అయోధ్యలో కొత్త మలుపు?

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ అయోధ్యలో భూమిపై వివాదం సాగుతోంది. 70 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యకు తాను రిటైరయ్యేలోగా పరిష్కారం ఇవ్వాలని చీఫ్​ జస్టిస్​ రంజన్​ గగోయ్​ పట్టుదలగా ఉన్నారు. ఆయన వచ్చే నెల 17న రిటైరవుతారు. ఈలోగానే నవంబర్​ నాలుగయిదు తేదీల్లో తీర్పు వెలువడుతుందని అనుకుంటున్నారు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేసుగా దీనిని చెప్పక తప్పదు. రాజకీయంగానూ, సామాజికంగానూ అయోధ్య భూ వివాదం చాలా మార్పులు తెచ్చింది. పాతికేళ్ల క్రితం అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కరసేవకులు కూల్చేయడంతో దేశంలోని పలుచోట్ల హింసాత్మక ఘటనలుకూడా చోటు చేసుకున్నాయి.

అనేక మలుపులు తిరుగుతున్న అయోధ్య భూమి వివాదం ఒక కొలిక్కి వచ్చే దశలో మళ్లీ మెలికలు పడుతోంది.  దాదాపు 40 రోజులపాటు విచారణ జరిగాక, తీర్పు రిజర్వ్​ చేసింది సుప్రీం కోర్టు. ఎవరైనా ఏమైనా చెప్పుకోవాలంటే రాసి ఇవ్వాలని చెప్పింది. ఈ ప్రాసెస్ ఇలా సాగుతుండగానే… సున్నీ వక్ఫ్​ బోర్డు తరఫు లాయర్​ ‘సెటిల్​మెంట్​ ద్వారా సమస్యను సాల్వ్​ చేసుకుందాం’ అని ప్రపోజల్​ తేవడం కొత్త చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని ప్రొసీడింగ్స్​ జరుగుతున్నప్పుడే చెప్పాల్సిందని హిందువుల తరఫు పిటిషనర్లు అంటున్నారు. అయోధ్య భూమి విషయంలో 2.77 ఎకరాల మేరకే వివాదం సాగుతోంది. ఈ భూమిని మూడు భాగాలుగా చేసి, ఒక వంతును రాముడి తరఫున పిటిషనరయిన రామ్​ లల్లా విరాజ్​మాన్​కి, రెండో వంతును నిర్మోహి ఆఖాడాకి, మూడో వంతును సున్నీ వక్ఫ్​ బోర్డుకి ఇవ్వాలని అలహాబాద్​ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును అన్ని పక్షాలూ సుప్రీంలో సవాల్​ చేశాయి. ఇది జరిగి తొమ్మిదేళ్లు గడిచాయి.

ఈ మూడు పార్టీల వివరాలు ఒకసారి చూస్తే… వివాదంలో ఉన్న స్థలంలో రామునికి పూజలు జరుపుతున్న నిర్మోహి అఖాడా, కట్టడాన్ని కూల్చివేసిన చోటనే మరలా మసీదును కట్టేలా భూమిని అప్పగించాలని కోరుతున్న యూపీ సున్నీ వక్ఫ్​ బోర్డు, రామ జన్మభూమిగా భావిస్తున్న ప్రాంతంలో 1949లో విగ్రహాలను పెట్టిన రామ్​ లల్లా విరాజ్​మాన్​ ఉన్నాయి.

అయోధ్య భూమిపై టైటిల్​ డిస్ప్యూట్​ కేసు(యాజమాన్య హక్కు)ను పరిష్కరించాలన్న పట్టుదలతో జస్టిస్​ దీపక్​ మిశ్రా రెగ్యులర్​గా ఈ కేసులో విచారణ జరిపించాలని నిర్ణయించారు. అది అమలు కాకుండానే ఆయన గత ఏడాది సుప్రీం కోర్టు చీఫ్​ జస్టిస్​గా రిటైరైపోయారు. ఆయన తర్వాత వచ్చిన చీఫ్​ జస్టిస్​ రంజన్​ గగోయ్​ ఈ కేసును త్వరత్వరగా విచారించి, జడ్జిమెంట్​ ఇవ్వడానికి అన్ని సన్నాహాలు చేశారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో తనతోపాటు జస్టిస్​ ఎస్​.ఏ.బాబ్డే, జస్టిస్​ డి.వై.చంద్రచూడ్​, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఎస్.ఏ.నజీద్​లతో ఒక ధర్మాసనాన్ని ఏర్పరిచారు.  ఈ అయిదుగురి బెంచ్​ ఆగస్టు 6 నుంచి రోజువారీగా కేసులోని మూడు ప్రధాన పార్టీల వాదోపవాదనలు విన్నది. దాదాపు 40 రోజులపాటు వాదనలు విన్నాక… ఈ నెల 16వ తేదీతో ఆర్గ్యుమెంట్లను ముగించేసి, తీర్పును రిజర్వ్​లో పెట్టింది. ఒకవేళ ఏమైనా చెప్పదలుచుకుంటే రాసి మాత్రమే ఇవ్వమని కోరింది.

నిజానికి, డే–టు–డే ఆర్గ్యుమెంట్లను ఆరంభించడానికి ముందే సుప్రీం కోర్టు మార్చి నెలలో ఆర్ట్​ ఆఫ్​ లివింగ్​ చీఫ్​ శ్రీశ్రీరవిశంకర్​, రిటైర్డ్​ సుప్రీం కోర్టు జడ్జి ఎఫ్​.ఎం.ఖలీఫుల్లా, సీనియర్​ అడ్వకేట్​ శ్రీరామ్​ పంచూలతో కమిటీ వేసి, పిటిషనర్లతో సంప్రదింపులు జరపాల్సిందిగా ఆదేశించింది. ఈ కమిటీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి ఆగస్టు రెండో తారీఖున తమ మీడియేషన్​వల్ల ప్రయోజనం లేదని కమిటీ చేతులెత్తేసింది. దాంతో రోజువారీ వాదనలకు సుప్రీం బెంచ్​ రెడీ కావలసి వచ్చింది.

ఇదిలా ఉండగా, ఈ కేసులో అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు వెలువడుతుందని భావిస్తుండగా, సున్నీ వక్ఫ్​ బోర్డు లాయర్​ షాహిద్​ రిజ్వీ వ్యాఖ్యలు మలుపు తిప్పేలా ఉన్నాయి. ‘ఇలాంటి వివాదానికి అసలు తీర్పు అవసరం లేదు. సెటిల్​మెంట్​ చేసుకోవడమే సరైన పరిష్కారం. సెటిల్​మెంట్​లోని అంశాలు ఎవ్వరినీ నిరాశపరచవని అనుకంటున్నాం. ఈ కేసులోని అన్ని పార్టీలకు విన్​–విన్​ సిట్యుయేషన్​గా ఉంటుంది’ అని రిజ్వీ అన్నారు.  అయితే, ఈ సెటిల్​మెంట్​ వార్తలను  రామ్​ లల్లా, నిర్మోహి అఖాడా కొట్టిపారేస్తున్నాయి. ‘తీర్పులో విన్​–విన్​ సిట్యుయేషన్​ లేదు. వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్స్​ లేదు. అది తెలిసే, వక్ఫ్​ బోర్డు సెటిల్​మెంట్​ అంటూ కొత్త పాట పాడుతోంది’ అని అంటున్నాయి. ఈ విషయంలో వక్ఫ్​ బోర్డు మినహా తతిమా ముస్లిం పార్టీలుకూడా సెటిల్​మెంట్​కి ససేమిరా అంటున్నాయి.

ఒక కేసులో తీర్పు రిజర్వ్​ అయి ఉండగా, మీడియేషన్​ పేరుతో లీక్​లు ఇవ్వడాన్ని అంగీకరించేది లేదని పిటిషనర్ల తరఫు అయిదుగురు న్యాయవాదులు ఒక స్టేట్​మెంట్​ రిలీజ్​ చేశారు. వీహెచ్​పీ సపోర్ట్​ చేస్తున్న రామ జన్మభూమి న్యాస్​కూడా సుప్రీం కోర్టు తీర్పుకోసం ఎదురుచూస్తున్నామని, సెటిల్​మెంట్​ ప్రపోజల్​కి ఒప్పుకునేది లేదని చెబుతోంది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో బంతి ఉంది. బహుశా వచ్చే నెల 4, 5 తేదీల్లో అంతిమ తీర్పు వెలువడే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు.

దేశానికి ఇండిపెండెన్స్​ వచ్చినప్పటి నుంచీ నలుగుతోంది అయోధ్యలో భూ వివాదం. దాదాపు 70 ఏళ్లనాటి ఈ వివాదానికి పర్మినెంట్​ సొల్యూషన్​ తమద్వారానే వెలువడాలని సుప్రీం కోర్టు నిర్ణయించుకుంది. దానికంటే ముందుగా ముగ్గురితో కమిటీని వేసినా పరిష్కారం రాలేదు. దాంతో ఆగస్టు నుంచి 40 రోజులపాటు నాన్​స్టాప్​గా ఆర్గ్యుమెంట్లను విని తీర్పును త్వరలో ఇస్తానంది. ఇప్పుడు ప్రధాన పిటిషనర్లలో ఒకటైన యూపీ సున్నీ వక్ఫ్​ బోర్డు.. అవుటాఫ్​ కోర్టు సెటిల్​మెంట్​కి ప్రతిపాదన తెచ్చిందని చెబుతున్నారు. మరో మూడు వారాల్లో జడ్జిమెంట్​ వస్తుందనుకున్న కేసులో ఇదొక కొత్త మలుపు కాబోతోందని లీగల్​ ఎక్స్​పర్ట్​లు అంటున్నారు.

వక్ఫ్​ బోర్డులో ఈ మార్పు ఎందుకొచ్చింది?

అయోధ్యలో కట్టడాన్ని కూల్చివేసిన చోట మరో మసీదు కట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఆ ప్రదేశంలో ఇప్పటికే తాత్కాలిక రామ మందిరాన్ని ఏర్పాటు చేసేశారు. ఈ విషయాన్ని యూపీ సున్నీ వక్ఫ్​ బోర్డు గమనించింది. అదీగాక, మొత్తం కేసును ఓడిపోవడంకంటే కొన్ని హామీలతో సెటిల్​మెంట్​ చేసుకోవడమే మంచిదని భావించినట్లు లీగల్​ ఎక్స్​పర్ట్​లు అంటున్నారు.

3 చోట్ల ప్రిఫ్యాబ్రికేషన్ పనులు

అయోధ్యలో రామమందిర నిర్మాణంకోసం శిల లు చెక్కడం, ప్రిఫ్యాబ్రికేషన్​ స్తంభాలను సిద్ధం చేయడం జరుగుతోంది. దీనికోసం అయోధ్యలో రెండు చోట్ల, రాజస్థాన్​లోని మక్రానాలోనూ వర్క్​ షాపుల్ని విహెచ్​పి నిర్వహిస్తోంది. రెండతస్తులుగా కట్టే రామమందిరం కోసం మొత్తం 212 స్తంభాలు అవసరమవుతాయని స్తపతులు చెబుతున్నారు. ఇప్పటికే యాభై శాతం పని పూర్తయ్యిందని, నిర్మాణ సమయంలో మిగతా పని పూర్తి చేస్తామని కరసేవక్​పురం ఇన్​చార్జి అన్నూ భాయ్​ సోంపుర తెలిపారు.