సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్

కేంద్రప్రభుత్వం తెచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని అమలు చేయకుండా స్టే విధించాలని కోరుతూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఏఏ వల్ల నిర్దిష్ట మతాలకు మాత్రమే పౌరసత్వం దక్కుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.  ఇది ప్రాథమికంగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో  పేర్కొంది. 

మరి ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా..? అన్నది ఆసక్తిగా మారింది. ఒక వేళ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తే ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.  మరోవైపు  పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు సీఏఏ అమలు చేయడాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా తృణమూల్‌, సీపీఐ, ఆప్‌, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు తప్పుపట్టాయి.

ALSO READ:- బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. టీ20 వరల్డ్ కప్ నుంచి విరాట్ కోహ్లీ ఔట్

లోక్​సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం  మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజిట్​విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సీఏఏ అమల్లోకి వచ్చింది.  మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్​ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్​ నుంచి భారత్​కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్​ క్లియర్​ అయింది.