టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్నాక కూడా మనోళ్ల ఆటలో ఎలాంటి మార్పు రావట్లేదు. జట్టులో బుమ్రా సహా ఒకరిద్దరిలో మాత్రమే గెలవాలనే కసి కనిపిస్తోంది. మిగిలిన ఆటగాళ్లు ఎందుకు జట్టులో ఉంటున్నారో తెలియని పరిస్థితి. కనీసం 90 ఓవర్లు ఆట ఆడితే డ్రాతో బయట పడొచ్చన్నా.. మన ఆటగాళ్లు క్రీజులో నిలబడలేకపోతున్నారు. మెల్ బోర్న్ వేదికగా ముగిసిన నాలుగో టెస్ట్‌లో ఆలోటు స్పష్టంగా కనిపించింది.
రెండు నెలల్లో అంతా తలకిందులు
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ముందువరకూ టీమిండియాకు ఎటువంటి కష్టాల్లేవ్.. ఆ తరువాతే కష్టాలు మొదలయ్యాయ్. కివీస్ చేతిలో 3-0 తేడాతో సిరీస్ కోల్పోవడం జట్టును బాగా దెబ్బతీసింది. అప్పటివరకూ డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ సేన.. రెండు, మూడు ఆంటూ అక్కడి నుంచి ఒక్కొక్క స్థానం కొందకు దిగజారుకుంటూ వచ్చింది. ప్రస్తుతం డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానం(52.78 శాతం) శాతం మనది.
అదొక్కటే మార్గం..
సొంతగడ్డపై పాకిస్థాన్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) తొలి బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక మిగిలింది ఒక స్థానమే. ఆ ఒక్క స్థానం కోసం.. ఆస్ట్రేలియా(61.46 శాతం), భారత్(52.78 శాతం), శ్రీలంక (45.45 శాతం) మూడు జట్లు పోటీలో ఉన్నాయి.
Also Read :- రోహిత్, కోహ్లీలకు గుడ్ బై!
ఈ సిరీస్‌లో, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియాకు ఒకే ఒక్క టెస్ట్ మిగిలివుంది. సిడ్నీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3 నుంచి ఆ టెస్ట్ ప్రారంభం కానుంది. అందులో టీమిండియా విజయం సాధిస్తే WTC ఫైనల్ రేసులో సజీవంగా నిలవొచ్చు. అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక ఒక విజయాన్ని అందుకోవాలి.. మరొక మ్యాచ్‌ను డ్రాగా ముగించాలి. ఈ రెండూ జరిగితేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు. అలా కాకుండా ఆసీస్ ఒక దానిలో విజయం సాధించినా కంగారూలదే ఫైనల్ బెర్త్. ఒకవేళ శ్రీలంక రెండింటిలో గెలిస్తే.. వారు ఫైనల్ చేరుకోవచ్చు.
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ సమీకరణాలు
- ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి టెస్టులో టీమిండియా విజయం సాధించాలి
- ఆస్ట్రేలియాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక ఒక విజయం.. మరొకటి డ్రాగా ముగించాలి.
- రెండు టెస్టుల్లో శ్రీలంకపై ఒక విజయం సాధించినా, రెండు టెస్టులను డ్రాగా ముగించినా.. ఆస్ట్రేలియా ఫైనల్.
- రెండింటిలో లంకేయులు గెలిస్తే.. శ్రీలంక ఫైనల్.