IPL 2024: చెన్నైకు దెబ్బ మీద దెబ్బ..గాయంతో మరో స్టార్ బౌలర్ ఔట్

IPL 2024: చెన్నైకు దెబ్బ మీద దెబ్బ..గాయంతో మరో స్టార్ బౌలర్ ఔట్

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు గాయాల సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే, శ్రీలంక పేసర్ మతీషా పతిరానా గాయాలతో ప్రారంభ మ్యాచ్ లకు దూరమయ్యారు. తాజాగా బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కు ఈ బంగ్లా బౌలర్ ఆడడం అనుమానంగా మారింది. 

నేడు (మార్చి 18) బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ముస్తాఫిజుర్ 48 ఓవర్ వేయడానికి బౌలింగ్ కు వచ్చాడు. తొలి బంతిని వైడ్ వేయగా ఆ తర్వాత బంతి వేయడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో గ్రౌండ్ లో ఒక్కసారిగా పడిపోయాడు. నడవలేకపోవడంతో అతన్ని స్ట్రెచర్ పైనే తీసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ ఓవర్ సౌమ్య సర్కార్ వేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో ముస్తాఫిజుర్ 9 ఓవర్లలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ బంగ్లా స్టార్ బౌలర్  గాయపడడంతో చెన్నై జట్టులో డెత్ ఓవర్లు వేసే బౌలర్లు కరువయ్యారు. 

ఐపీఎల్ 2024 వేలంలో ఈ బంగ్లాదేశ్ పేసర్‌ను చెన్నై రూ. 2 కోట్లకు ధరకు దక్కించుకుంది. గతంలో ఈ బంగ్లా బౌలర్ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు. మార్చి 20న ముస్తాఫిజార్ చెన్నై శిబిరంలో చేరతాడని ఆశించిన ఇప్పుడు అతని గాయంపై వివరణ లేకపోవడంతో చెన్నై క్యాంప్ లో ఎప్పుడు చేరతాడో చెప్పలేని పరిస్థితి. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తలపడుతుంది.