ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మరణంపై ఆయన స్నేహితుడు కోటి స్పందించారు. రాజ్ చనిపోయారనే వార్తను తాను జీర్ణించుకోలేకపోతోన్నాని అన్నారు. ఈ మధ్యనే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నామని చెప్పారు. అయితే ఆరోగ్య సమస్యలున్నట్టుగా రాజ్ తనకు చెప్పలేదన్నారు కోటి. రాజ్ కోటిగా మేమిద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశామని, ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చామని కోటి చెప్పుకొచ్చారు. తామిద్దరం విడిపోయిన తరువాత కోటిగా తాను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారని తెలిపాడు.
చక్రవర్తి దగ్గర మేమిద్దరం అసిస్టెంట్లుగా పని చేశామని చెప్పిన కోటి.. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ లాంటి ఎన్నెన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చామని చెప్పుకొచ్చాడు. తెలుగులో మేమిద్దరం ఓ ట్రెండ్‌ను సృష్టించామని తెలిపాడు. సినిమా కోసం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లమని అలాంటిది ఈ రోజు రాజ్ లేడంటే ఎంతో బాధగా ఉందన్నారు.
కాల ప్రభావం, పరిస్థితుల వల్ల తాము విడిపోయామని , తానూ ఎన్ని సినిమాలు చేసినా రాజ్ తన పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాన్నారు కోటి. రాజ్‌కి తానొక తమ్ముడిలాంటి వాడినిని తెలిపారు. తామిద్దరం చిన్ననాటి స్నేహితులమని, మేము విడిపోవడం తనకు ఇప్పటికీ బాధగానే ఉంటుందని తెలిపాడు. అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయామని చెప్పుకొచ్చిన కోటి.. తమ పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడని తెలిపాడు.
గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో రాజ్ కన్నుమూశారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజ్-కోటి ద్వయం ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించింది. దాదాపు 150కు పైగా చిత్రాలకు వీరు పనిచేశారు. రాజ్ తండ్రి తోటకూర వెంకట రాజు కూడా సంగీత దర్శకులే. పలు తెలుగు చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.