం కాదు.. ఖుషీ సినిమాలో వాళ్ల ప్రేమను సంగీతం ద్వారా వినిపించిన మ్యూజిక్ డైరెక్టర్ కోసం. అంత అద్భుతమైన సంగీతం అందించి, తన పాటలతో దిల్కుష్ చేసిన సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ మెలోడియస్ మ్యుజీషియన్. ‘హృదయం’ సినిమాలో తన పాటలతో సౌత్ఇండియాను మైమరిపించాడు. హేషమ్ మ్యూజికల్ జర్నీ ఇది...
‘‘ప్రతి రోజూ నేను చేసే మొదటి పని... పాటలు వినడం. ఖాళీ దొరికినప్పుడల్లా మ్యూజిక్‌తో టైంపాస్ చేస్తా. స్ట్రెస్‌లో ఉన్నా, అలసిపోయినా సంగీతమే నా రిలాక్సేషన్. పొద్దున్నుంచి రాత్రి పడుకునేవరకు సంగీతంతోనే స్నేహం చేస్తా. నాకు అంత ప్రాణం సంగీతమంటే.
నేను.. నా మ్యూజిక్
కేరళలోని చేర్తల మా సొంతూరు. నేను పుట్టింది చేర్తలలో. కానీ అమ్మానాన్నలు సౌదీ అరేబియాలో పనిచేయడం వల్ల ఇంటర్మీడియెట్ వరకు అక్కడే ఉన్నా. ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచీ మ్యూజిక్‌ని సీరియస్‌గా తీసుకున్నా. ఇళయరాజా, రెహ్మాన్ పాటలు ఎక్కువగా వినేవాడిని. అలా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్‌తో పియానో నేర్చుకున్నా. ఆ తర్వాత కర్నాటిక్ మ్యూజిక్ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టా. మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి. అందుకని టైం దొరికినప్పుడల్లా నేర్చుకుంటున్నా ఇప్పటికీ. నా చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడానికి అంత స్కోప్ ఉండేది కాదు.
కానీ, ప్రతి వీకెండ్ ఫ్యామిలీస్ అందరూ కలిసి, పాటలు పాడుకునేవాళ్లం. నేను ఇండియాకి వచ్చాక మ్యూజిక్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నా. కెరీర్ మొదలుపెట్టడానికి ముందు మొదటిసారి 2007లో ఒక మలయాళం ఛానెల్లో సింగింగ్ రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేశా. మరో సింగింగ్ రియాలిటీ షోలో 2011లో పాల్గొని, విన్నర్ కూడా అయ్యా. ఆ తర్వాత సౌండ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశా.
సినిమాల్లో అవకాశం
ప్రొఫెషనల్‌గా మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ చేసింది 2015 నుంచి. ‘కదంబడహ’ అనే ఒక సూఫీ ఆల్బమ్ చేశా. దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ శామి యూసుఫ్ ప్రొడ్యూస్ చేశారు. ఆయన నా గురువు. అదే ఏడాది ‘సాల్ట్ మ్యాంగో ట్రీ’ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా అది నా డెబ్యూ. ఆ తర్వాత ‘క్యాపుచ్చినొ, ఒలె కండ నాల్, మధురం’ వంటి సినిమాలకు సంగీతం అందించా.
మా తాతయ్య హిందుస్తానీ వోకలిస్ట్
ఇప్పుడు మా అమ్మానాన్న అలప్పీలో ఉంటున్నారు. నా బ్రదర్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. నేను, నా భార్య ఐషా కొచ్చిన్‌లో ఉంటాం. వందేండ్లు బతికిన మా తాతయ్య హిందుస్తానీ వోకలిస్ట్. మా ఫ్యామిలీలో మ్యూజిక్ టచ్ ఉంది ఆయనకే. స్వాతంత్ర్యోద్యమం టైంలో ప్యాలెస్‌లు, కోర్ట్లలో పాడేవాళ్లు. ఆయనతో మాట్లాడితే చాలు మ్యూజిక్ గురించిన డిస్కషన్స్ ఉండేవి. సూఫీ మ్యూజిక్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అప్పట్లో సూఫీ పోయెమ్స్‌ని పాడి వినిపించేవాళ్లు నాకు. ఆయన వల్లే నాక్కూడా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ మొదలై ఉండొచ్చు అనిపిస్తుంది చాలాసార్లు.
ఆయనే ఇన్స్పిరేషన్
ఎ.ఆర్.రెహ్మాన్ నాకు ఇన్స్పిరేషన్. ఆయన పాటలు వింటూ మ్యూజిక్ నేర్చుకున్నా. ఆయన ఎలా పాడతారు? ఎలా కంపోజ్ చేస్తారు? మ్యూజిక్ ఎలా ప్లే చేస్తారు. సంగీతం పరంగా, టెక్నికల్‌గా ఆయన కొత్తగా ఏం చేస్తున్నారు? వంటి విషయాలన్నీ అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన పాటలు ప్రాక్టీస్ చేసేవాడ్ని. ఆయన్ని కలవడం చాలా ఎగ్జైటెడ్‌గా అనిపించింది. మ్యూజిక్‌తో అందరినీ కదిలించే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని కలిసిన క్షణాన ప్రపంచంలో నా అంత హ్యాపీగా ఎవరూ లేరని అనిపించింది.
మొదట్లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. సౌదీలో చదువుకున్న నేను మ్యూజిక్ కోసమే ఇండియా వచ్చా. కెరీర్ స్టార్ట్ చేశాక, అవకాశాల కోసం ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగా. చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘హృదయం’ నా పదో సినిమా. కానీ చాలామంది అదే నా మొదటి సినిమా అనుకుంటారు. ఎందుకంటే ఆ మూవీ సాంగ్స్ బాగా హిట్ అవ్వడంతో నేను అందరికి తెలిశా. ‘ఖుషి’ తర్వాత ఇప్పుడు నాని సినిమా ‘హాయ్ నాన్న’, శర్వానంద్ మూవీలకు మ్యూజిక్ చేస్తున్నా.
‘హృదయం’తో లైఫ్ టర్న్!
‘హృదయం’ సినిమాలో అవకాశం 2019లో వచ్చింది. దానికి ముందు నేను వేరే సినిమాలో వినీత్ శ్రీనివాసన్‌తో ఒక సాంగ్ పాడిస్తున్నా. అప్పుడు ఆయన తను తరువాత డైరెక్ట్ చేయబోయే సినిమాలో మ్యూజిక్ చేయమని అడిగారు. అది ఊహించని అవకాశం. ఇక్కడ ఒక ఎక్స్‌పీరియెన్స్ మీతో పంచుకోవాలి. ఆ సినిమా షూటింగ్ టైంలో టర్కీ వెళ్లాం. అక్కడ ఉన్న లోకల్ ఇన్స్ట్రుమెంట్స్తో రికార్డ్ చేయడం నాకు మెమొరబుల్ పార్ట్. అందులో ఉన్న ‘దర్శన’ పాటతో సహా దాదాపు ఎనిమిది పాటలు అలానే రికార్డ్ చేశాం.
అప్పుడు ఫారిన్ మ్యుజీషియన్స్‌తో కలిసి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ మ్యూజిక్ చేయడం చాలా బాగా అనిపించింది. యాక్టర్, డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్‌కి మ్యూజిక్ మీద మంచి పట్టుంది. ఆయన విజన్‌లో నా మ్యూజిక్‌ని చేయడం చాలా కొత్తగా అనిపించింది. హృదయంకి ముందు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసేవాడ్ని. అవకాశాల కోసం వెతికేవాడ్ని. కానీ, హృదయం తర్వాత అదంతా మారిపోయింది.
కథ డిమాండ్ చేస్తుంది
డైరెక్టర్‌కి ఒక విజన్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకు ఒక విజన్ ఉంటుంది. ఒక్కోసారి ఇద్దరి ఐడియాస్ మ్యాచ్ అవుతాయి. కొన్నిసార్లు డిఫరెంట్‌గా ఉంటాయి. డైరెక్టర్ ఒక యాంగిల్లో ఆలోచిస్తే, మ్యూజిక్ చేసే మేం వేరొకలా ఆలోచిస్తాం. అలాంటప్పుడు ఇద్దరికీ సింక్ అవ్వదు. అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే.. ఒక సాంగ్ కంపోజ్ చేశాక, ఎవరితో పాడించాలి అనేది డిసైడ్ అవుతాం. ఒక్కోసారి డైరెక్టర్ ముందే చెప్తారు.
ఫలానా సాంగ్ ఆ సింగర్ పాడతారని. అప్పుడు వాళ్ల సాంగ్స్, వాయిస్ ముందుగానే వింటా. ఆ తర్వాత వాళ్ల వాయిస్‌కి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేస్తా. అయితే, అన్నిసార్లు ఇలానే జరుగుతుందని చెప్పలేం. ఉదాహరణకు చిత్రగారి వాయిస్ తెలుసు. ఆవిడ వాయిస్‌కి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేశా. మలయాళంలో ‘హృదయం’, ‘మధుర మనోహర మోహం’ అనే రెండు సినిమాల్లో ఆమెతో పనిచేసే అవకాశం దక్కింది.
ఆడియెన్స్ టేస్ట్ బట్టి..
ఇంతకుముందు కథలు వేరు. అందులో పాటలు, మ్యూజిక్‌కి స్కోప్ ఉండేది. ఆ తర్వాత ఆడియెన్స్ టేస్ట్ మారిపోయింది. థ్రిల్లర్స్ ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టారు. అలాంటి సినిమాలకు సాంగ్స్, మెలొడీ అవసరంలేదు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సరిపోతుంది. అలాగే డైరెక్టర్స్‌కి ఎలాంటి మ్యూజిక్ కావాలంటే అదే ఇస్తాం. అయితే, ఇండిపెండెంట్ ఆల్బమ్స్ అయితే ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఏ మ్యూజిక్ అయినా, ఎలాంటి పాటైనా వినేవాళ్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.’’
టీచర్‌గా...
కొచ్చిన్‌లో ‘లైవ్ విత్ మ్యూజిక్’ అనే అకాడమీ ఉంది. అక్కడ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నా. అలాగే, ఆటిస్టిక్ చిల్డ్రన్‌కి మ్యూజిక్ థెరపీ అందిస్తున్నా. కొత్త విషయాలను నేర్చుకోవడానికి టీచింగ్ నాకు ఉపయోగపడుతోంది. టీచింగ్ చేసే ప్రాసెస్‌లో కొత్త గాడ్జెట్స్, టెక్నాలజీ గురించి తెలుసుకోవడంలో సాఫ్ట్వేర్స్ వంటివాటి విషయాల్లో అప్డేట్ అవుతున్నా.
‘ఖుషి’ ఛాన్స్
‘హృదయం’ సినిమా రిలీజ్ అయ్యింది. అన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత రెండు వారాలకు మైత్రీ మూవీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేశ్ ఫోన్ చేసి ‘రేపు ఒక సాంగ్ కంపోజ్ చేయాలి. దానికి మీరు రెడీగా ఉన్నారా?’ అని అడిగారు. నేను ‘నేను రెడీ’ అని చెప్పా. అయితే అప్పటి వరకు నేను హైదరాబాద్‌కి రాలేదు. మొదటిసారి ‘ఖుషి’ సినిమా కోసం వచ్చా. రాగానే మూవీ టీం నన్ను రిసీవ్ చేసుకుంది. ఒక హోటల్లో అందరం కూర్చున్నాం.
డైరెక్టర్ శివ నాకు కథ చెప్పారు. తర్వాత వెంటనే ‘సాంగ్ కంపోజ్ చేద్దామా?’ అన్నారు. మొదటి సాంగ్ ‘నా రోజా నువ్వే..’ సిచ్యుయేషన్ చెప్పి, పల్లవి వరకు రాసి ఇచ్చారు. దానికి నేను ట్యూన్ కట్టా. అందులో ‘తనననన..’ అనేది శివగారు యాడ్ చేశారు. ఒక్కరోజులో ఆ పాట ఫినిష్ చేశాం. సాయంత్రం ప్రొడ్యూసర్స్ వచ్చి పాట విని వాళ్లు కూడా అప్రిసియేట్ చేశారు. అప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది.
నేను పాడడం వెనక...
నార్మల్‌గా మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు మా వాయిస్‌లోనే పాట పాడి వినిపిస్తాం. అలాగే ‘ఖుషి’కి కూడా పాడా. అది విన్న డైరెక్టర్, ప్రొడ్యూసర్ ‘నా రోజా..’ పాట నాతోనే పాడించాలని ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ శివకి మ్యూజిక్ నాలెడ్జ్ చాలా బాగుంది. ఆయనకు కావాల్సిన దానికోసం చాలా ఫైట్ చేస్తారు . ఏ ట్యూన్‌కి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలో ఆయన ముందే డిసైడ్ అవుతారు. ఆయన నన్ను నమ్మి, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు.