మత సామర్యం అంటే ఇదే : శివాలయంలో శివ భక్తులకు.. ముస్లిం సోదరుడి అన్నప్రసాదం

మత సామర్యం అంటే ఇదే : శివాలయంలో శివ భక్తులకు.. ముస్లిం సోదరుడి అన్నప్రసాదం

మతాలు, కులాలు అంటూ రాజకీయ మాటల యుద్ధాలు రోజూ చూస్తేనే ఉన్నాం.. జనాన్ని కులాలుగా, మతాలుగా చీల్చి ఓట్ల రాజకీయాలు చేసే పార్టీలనూ చూస్తూనే ఉన్నాం.. జనం అంతా అలా ఉన్నారా అంటే అస్సలు లేరు.. మనిషి మనిషిగా.. దేవుళ్లు అంతా ఒక్కటే అన్న భావనతోనూ ఉన్నారు. మతాలు వేరయినా దేవుడు ఒక్కడే.. పూజించే విధానం వేరైనా ప్రార్థన ఒక్కటే.. ఎవరు తిన్నా ఆ అన్నమే.. ఎవరు తాగినా ఆ నీళ్లే.. మంచి మనసు ఉండాలి కానీ.. స్వీకరించే మనస్సులు చాలా ఉన్నాయని నిరూపించిన ఘటన ఇది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంధ్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో జరిగిన ఈ విశేషం.. ఇప్పుడు అందరి మన్ననలు పొందుతుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఆత్మకూరు పట్టణంలో 150 మంది శివ మాల ధరించారు. ఈ 150 మంది శివ మాల భక్తులకు.. పట్టణంలోని ముస్లిం సోదరుడు నబి రసూల్ అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. శివాలయంలోనే భక్తులకు అన్న ప్రసాదం అందించిన గొప్ప మనస్సు చాటుకున్నారు. ముస్లిం సోదరుడు నబి రసూల్ ఇచ్చిన అన్న ప్రసాదాన్ని.. ఆ శివుడి సాక్షిగా స్వీకరించారు శివ భక్తులు.

Also Read :- చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి బాధాకరం

ముస్లిం వ్యక్తి నబి రసూల్ శివ భక్తుల కోసం స్వయంగా ఆహారాన్ని తయారు చేశారు. ఎంతో నిష్ఠగా దగ్గరుండి అన్ని తయారు చేయించారు. ఈ సందర్భంగా నబి రసూల్ మాట్లాడుతూ.. ఎవరి భక్తి వాళ్లకు గొప్పగా ఉంటుంది.. దేవుడు అందరికీ వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారని.. ఎవరి నమ్మకం వాళ్లది అని చెప్పుకొచ్చారు. హిందూ ముస్లింలు అనే బేధం మనం ధరించే వేషానికే తప్ప.. మనసుకు కాదని.. అందరం ఒక్కటే.. అందరి దేవుడు ఒక్కడే  నని.. శివ దీక్ష చేస్తున్న స్వాములకు సేవ చేయడం సంతృప్తిని ఇచ్చిందని చెప్పుకొచ్చారు నబి రసూల్. 

కుల మతాలకు అతీతంగా స్వాములకు భోజనం ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటిన ముస్లిం సోదరులను ఆశీర్వదించారు శివ స్వాములు. పట్టణంలో ఇలాంటి మంచి వాతావరణం ఎల్లప్పుడూ.. ఎప్పుడూ ఉండాలంటూ ఆత్మకూర పట్టణ ప్రజలు చర్చించుకోవటం విశేషం.