బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో ముస్లింలకు అన్యాయం : మహ్మద్​అన్నారీ

కాశీబుగ్గ, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో ముస్లింలకు అన్యాయం జరిగిందని ఓయూ రిటైర్డ్​ప్రొఫెసర్‌‌, మైనార్టీ రైట్స్‌‌, ప్రొటెక్షన్‌‌ కమిటీ స్టేట్‌‌ ప్రెసిడెంట్‌‌ మహ్మద్​అన్నారీ అన్నారు. వరంగల్‌‌ సిటీలోని అబ్నూస్‌‌ ఫంక్షన్‌‌హాల్‌‌లో ఆదివారం జరిగిన ముస్లిం డిక్లరేషన్‌‌ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ, నామినేటెడ్‌‌ పోస్టుల్లో ప్రయారిటీ, బడ్జెట్‌‌ కేటాయింపులు, వక్స్​బోర్డు ఆస్తుల పరిరక్షణ, సబ్సిడీ లోన్లు, ఇలా ఏ రంగంలో చూసినా ముస్లింలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌‌గానే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ముస్లింల కోసం సీఎం కేసీఆర్‌‌ ఒక్క ప్రత్యేక పథకం కూడా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే ముస్లింలకు కేటాయించారని విమర్శించారు. అనంతరం 22 డిమాండ్లతో మైనార్టీ డిక్లరేషన్‌‌ను రూపొందించారు. కార్యక్రమంలో సయ్యద్‌‌ సలీమ్‌‌ పాషా, ఆయూబ్ పాల్గొన్నారు.