ఆపరేషన్​ పోలో పేరుతో ముస్లింల భూములు గుంజుకున్నరు

ఆపరేషన్​ పోలో పేరుతో ముస్లింల భూములు గుంజుకున్నరు
  •     వక్ఫ్ భూములు రెవెన్యూ పరిధిలో ఉండడమేంది?:  అక్బరుద్దీన్​
  •     భూ సంస్కరణలు చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్​ పోలో పేరుతో హైదరాబాద్​ను దేశంలో విలీనం చేసినపుడు హైదరాబాద్​లోని ముస్లింల భూములను గుంజుకున్నారని ఎంఐఎం ఫ్లోర్​ లీడర్​ అక్బరుద్దీన్​ ఒవైసీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పేద ముస్లింలు తమ భూములను కోల్పోతూనే ఉన్నారని ఆయన ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలో ధరణిపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్​ మాట్లాడారు. 

అర్బన్​ ల్యాండ్  సీలింగ్​ యాక్ట్, ఇనాం అబాలిషన్​ యాక్ట్, జాగీర్​ అబాలిషన్​ యాక్ట్​ వంటి చట్టాలతో పేద ముస్లింలే ఎక్కువగా భూములు కోల్పోయారని ఆయన చెప్పారు. వక్ఫ్​ భూములన్నీ రెవెన్యూ పరిధిలోనే ఉండడమేందని ఆయన ప్రశ్నించారు.

 ‘‘మైక్రోసాఫ్ట్, విప్రో వంటి ఎంఎన్ సీలను వక్ఫ్​ భూముల్లోనే కట్టారు. ఐటీ అభివృద్ధి కోసం ల్యాండ్​ తీసుకుని ఐటీ డెవలప్​ చేయకుండా రెసిడెన్షియల్​ కాంప్లెక్సులను కట్టారు. ఎయిర్​పోర్టును కూడా వక్ఫ్​ భూముల్లోనే నిర్మించారు. ధరణి కమిటీ దాదాపు 123 సమస్యలను ధరణి వెబ్​సైట్​లో గుర్తించింది. తెలంగాణ హైకోర్టు కూడా ధరణిలోని లోపాలను ఎత్తి చూపింది. భూ సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది” అని అక్బరుద్దీన్  చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధికి కృషిచేయాలి

హైదరాబాద్​నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని, ఇందుకోసం మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీ ప్రభుత్వానికి సూచించారు. ప్రజారవాణాను మెరుగుపరచడం, ప్రైవేట్​ రవాణాను తగ్గించడం, సోలార్​, విండ్​పవర్​వాడకాన్ని పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు. శుక్రవారం అసెంబ్లీలో హైడ్రా బిల్లుపై జరిగిన స్వల్ప చర్చలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడారు.  

నగరంలో కేవలం 2 వేల బస్సులే అందుబాటులో ఉన్నాయని, వీటి సంఖ్య  పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటర్​మేనేజ్​మెంట్, రెయిన్​వాటర్​హార్వెస్టింగ్​ద్వారా నీటిఎద్దడి తీర్చాలని,  చెట్ల పెంపకం ద్వారా గ్రీన్​జోన్ పెంచాలని సూచించారు.