గీ సాడేసాత్ పీఆర్సీ మాకద్దు!

తెలంగాణ సర్కారు నౌకరోళ్ల దోస్తానాగా ఉంటానన్నది. తెలంగాణ లడాయిల మీరు మస్తు కొట్లాడిండ్రన్నది. మనదంతా ఒకే కుటుంబమన్నది. మీ సమస్యలన్నీ నాకు తెల్సన్నది. కడుపున పెట్టుకుని సాదుకుంటనన్నది. మీకు కడుపునిండ బువ్వ పెడతనన్నది. మీకు రెండు కమ్మల్ల సర్వీసు రూల్స్ ఇస్తానన్నది. అన్ని సౌలత్ లు కల్పిస్తనన్నది. తీరా జీతాలు పెంచేకాడ అదంత ఒట్టి ముచ్చటే, కరోనా అచ్చి అంతా ఖరాబైందని సాడేసాత్ పీఆర్సీ ఇచ్చి 9 లచ్చల నౌకరోళ్లను ఎకసెక్కాలు చేసింది. వారి ఇజ్జత్ తీసింది.- చేసిన బాసలన్నీ అట్టి పెదెలే అని తేల్చింది.

ఎంప్లాయీస్​ ఫ్రెండ్లీ సర్కార్​ అని ప్రకటిస్తూనే, పీఆర్సీ ఫిట్ మెంట్ ను దారుణంగా 7.5 శాతం ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను నిలువునా వంచించింది. గతానికి భిన్నంగా ముగ్గురు సభ్యులతో పీఆర్సీ కమిటీని నియమించి మూడు నెలల్లో రిపోర్ట్​ తెప్పించి, అమలు చేస్తానంది. కానీ, 30 మాసాలు సాగదీసి ఇప్పుడు అందరినీ ఉసూరుమనిపించారు. కొండంత రాగం తీసి.. పాటపాడిన చందంగా వ్యవహరించారు. వాస్తవ పరిస్థితులను గమనించలేదు. ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే తగ్గిన రూపాయి విలువ, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం స్థితి, ప్రస్తుత జీవన ప్రమాణ స్థాయిని పరిశీలించకుండా, అశాస్త్రీయంగా, నిరాశాజనకంగా బిస్వాల్ కమిటీ తన నివేదిక ఇచ్చింది. ఈ సిఫార్సులను చూసిన తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరాశా నిస్పృహలకు గురయ్యారు. ఇది తమకు అవమానంగా భావించారు. తీవ్ర ఆవేదనకు గురైన ఉద్యోగులు నివేదిక కాపీలు చించి, కాల్చి నిరసనలకు దిగారు.

ఉద్యోగులు అంగీకరించే స్థితిలో లేరు

నలుగురు సభ్యుల(తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు) కుటుంబం యూనిట్ గా తీసుకుని వేతన పెంపుదల 45 శాతం నుంచి 63 శాతం వరకు ఉండాలని వివిధ సంఘాలు పీఆర్సీ కమిటీకి వివిధ రకాల ప్రతిపాదనలు ఇచ్చాయి. 2014లో రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. ఏడాది కిందట కరెంటోళ్లకు 34 శాతం ఫిట్​మెంట్​ ఇచ్చారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్​ ఉండి కూడా ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి చెల్లిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 43 శాతం ఫిట్​మెంట్​ పెంచాల్సి ఉంటుంది. ఇంతకు తక్కువ మొత్తాన్ని ఫిట్​మెంట్​గా కొన్ని ఘనత వహించిన పాలాభిషేక సంఘాలు అంగీకరించినా, కింది స్థాయిలో ఉద్యోగులు అంగీకరించే పరిస్థితిలో లేరు. “ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక”కూడా ఇదే డిమాండ్ చేస్తున్నది.

పెంచకున్నా పర్లేదు.. తగ్గించుడా?

వేతన సవరణల్లో పెంచకున్నా ఫర్వాలేదు కానీ, తగ్గించవద్దని ఉద్యోగులంతా కోరుకుంటారు. కానీ, హెచ్ఆర్ఏ స్లాబులను 30 శాతం, 20 శాతం, 14.5 శాతం, 12 శాతం నుంచి తగ్గించి 24 శాతం, 17 శాతం, 13 శాతం, 11 శాతానికి కుదించడం చాలా దారుణమైన చర్య. అయితే ఉద్యోగులు ‘నాదన్నా నా కియ్యి రాజన్న దేవుడా’అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాట్యుటీని రూ.20 లక్షలకు పెంచాల్సి ఉండగా దానిని రూ.16 లక్షలకు పరిమితం చేసిన పీఆర్సీ కమిటీ రిపోర్ట్​ ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది. కనీస వేతనం రూ.24 వేలు ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తే దానిని రూ.19 వేలకు నిర్ధారించి చిన్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే గరిష్ట వేతనం రూ.1,62,070కు పెంచడం కాస్త ఊరట. ఇంక్రిమెంటు రేటు 5 శాతం ఉండాలని కోరితే 2.5 శాతంగా పీఆర్సీ కమిటీ సిఫారసు చేయడం కూడా ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. డీఏ రేటు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఉండాల్సి ఉండగా 0.910గా నిర్ధారించి ఆశలను చిదిమేశారు. అలాగే 10వ పీఆర్సీలో పెన్షనర్లకు ‘క్వాంటం ఆఫ్ పెన్షన్’70 సంవత్సరాలకు అమలు పరచాలంటే, ఈసారి 75 ఏండ్లకు పెంచడం ద్వారా రెండున్నర లక్షల మంది పెన్షనర్లను పీఆర్సీ కమిటీ రిపోర్ట్​ విస్మయానికి గురిచేసింది.

సీపీఎస్​ రద్దు చేయాలంటే వాటా పెంచారు

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను పూర్తిగా రద్దు చేయాలని ఉద్యోగ, టీచర్ల సంఘాలు నిరసనలు, ఆందోళలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్నో ఏండ్లుగా ఇదే విషయంపై ఎన్నో వినతులు ఇచ్చాయి. సీపీఎస్​ రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతుండగా, పీఆర్సీ కమిటీ మాత్రం పెన్షన్ నిధి వాటాను ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 14 శాతానికి పెంచి ఉద్యోగులు, టీచర్లు మరింత ఆందోళనకు గురయ్యేలా చేసింది. అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) ఉద్యోగుల, పెన్షనర్ల మూలవేతనంలో ఒక శాతం నిధికి సుమారు రూ.600 కోట్లు జమ చేసి, ఆ మొత్తంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద నగదు రహిత సేవలందించాలని నిర్ణయించడం దుర్మార్గం. కేజీబీవీలు, అర్బన్ గురుకుల స్కూళ్లు, మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్ల ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలనే అంశాన్ని పట్టించుకోలేదు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్​ను​ పీఆర్సీ కమిటీ అసలు పట్టించుకోనే లేదు.

సిఫారసుల్లో శాస్త్రీయత లేదు

గుడ్డిలో మెల్లగా ఉద్యోగుల రిటైర్మెంట్​ వయసును 60 ఏండ్లకు పెంచడం, గ్రాట్యుటీని రూ.4 లక్షలు పెంచడం, కనీస వేతనం రూ.19 వేలకు పెంచడం, శిశు సంరక్షణ సెలవులను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచడం, డెత్ రిలీఫ్ ను రూ.30 వేలకు పెంచడం, ఎల్టీసీ సర్వీసులో నాలుగు సార్లు వాడుకోవడం మొదలైన సిఫారుసులను పీఆర్సీ కమిటీ చేసింది. అయితే వాటి వల్ల ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. పీఆర్సీ కమిటీ మొత్తంగా 501 వినతిపత్రాలు స్వీకరించి, 345 సమావేశాలు జరిపి, అభిప్రాయాలు సేకరించి, అన్ని కోణాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చామంటున్నా ఈ సిఫారసుల్లో ఏ మాత్రం శాస్త్రీయత, హేతుబద్ధత కనిపించడం లేదు.

కరోనా ఎప్పుడొచ్చింది.. పీఆర్సీ ఎప్పుడివ్వాలి?

తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు ఎక్కువ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని, అలాగే కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారి రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గిందని కొందరు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అందుకే ఫిట్​మెంట్​ 7.5 శాతానికి సిఫారసు చేయాల్సి వచ్చిందని, ఉద్యోగ సంఘాలు పరిస్థితిని అర్థం చేసుకొని, కింది స్థాయిలో క్యాడర్‌‌కు అర్థమయ్యేలా చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని బుజ్జగిస్తున్నారు. నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి కరోనా ఎప్పుడొచ్చింది? అలాగే పీఆర్సీ ఎప్పుడివ్వాల్సి ఉండే? ఆనాడే పీఆర్సీ అమలు చేసి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి ఉండేదా? కానే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికీ దీనినొక సాకుగా వాడుకోవాలని చూస్తున్నది. తానిచ్చిన హామీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నది. ఇది సరైన చర్య కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, సాకులు వెతకకుండా, ఈ అత్తెసరు పెంపు కాకుండా వాస్తవాల ఆధారంగా, సైద్ధాంతిక ఆలోచనలతో 43 శాతం ఫిట్​మెంట్​ ప్రకటించాలి. అలాగే ఉద్యోగుల ఇతర సమస్యలన్నీ పరిష్కరించి, మాటల్లో కాకుండా, చేతల్లో ఎంప్లాయీస్​ ఫ్రెండ్లీ సర్కార్​ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది.

– ముస్కుల రఘుశంకర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్

For More News..

టెన్త్​, ఇంటర్​తో జాబ్​ గ్యారంటీ కోర్సులు

ఎకానమీలో ఈ ఏడాది గ్రోత్​ గ్యారెంటీ

స్కూల్స్ రీ ఓపెన్.. శానిటైజేషన్‌కు ఫుల్ డిమాండ్

దేశంలోనే మన పోలీసులు బెస్ట్