అనుకున్నది సాధించాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. దాన్ని నిరూపించుకోవడానికి సరైన ప్లాట్‌ఫాం కూడా కావాలి. దాన్ని వెతుక్కుంటూ వందల కిలోమీటర్లు దాటాడు పీవీఆర్ రాజా (పెన్మత్స వెంకట రామరాజు). సరిగమల కోసం అమ్మానాన్నలకి, పుట్టి పెరిగిన ఊరికి దూరంగా సిటీకొచ్చాడు. తెలియని మనుషుల మధ్య అవకాశాల కోసం ప్రతిరోజూ పోరాడాడు. పస్తులున్నాడు. ఎన్నో అవమానాలు చూశాడు. అయినా ధైర్యం చెడలేదు. అన్నింటినీ దాటుకొని... షార్ట్‌ఫిల్మ్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు దాదాపుగా 150 షార్ట్ ఫిల్మ్స్‌కి ట్యూన్స్ కట్టాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. ‘‘త్వరలో వెండితెరపైనా
నా పాటలు వినిపించ బోతున్నాయి” అంటున్న అతని మాటల్లో పదహారేండ్లు పాటల కోసం పడిన తపన కనిపించింది.
‘‘నా పాట చిన్న పిల్లలకి జోల అవ్వాలి.పెద్దవాళ్ల ముఖంలో నవ్వు అవ్వాలనుకున్నా. నా పాట అందరి మనసుల్ని తాకాలనుకున్నా. కానీ, అనుకున్నవన్నీ అంత తేలిగ్గా జరిగిపోతే జీవితం ఎలా అవుతుంది? అడుగడుగునా అడ్డంకులు వచ్చాయి. ‘నీ వల్ల కాద’నే మాటలూ వినిపించాయి. వాటన్నింటికి నా సక్సెస్ ఒక్కటే సమాధానం అనుకున్నా. దాన్ని చేరుకోవడానికి పదహారేండ్ల కిందట సిటీకొచ్చా. అది కూడా ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండా.
మ్యూజిక్ మెడిసిన్ అయింది
మా నాన్న చంద్రశేఖర్ విజయనగరంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసేవాళ్లు. అమ్మ సత్యవతి హౌస్‌వైఫ్. ఫ్యామిలీలో ఎవరికీ మ్యూజిక్ తెలియదు. అసలు మ్యూజిక్ పేరు ఎత్తితేనే ఇంట్లో కోప్పడేవాళ్లు కూడా. ఆటలకి పర్మిషన్ లేదు. దాంతో కొంచెం ఒంటరిగా ఫీలయ్యే వాడ్ని. తర్వాత ఆ ఒంటరి తనానికి నా రైటింగ్ తోడైంది. క్షణాల్లో కవితలు అల్లేవాడ్ని.. పాటలు కూడా రాసే వాడ్ని. అలా రైటింగ్‌లో మునిగిపోయిన నాకు రానురాను సినిమా పాటలు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. బాధ, కోపం, సంతోషం.. ఎమోషన్ ఎదైనా అవే మెడిసిన్‌గా పనిచేశాయి నాకు. మెల్లిగా పాడటం కూడా అలవాటయింది.. పాటలకి మ్యూజిక్ కట్టాలన్న కల మొదలైంది.
మూడొందలు కూడబెట్టి..
ఈ కలను నిజం చేసుకోవడానికే టెన్త్ తర్వాత ‘షాలోమ్స్ మ్యూజిక్ సెంటర్’లో చేరా. నా ప్యాషన్ చూసి ఫ్రీగానే కీబోర్డు, గిటారు నేర్పించారు వాళ్లు. ఆ తర్వాత వయొలిన్ నేర్చుకోవడానికి ‘మహారాజా’ మ్యూజిక్ కాలేజీని ఎంచుకున్నా. కానీ, అందులో చేరాలంటే 300 రూపాయల ఫీజు కట్టాలి.
ఇంట్లో ఆట, పాటలకి చోటు లేదు. దాంతో ఆ మూడొందలు కూడబెట్టడం ఒక పెద్ద గండమైంది నాకు. నాన్న జేబులోంచి చిల్లర కాజేశా. అప్పుడు ఇంటర్ చదువుతుండటంతో ఆ ఫీజు ఈ ఫీజు అని ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నా. అలా నానా తిప్పలు పడి మూడొందలతో కాలేజీకి వెళ్తే అక్కడ ఇంకో ట్విస్ట్. ఫీజు కట్టించుకున్నాక ఒక పాట పాడమన్నారు వాళ్లు. నాకు కాస్త సిగ్గు ఎక్కువ..పైగా సరిగమలు, శృతుల మీద అంత పట్టు లేదు. అది గమనించి వయొలిన్ రావాలంటే మ్యూజిక్ తెలియాలని అడ్మిషన్ ఇవ్వలేదు వాళ్లు. ఎలాగో ఫీజు కట్టాను కాబట్టి భరతనాట్యం నేర్చుకోమన్నారు. ఇష్టం లేకపోయినా డబ్బులు పోతాయని తలాడించా. భరతనాట్యం నేర్చుకుంటూనే ఆ కాలేజీలో క్లాసికల్ మ్యూజిక్, వీణ, వయొలిన్ నేర్చుకునేవాళ్లని ఫ్రెండ్స్ చేసుకున్నా. వాళ్ల నోట్స్ తీసుకుని థియరీ పార్ట్ నేర్చుకున్నా. జిల్లా స్థాయిలో గిటారు ప్లేయర్‌గా ప్రైజ్‌లు కూడా గెలుచుకున్నా. దాంతో కాన్ఫిడెన్స్ పెరిగింది..ఆ లోపు డిగ్రీ పూర్తయింది. ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోయినా సినిమాల కోసం మా మామయ్య ఇచ్చిన ఐదువేలతో హైదరాబాద్ వచ్చా.
జర్నీ మొదలు
ఆర్పీ పట్నాయక్ తమ్ముడు అజయ్ పట్నాయక్ కొన్నాళ్లు మా కాలేజీలో మ్యూజిక్ నేర్చుకున్నాడు. ఆ పరిచయంతో సిటీకొచ్చిన కొత్తలో తన దగ్గరే ఉన్నా. జీరో నుంచి మ్యూజిక్ నేర్చుకోవాలని ‘సింఫనీ మ్యూజిక్ అకాడమీ’లో చేరా. వాళ్లు నా పాటలు విని మ్యూజిక్ టీచర్‌గా చేయమన్నారు. సిలబస్ నేర్పించారు. పాకెట్ మనీ వస్తుందని నేను కూడా ‘ఓకే’ అన్నా. ఆ తర్వాత అవకాశాల కోసం, అవసరాల కోసం మేకప్ మెన్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్నాళ్లు పని చేశా. కానీ, అవేం వర్కవుట్ కాలేదు. దారి తప్పుతున్నాను అనిపించింది. ఆ ఉద్యోగాలన్నీ వదిలేశా. డిప్రెషన్లోకి వెళ్లా. ఆ టైంలోనే నేను మ్యూజిక్ నేర్చుకున్న ఇనిస్టిట్యూట్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ‘తెలిసినవాళ్లు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు.. మ్యూజిక్ డైరెక్షన్ చేస్తావా’? అని అడిగారు. ఫోన్ రావడం ఆలస్యం బ్యాగ్ సర్దుకుని బయల్దేరా. అలా 2013లో ‘మిస్టర్ బ్లఫ్’ షార్ట్ ఫిల్మ్‌తో నా మ్యూజిక్ జర్నీ మొదలైంది.
అదే నా గోల్
2013 నుంచి ఇప్పటి వరకు తెలుగు , కన్నడ , హిందీ , తమిళ , ఇంగ్లిష్ భాషల్లో 150 షార్ట్ఫిల్మ్స్కి మ్యూజిక్ ఇచ్చా. వాటిల్లో ‘ ఆత్మరామా ఆనంద రమణ’, ‘ ఒక్క క్షణం’, ‘మాయ’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘ఆకాశమంత ప్రేమ’ , ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ (కన్నడ), మిట్టి (హిందీ ),‘ ఊపిరిలో ఊపిరిగా’ లాంటి షార్ట్ఫిల్మ్స్కి మంచి పేరు వచ్చింది. ఏడు సార్లు బెస్ట్ మ్యూజిక్ కంపోజర్‌గా అవార్డులు కూడా అందుకున్నా. త్వరలో ‘ మది’ సినిమాతో వెండితెరకి పరిచయం కాబోతున్నా. ‘చుక్కల్లో ఉండే కుందేలు’, ‘మరో ప్రపంచం’ లాంటి నాలుగైదు సినిమాలకి కూడా మ్యూజిక్ చేస్తున్నా. ఈ సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్‌గా నన్ను నిలబెడతాయన్న నమ్మకం ఉంది. ఫ్యూచర్లో మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా అందరికీ గుర్తుండిపోవాలన్నదే నా డ్రీమ్.
ఫేస్బుక్లో మెసేజ్‌లు పెట్టా
‘మిస్టర్ బ్లఫ్’కి అప్పట్లోనే ఐదులక్షల వ్యూస్ వచ్చాయి. కానీ, కామెడీ ఫిల్మ్ అవ్వడంతో నా మ్యూజిక్‌కి పెద్దగా గుర్తింపు రాలేదు. సంవత్సరం ఖాళీగా ఉన్నా. ఆ గ్యాప్‌లో మ్యూజిక్‌పై మరింత పట్టు తెచ్చుకున్నా. ఫేస్బుక్లో పేరున్న షార్ట్‌ఫిల్మ్ ప్రొడక్షన్స్ అన్నింటికీ మెసేజ్‌లు పెట్టా. ఫ్రీగా మ్యూజిక్ చేస్తానన్నా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. లక్కీలీ అప్పుడే ‘ఆర్య–3’ షార్ట్ ఫిల్మ్‌కి మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. వాళ్లు మొదట నన్ను కన్సిడర్ చేయలేదు. కానీ, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడంతో ‘ఓకే’ చెప్పారు. ఆ ఆల్బమ్ సూపర్ హిట్ కావడంతో నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ::: ఆవుల యమున