ముస్లింల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. వక్ఫ్​సవరణ చట్టం

ముస్లింల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. వక్ఫ్​సవరణ చట్టం

మోదీ ప్రభుత్వం లోతయిన పరిశీలన, అధ్యయనం, చర్చల అనంతరం పార్లమెంట్లో ఆమోదింపజేసిన వక్ఫ్ సవరణ చట్టం భారతదేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో ఒక పెద్ద ముందడుగు.  వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సంస్కరించడం, వాటి ద్వారా అణగారిన ముస్లిం వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా చూడటం దీని ప్రధాన లక్ష్యం. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ మోదీ ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశంసిస్తూ ఈ చట్టం సాధారణ ముస్లింలకు ఒక వరం అని పేర్కొనడం గమనార్హం.  ‘వక్ఫ్ సవరణ చట్టం సాధారణ ముస్లింలకు హాని కలిగించదు. వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

విలువైన భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించిన వక్ఫ్ భూ మాఫియాలు మాత్రమే నష్టపోతారు. దీనివల్ల సాధారణ, పేద ముస్లింలు ప్రభావితం కారు’ అని మౌలానా షాబుద్దీన్​ రజ్వీ తెలిపారు.  వక్ఫ్ భూమి నుంచి వచ్చే ఆదాయం పేద, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.  వక్ఫ్ భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని ముస్లింల ప్రయోజనాల కోసం, అనాథలు, వితంతువుల అభివృద్ధికి ఉపయోగిస్తారు. పేద ముస్లింల కోసం పాఠశాలలు, కళాశాలలు, మదర్సాలు, అనాథ శరణాలయాలను స్థాపించేందుకు ఈ నిధులను ఉపయోగిస్తారు.

అక్రమాల నియంత్రణ వక్ఫ్ చట్టం లక్ష్యం 

ఈ చట్టం కారణంగా మసీదులు, మదర్సాలు, ఈద్గాలు, శ్మశానవాటికలు లేదా పుణ్యక్షేత్రాలకు ఎటువంటి ముప్పు ఏర్పడదు. మతపరమైన సంస్థలపై ఈ చట్టం ఏ విధంగానూ జోక్యం చేసుకోదని  కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నా  కొంతమంది రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం ముస్లింలను ఈ విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారు. 

గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో ఏ విధమైన వివాదాలను సృష్టించారో ఇప్పుడు అదే విధంగా వక్ఫ్ చట్టం విషయంలోనూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే,  సీఏఏ అమలు ప్రారంభమైన తర్వాత ముస్లింలెవ్వరూ పౌరసత్వం కోల్పోలేదని తేటతెల్లం కావడంతో వారిలో భయాందోళనలు తొలగిపోయాయి. 

వక్ఫ్ చట్టం లక్ష్యం వక్ఫ్ ఆస్తులను నిర్వహించడం అందులో అక్రమాలను నియంత్రించడంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడానికి వక్ఫ్ చట్టం 1995ను సవరించారు.  గత చట్టంలోని లోపాలను అధిగమించడం, చట్టం పేరు మార్చడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం, వక్ఫ్ రికార్డులను సాంకేతికంగా నిర్వహిండచం వంటి మార్పులతో వక్ఫ్ బోర్డుల సామర్థ్యాన్ని పెంచడం సవరణ చట్టం ప్రధాన లక్ష్యం.

 వక్ఫ్ బోర్డులకు భారీగా భూములు

 వక్ఫ్ బోర్డులు ప్రస్తుతం భారతదేశం అంతటా 9.4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 8.7 లక్షల ఆస్తులను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ. 1.2 లక్షల కోట్లు  ఉంటుందని అంచనా. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వక్ఫ్ భూములు కలిగిన దేశం కావడం గమనార్హం. అయితే, వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ రాజ్యాంగంలో పరిమిత వైవిధ్యం నెలకొనడం, ముతవల్లీలు అధికార దుర్వినియోగం, ముతవల్లీలు ఆస్తులపై సరైన ఖాతాలను నిర్వహించకపోవడం, స్థానిక రెవెన్యూ అధికారులతో సమర్థవంతమైన సమన్వయం లేకపోవడం, ఆక్రమణలను అడ్డుకోకపోవడం, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, టైటిల్ ప్రకటన, వివాదాలు, వ్యాజ్యాలకు దారితీసే ఆస్తులను క్లెయిమ్ చేయడానికి వక్ఫ్ బోర్డులకు అధికారాన్ని విరమించుకోవడం, వర్గాల మధ్య అసమానతను సృష్టించే పట్టణ భూ పరిమితి చట్టం వర్తించకపోవడం వంటి సమస్యలతో వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం సుదీర్ఘకాలంగా వివాదాలకు కేంద్రంగా మారుతూ వస్తున్నది. 

1995 వక్ఫ్ చట్టంకు 2013లో లోతైన అధ్యయనం, సంప్రదింపులు చేయకుండా సవరించడంతో వక్ఫ్ ఆస్తులు మరింత వివాదాల్లో చిక్కుకోవడంతోపాటు దుర్వినియోగం కూడా అవుతోంది. వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కు, స్వాధీనం సమస్య,  రిజిస్ట్రేషన్, ట్రిబ్యునల్ పనితీరు, ఫిర్యాదులకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని దుర్వినియోగం చేయడంతో కోర్టు వివాదాలు ఎక్కువయ్యాయి.  2023 ఏప్రిల్ నుండి వచ్చిన ఫిర్యాదులను విశ్లేషిస్తూ వాటిలో 148 ఆక్రమణలు, అక్రమ అమ్మకాలు, సర్వేలు, రిజిస్ట్రేషన్లో జాప్యం, ముతవల్లీలకు సంబంధించినవని తేలింది. 

2022 ఏప్రిల్ నుంచి2023 మార్చి వరకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్​కు వచ్చిన ఫిర్యాదులను మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తే 566 ఫిర్యాదులలో 194 ఫిర్యాదులు వక్ఫ్ భూమిని అక్రమంగా ఆక్రమించడం, బదిలీ చేయడంపై వచ్చాయని, 93 ఫిర్యాదులు వక్ఫ్ బోర్డు/ముతవల్లీల అధికారులపై ఉన్నాయని తేలింది. ట్రిబ్యునళ్లలో 40,951 కేసులు పెండింగ్​లో ఉన్నాయని, వాటిలో 9,942 కేసులు ముస్లిం సమాజం వక్ఫ్ నిర్వహించే సంస్థలపై దాఖలు చేశాయని తేలింది. ఈ కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ట్రిబ్యునల్ నిర్ణయాలపై న్యాయ పర్యవేక్షణకు ఎటువంటి నిబంధన లేదు.

సచార్​ కమిషన్​ సూచనల మేరకే..

ముస్లింల స్థితిగతులపై అధ్యయనం జరిపిన సచార్ కమిషన్ వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా ఉపయోగంలోకి తెస్తే, అవి కనీసం 10 శాతం, అంటే సంవత్సరానికి రూ.12,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలవని అంచనా వేసింది. సచార్ కమిటీ 2006లో తన నివేదికను సమర్పించింది. వక్ఫ్ నిర్వహణను మెరుగుపరచడానికి పలు చర్యలు సిఫార్సు చేసింది. 

ముతవల్లీలపై నియంత్రణ అవసరమని పేర్కొంటూ, సమర్థవంతంగా రికార్డుల నిర్వహణ, వక్ఫ్ నిర్వహణలో సాంకేతిక నైపుణ్యాన్ని చేర్చడంతోపాటు సెంట్రల్ వక్ఫ్ బోర్డు, రాష్ట్రాల వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళా సభ్యులను చేర్చాలని, వక్ఫ్ బోర్డుల బలోపేతానికి సంస్కరణలు 
చేపట్టాలని  సచార్ కమిటీ సూచించింది. వక్ఫ్ ఆస్తులను ఆర్థిక ఆడిట్ పథకం కిందకు తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటువంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరుస్తూనే వక్ఫ్ బోర్డుల ఏకపక్ష, అధికారాలను హేతుబద్ధం చేసేవిధంగా ఈ చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. 

ముస్లిం సమాజం సమష్టి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని, వారి సమగ్రాభివృద్ధికి వక్ఫ్ ఆస్తులు ఉపయోగపడేవిధంగా చారిత్రాత్మకమైన సంస్కరణగా ఈ చట్టం తీసుకువచ్చారు. గత శతాబ్ద కాలంలో భారతదేశంలో ముస్లింల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చేపట్టిన ఇది అత్యంత కీలకమైన ప్రయత్నంగా చెప్పవచ్చు.  

ఇస్లామిక్ దేశాలలో  వక్ఫ్ బోర్డులు లేవు

ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు 2024 ప్రాథమిక లక్ష్యం ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1923ను రద్దు చేయడం.  ఇది వలస రాజ్యాల కాలం నాటి చట్టం. ప్రస్తుతం ప్రవేశపెట్టిన సవరణ చట్టంతో వక్ఫ్ ఆస్తుల పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. అసమానతలు, అస్పష్టతలను తొలగిస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుందనే దుర్మార్గపు ప్రచారాన్ని కొన్ని రాజకీయ వర్గాలు చేస్తున్నాయి. 

వక్ఫ్ ఆస్తులు అంటే అల్లాకు ఆస్తులను బదిలీ చేసినట్లు అర్థం.  అల్లాకు ఒకసారి బదిలీ చేసిన తర్వాత వాటిని వెనక్కి తీసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంటే ఒకసారి వక్ఫ్ ఆస్తిగా మారిన తర్వాత ఆ ఆస్తి యాజమాన్యం ఎల్లప్పటికీ వక్ఫ్ అధీనంలోనే ఉంటుందని గ్రహించాలి. ఉదాహరణకు 1850 నుంచి వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేస్తున్న బెంగళూరు ఈద్గా మైదానం, అదేవిధంగా మొఘల్ కాలంలో హాజ్ సమయంలో ‘సరాయ్​’గా చారిత్రాత్మకంగా ఉపయోగించినందున సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం కూడా వక్ఫ్ ఆస్తులుగానే ఉన్నాయి. 

మరో ముఖ్యమైన విషయం అన్ని ఇస్లామిక్ దేశాలలో వక్ఫ్ బోర్డులు, ఆస్తులు లేవని గ్రహించాలి. టర్కీ, లిబియా, ఈజిప్టు, సూడాన్, లెబనాన్, సిరియా, జోర్డాన్, ట్యునీషియా, ఇరాక్ వంటి ఇస్లామిక్ దేశాలలో  వక్ఫ్ బోర్డులు లేవు.  కానీ, భారతదేశంలో రక్షణ, రైల్వే తర్వాత వక్ఫ్ బోర్డులకు భారీగా భూములున్నాయి. వాటిని చట్టబద్ధంగా రక్షించే చట్టం కూడా ఉంది.

- డా. జి. మనోహర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు-