- అక్కడి నుంచి ఏ దేశంపైనా దాడులు జరగొద్దు: బ్రిక్స్ దేశాల డిక్లరేషన్
- టెర్రరిజంపై ఏ దేశమూ డబుల్ స్టాండర్డ్స్ పాటించరాదు
- అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా బ్రిక్స్: మోడీ
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితిపై బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. టెర్రరిజానికి అఫ్గాన్ అడ్డాగా మారరాదని, అక్కడ్నుంచి ఏ ఇతర దేశంపైనా టెర్రర్ అటాక్స్ జరగరాదన్నాయి. యాంటీ టెర్రరిజం కోసం తగిన యాక్షన్ ప్లాన్ అవసరమని ప్రకటించాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 13వ బ్రిక్స్ సమావేశంలో ఈ మేరకు బ్రిక్స్ దేశాలు డిక్లరేషన్ ను ఆమోదించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వాయిస్ గా బ్రిక్స్ అవతరించిందన్నారు. బ్రిక్స్ ఏర్పాటు చేసి 15 ఏండ్లయిన సందర్భంగా ‘‘బ్రిక్స్@15: ఇంట్రా–-బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ, కన్సాలిడేషన్ అండ్ కన్సెన్సస్” థీమ్ తో సమ్మిట్ నిర్వహించారు. కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు మోడీ వెల్లడించారు. మల్టీల్యాటరల్ సిస్టమ్స్ ను బలోపేతం చేయాలని, కొన్ని మార్పులు తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ‘‘బ్రిక్స్ సభ్య దేశాల నుంచి మాకు అన్ని విధాలా సహకారం అందింది. ఇందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని మోడీ చెప్పారు. గత 15 ఏండ్లలో బ్రిక్స్ ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. రానున్న 15 ఏండ్లలో బ్రిక్స్ ను మరింత శక్తివంతంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది 150 బ్రిక్స్ మీటింగ్స్, కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఇందులో 20కి పైగా మినిస్టర్స్ లెవల్ లో జరిగాయని పేర్కొన్నారు. సమ్మిట్ లో మోడీతోపాటు బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పాల్గొన్నారు. 2016లో మొదటిసారి బ్రిక్స్ కు అధ్యక్షత వహించిన మోడీ.. ఇప్పుడు రెండోసారి అధ్యక్షత వహించారు. మొత్తంగా మన దేశం మూడోసారి బ్రిక్స్ సమ్మిట్ నిర్వహించింది.
అఫ్గాన్ పై జాగ్రత్తగా ఉండాలె: పుతిన్
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోవడంతోనే దారుణాలు జరిగాయని, అది రీజినల్, గ్లోబల్ సెక్యూరిటీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్ పొరుగు దేశాలకు ముప్పుగా మారకుండా చూడాలని.. డ్రగ్ ట్రాఫికింగ్, టెర్రరిజానికి అది వేదిక కాకుండా నివారించాలని పిలుపునిచ్చారు. అఫ్గాన్ లో శాంతిని నెలకొల్పాలని, అక్కడ్నుంచి వలసలను ఆపాలన్నారు.
కలిసి పనిచేస్తం: జిన్ పింగ్
బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయంగా ముఖ్యమైన శక్తిగా మారాయని జిన్ పింగ్ చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలతో కలిసి పని చేస్తామన్నారు.