కాజీపేట, వెలుగు : పంట తీసిన తర్వాత పొలం లో మిగిలిన పత్తి పొరకను తగలబెట్టగా వ్యాపించిన పొగతో ఓ రైతు చనిపోయాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నర్సింగరావుపల్లికి చెందిన దయ్యాల కుమారస్వామి (55) పుట్టుకతో మూగ వాడు. మడికొండ, నర్సింగరావుపల్లి గ్రామాల శివారులోని ఇతడికి రెండెకరాల పొలం ఉంది. ఇందులో పత్తి వేయగా ఈ మధ్యే తీశాడు.
మిగిలిన పొరకను గురువారం మధ్యాహ్నం తగబెట్టాడు. ఈ క్రమంలో గాలి తీవ్రతకు అతని పొలం పక్కనే ఉన్న మరో రైతు గడ్డివాముకు మంటలు వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు కుమారస్వామి ప్రయత్నించగా చేతులు కాలడంతో పాటు, ఎండవేడి, దట్టమైన పొగ తీవ్రతకు అస్వస్థతకు గురై ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. కుమారస్వామి మూగవాడు కావడంతో తనని రక్షించమని అరవలేని పరిస్థితుల్లో పొలంలోనే ప్రాణాలు వదిలాడు. మడికొండ పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.