తమ్ముడు, బద్రీ, జానీ, లక్ష్మీ, యోగి లాంటి చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా మెప్పించారు రమణ గోగుల. దశాబ్ధ కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. వెంకటేష్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సింగర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘గోదారి గట్టు మీద రామ సిలక’నే అంటూ ఆయన పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రమణ గోగుల మాట్లాడుతూ ‘అమెరికాలో ఉంటున్న నాకు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కాల్ చేసి ఇందులో పాట పాడాలని కోరారు.
సాంగ్ పంపించమని అడిగాను. పాట చాలా నచ్చి కచ్చితంగా పాడాలి అనిపించింది. అలాగే పాడటానికి చాలా క్రియేటివ్ ఫ్రీడం దొరికింది. మధుప్రియ కూడా బాగా పాడింది. నా వాయిస్‌కి ఆమె పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అయింది. భాస్కర భట్ల గారు ఫెంటాస్టిక్ లిరిక్స్ రాశారు. 27 మిలియన్ వ్యూస్‌తో ట్రెమండెస్ రెస్పాన్స్ రావడం హ్యాపీ. నా గొంతును ఇష్టపడే ఎంతోమంది అభిమానులు ఉన్నారు అనిపించింది. నేను ఎవరి సంగీతంలోనూ ఇప్పటివరకు పాడలేదు.
కానీ అనిల్, భీమ్స్ చాలా లవింగ్ పర్సన్స్. అలాగే వెంకటేష్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఇలాంటి మంచి కాంబినేషన్‌లో పాడాలనుకున్నా. మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడున్న కంపోజర్స్ అందరూ మంచి మ్యూజిక్ అందిస్తున్నారు. కానీ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్‌కు చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. నా దగ్గర కొన్ని వినూత్నమైన ఐడియాలు ఉన్నాయి’ అని చెప్పారు.