ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ జరిగింది. ఉదయం సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక ఉత్సవ మూర్తులతో పాటు లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి మూలవరులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవలు చేశారు. అనంతరం కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, తర్వాత యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, సుముహూర్తాన మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక జరిగాయి. మంత్రపుష్పం సమర్పించడంతో కల్యాణ క్రతువు ముగిసింది. కంకణాలు ధరించిన భక్తులు స్వామివారి కల్యాణం నిర్వహించారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ జరిగింది.

 ఫీజు రీయింబర్స్​మెంట్​ విడుదల చేయాలి
ఖమ్మం టౌన్, వెలుగు: ఫీజు రీయింబర్స్​మెంట్​ వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నామాల ఆజాద్, బి. వెంకటేశ్  డిమాండ్​ చేశారు. సోమవారం పెవిలియన్ గ్రౌండ్ నుంచి మయూరి సెంటర్ మీదుగా  కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జడ్పీ ఎదుట ధర్నా చేశారు. అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూధన్ కు వినతిపత్రం అందించారు. మురళి, సతీశ్, లక్ష్మణ్, శేషు, వినయ్, కార్తీక్, మల్సూర్, కరుణ, రాజేశ్, వీరబాబు, శ్రీకాంత్, శివ, నవ్య, మౌనిక, ప్రదీప్  పాల్గొన్నారు.ః

అంగన్ వాడీ సెంటర్​లో భోజనం చేయాలి
పాల్వంచ, వెలుగు: అంగన్​వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తినాలని ఐసీడీఎస్  సీడీపీవో కనకదుర్గ సూచించారు. సోమవారం మండ లంలోని కొత్త సూరారంలో పోషణ మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిం చారు. అంగన్​వాడీ కేంద్రాల్లో భోజనం చేస్తామని బాలింతలు, గర్భిణులతో ప్రతిజ్ఞ చేయించారు. సూపర్​వైజర్ రత్నకుమారి, టీచర్లు పార్వతి, పద్మ కుమారి పాల్గొన్నారు. 

సమస్యలు పరిష్కరించాలి 
మణుగూరు, వెలుగు: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. నెల్లూరు నాగేశ్వరరావు, మిడిదొడ్ల నాగేశ్వరరావు, అక్కి నరసింహారావు, దుర్గ్యాల సుధాకర్  పాల్గొన్నారు. 

కేసీఆర్ కు రుణపడి ఉంటా
మణుగూరు, వెలుగు: రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు జీవో నెంబర్ 140ని విడుదల చేయడం పట్ల పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్  ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. పోడు రైతులకు భరోసా కల్పించారని అన్నారు. పట్టాలు లేక ఫారెస్ట్  ఆఫీసర్లతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హామీని నెరవేర్చిన సీఎంకు రుణపడి ఉంటానని తెలిపారు. 

రూ.10 లక్షల చెక్కు పంపిణీ
పాల్వంచ,వెలుగు: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) అనుబంధ స్పాంజ్ ఐరన్ కు చెందిన బడుగు అన్నపూర్ణ కొవిడ్ బారిన పడి మృతి చెందింది. ఆమె కుటుంబానికి సంస్థ నుంచి మంజూరైన రూ.10  లక్షల చెక్కును ఎన్ఎండీసీ ప్రాజెక్టు మేనేజర్ బాబ్జి అన్నపూర్ణ సోమవారం భర్త దుర్గయ్య, కూతురు శ్రీలతకు అందజేశారు. పర్సనల్ మేనే జర్ శ్రీధర్, ప్లాంట్ మేనేజర్ నాగరాజు నాయుడు, యూనియన్ నాయకులు బాలునాయక్, గడ్డం ప్రసాద్, రవి, అల్లి కాంతయ్య పాల్గొన్నారు.  

పాల్వంచలో 15వేల మందికి అన్నదానం
పాల్వంచ,వెలుగు: వినాయక నవరాత్రుల ముగింపు అనంతరం పాల్వంచలోని పలు మండపాల్లో సోమవారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కేటీపీఎస్ఐఎం కాలనీ ముత్యాలమ్మ తల్లి మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి కేటీపీఎస్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్లు కె రవీందర్ కుమార్, పి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. 

సొసైటీ అక్రమాలపై విచారణ
ములకలపల్లి, వెలుగు: లోన్ల కన్వర్షన్లలో అక్రమాలకు పాల్పడ్డారని సంఘ డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో సోమవారం డీజీఎం ములకలపల్లి పీఏసీఎస్, డీసీసీ బ్యాంకుల్లో విచారణ జరిపారు. సొసైటీ, బ్యాంకుల్లో రికార్డులు పరిశీలించి ఫిర్యాదు చేసిన సంఘ డైరెక్టర్లు గంగవరపు సుధాకర్, దేవభక్తిని కృష్ణ ప్రసాద్ లను విచారించారు. సమగ్ర విచారణ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు డీజీఎం తెలిపారు.

లైబ్రరీ తనిఖీ
పాల్వంచ,వెలుగు: పాల్వంచలోని లైబ్రరీని జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్  సోమవారం సందర్శించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం మెటీరియల్ తెప్పించాలని సూచించారు. అభ్యర్థులతో మాట్లాడి అవసరమైన పుస్తకాల వివరాలు తెలుసుకున్నా రు. ఆయన వెంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎం రాజుగౌడ్, కొత్తపల్లి మధుబాబు ఉన్నారు. 

ఎంపీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం
వైరా, వెలుగు: టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం పట్ల గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్  సిఫారసు మేరకు ఎంపీ నిధుల నుంచి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించేందుకు రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులకు సోమవారం సర్పంచ్  చల్లా మోహన్ రావు శంకుస్థాపన చేశారు. ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, వార్డు సభ్యులు సైదా, రవి, కమాటల ఎల్లయ్య, రంజాన్  పాల్గొన్నారు.

వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ఖమ్మం టౌన్,వెలుగు: ఈ నెల 16 నుంచి 18 వరకు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సూచించారు. కలెక్టరేట్  ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో వజ్రోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. అడిషనల్​ కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి, అడిషనల్  డీసీపీలు శబరీష్, సుభాష్ చంద్రబోస్, ఖమ్మం, కల్లూరు ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ పాల్గొన్నారు.


స్కీమ్స్ ఓపెనింగ్ కు ప్రజాప్రతినిధులను పిలిస్తే న్యూసెన్స్

వెటర్నరీ డాక్టర్​ వ్యాఖ్యలను తప్పుపట్టిన జడ్పీటీసీ, ఎంపీపీ
ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలంలో 15 రోజుల క్రితం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి తమను ఎందుకు పిలవలేదని వైస్ ఎంపీపీ గుత్తా రవి వెటర్నరీ డాక్టర్​ క్రాంతిని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పిన ఆయన కుల సంఘాల లీడర్లను పిలిస్తే సరిపోతుందని, ప్రజాప్రతినిధులను పిలిస్తే న్యూసెన్స్ తప్ప ఏమీ ఉండదని అన్నారు. డాక్టర్  తీరును జడ్పీటీసీ మాలోతు ప్రియాంక, ఎంపీపీ భుక్యా గౌరి, ఎంపీడీవో రామకృష్ణ తప్పుపట్టారు. కొంతసేపు వాగ్వాదం తరువాత డాక్టర్ క్రాంతి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. పెండింగ్​ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఎంపీపీ, జడ్పీటీసీ సూచించారు. 

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
కూసుమంచి,వెలుగు:మండలంలోని నాయకన్​గూడెం గ్రామానికి చెందిన ఉల్లోజు త్రివేణి(25) అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాసా నందీప్​ తెలిపారు. ఏడేండ్ల కింద మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన కందాల వెంకటేశ్​తో వివాహం జరిగింది. గత నెల 31న నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భర్త వెంకటేశ్​​కొట్టాడు. దీంతో త్రివేణి తన పుట్టింటికి వచ్చింది. ఆమె సోదరుడు ఉల్లోజు బాబు మాట్లాడేందుకు ఇంటికి రమ్మన్నాడు. వెంకటేశ్​ ఆదివారం రాత్రి భార్యను కొట్టడంతో.. సారీ అన్నయ్య నేను వెళ్లిపోతున్నాను.. నా పిల్లలను జాగ్రత్తగా  చూసుకో  అని లెటర్​ రాసి పెట్టి వెళ్లి పోయింది. త్రివేణి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రీవెన్స్​లో వచ్చిన అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ అనుదీప్​ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం కలెక్టరేట్​లో సోమవారం గ్రీవెన్స్​లో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల16న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 15వేల మందితో ర్యాలీలు నిర్వహించాలన్నారు. మైనార్టీ గురుకులాల్లో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని మైనార్టీ వెల్ఫేర్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు ఎండీ. యాకూబ్​పాషా కలెక్టర్​ను కోరారు. గోదావరి వరద ముంపునకు గురైనా పరిహారం ఇవ్వలేదని బూర్గంపహాడ్, భద్రాచలం, చర్ల మండలాలకు చెందిన బాధితులు కలెక్టర్​కు విన్నవించారు. పట్టణంలోని ఏడో వార్డులో డ్రైనేజీలు, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని వార్డు ప్రజలు కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. డీఆర్డీవో మధుసూదనరాజు, డీఆర్వో అశోక్​ చక్రవర్తి, ఏఓ గన్యా, పీఆర్​ ఈఈ సుధాకర్, వెల్ఫేర్​ ఆఫీసర్​ వరలక్ష్మి పాల్గొన్నారు. 
ఖమ్మం టౌన్: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూధన్ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. జడ్పీ హాల్ లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. డబుల్ బెడ్రూమ్  ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి 50 మంది దరఖాస్తు చేసుకోగా, ధరణి సమస్యలపై 25 అప్లికేషన్స్  వచ్చాయి. డీఆర్వో శిరీష, ఆర్డీవో రవీంద్రనాథ్  పాల్గొన్నారు.


రెండు జీపీల్లో వైద్య శిబిరాలు
గుండాల, వెలుగు: జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆళ్లపల్లి పీహెచ్​సీ డాక్టర్ సుధీర్  సూచించారు. సోమవారం ఆళ్లపల్లి, మార్కోడు పంచాయతీల్లో  వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరం వస్తే ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని అన్నారు. 


ప్రజల్లో ఉంటా.. పోటీలో ఉంటా..   మాజీ ఎంపీ పొంగులేటి
మధిర, వెలుగు: నిత్యం  ప్రజల్లో ఉంటానని, రాష్ట్రంలో ముందుగా ఏ ఎన్నికలు జరిగినా తప్పనిసరిగా పోటీ చేస్తానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. సోమవారం మధిరలోని డాక్టర్ కోటా రాంబాబు నివాసంలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్​లోనే కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీలో ఉంటానని తెలిపారు. నిరంతరం ప్రజల్లో తిరిగే తనకు ప్రత్యేకంగా పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో అద్భుతం జరగొచ్చని, నేతలు తమ ఉనికి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారన్నారు. అనంతరం ఇటీవల చనిపోయిన మధిర మున్సిపల్  కౌన్సిలర్ రాణి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
ఎర్రుపాలెం: మండలంలోని రామన్నపాలెం,శకునవీడు, తక్కెళ్లపాడు, మీనవోలు, ఎర్రుపాలెం గ్రామాల్లో ప్రమాదాల్లో గాయపడిన వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ పెడమర్తి రవి, ఐయిలూరు వెంకటేశ్వర్ రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, శీలం కవిత, మొగిలి అప్పారావు, జంగా పుల్లారెడ్డి, విజయభాస్కరరెడ్డి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. 

హత్యకేసులో నలుగురికి జీవిత ఖైదు

కారేపల్లి,వెలుగు: మండలంలోని పాటిమీదిగుంపు గ్రామానికి చెందిన బానోత్​ మాజీని హత్య చేసిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాసరావు సోమవారం తీర్పునిచ్చారు. కారేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాటిమీదిగుంపులో 2015లో బానోత్​ మాజీ హత్యకు గురైంది. ఏన్కూరు మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బోడ లలిత, బోడ నరేశ్, పాటిమీదిగుంపు గ్రామానికి చెందిన బానోత్​ సతీశ్, రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన అజ్మీర రామకోటిలపై కేసు నమోదైంది. విచారణ అనంతరం జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉండగా, బానోత్​ బుజ్జి మరణించాడు. మరో బాలనేరస్థుడిని ఆరు నెలలు అబ్జర్వేషన్​ విధించారు.

భార్యను చంపిన భర్తకు..
భద్రాద్రికొత్తగూడెం: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్​ తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన శ్రీవాణితో 15ఏండ్ల కిందట పాల్వంచ మండలం కారగట్టుకు చెందిన శెట్టిపల్లి సత్యనారాయణకు వివాహం జరిగింది. ఇద్దరి మధ్య తరుచూ గొడవలు అవుతుండడంతో ఇద్దరిని శ్రీవాణి పేరెంట్స్​ మైలారానికి తీసుకొచ్చి ఎకరం భూమితో పాటు ఇల్లు ఇచ్చారు. భార్యపై అనుమానంతో 2021లో గొడ్డలితో నరికి చంపాడు. శ్రీవాణి తల్లి లాలమ్మ ఫిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో సత్యనారాయణకు జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు నిచ్చారు.


అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

ఖమ్మం టౌన్: భారీ వర్షాల దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేశించారు. సోమవారం క‌‌‌‌లెక్టర్లు, ఇత‌‌‌‌ర శాఖ‌‌‌‌ల‌‌‌‌ అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని సూచించారు. పరిస్థితులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని అన్నారు. అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌‌‌‌, భద్రాచలం సబ్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌  ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌ నంబర్ల(08744-241950, 08743-232444)కు కాల్‌‌‌‌ చేసి సాయం 
పొందవచ్చని తెలిపారు. 


ఏపీవోగా మునీర్​పాషా అద్దాల్
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ఏపీవో(పవర్)గా ఎస్డీ మునీర్​పాషా అద్దాల్​ బాధ్యతలు చేపట్టారు. బూర్గంపాడు సబ్​స్టేషన్​ ఏఈగా పనిచేస్తూ ఇక్కడికి వచ్చారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్​ సమస్యలు తలెత్తకుండా కృషి చేస్తానని తెలిపారు.

బెల్ట్​షాపులకు ఎమ్మార్పీ కే మద్యం అమ్మాలి

కామేపల్లి మండల సమావేశంలో ప్రజాప్రతినిధులు 
కామేపల్లి, వెలుగు: వ్యాపారులు ఎమ్మార్పీ ధరలకే బెల్ట్ షాపులకు మద్యం అమ్మేలా చూడాలని కామేపల్లి మండల ప్రజా ప్రతినిధులు ఎక్సైజ్​ ఎస్సై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రమణకు సూచించారు. సోమవారం సాయంత్రం ఎంపీపీ బానోత్ సునీత రాందాస్ అధ్యక్షతన మండల సమావేశం జరిగింది. ఎక్సైజ్ ఎస్సై మాట్లాడుతుండగా, ఎంపీపీ, జడ్పీటీసీ బానోత్ వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్ తో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు పలు అంశాలపై నిలదీశారు. బెల్ట్​షాపులకు రూ.20 ఎక్కువకు వ్యాపారులు అమ్ముతున్నారని పేర్కొన్నారు. బెల్ట్​షాపుల వారు మరో రూ.20 అదనంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. మద్యం వ్యాపారుల ప్రైవేట్ సైన్యం దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వివిధ పనుల కోసం వచ్చే వారిని తనిఖీ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని ఎక్సైజ్ ఎస్సై హామీ ఇవ్వడంతో శాంతించారు. 


ధర్నాలతో దద్దరిల్లిన కొత్తగూడెం కలెక్టరేట్
కొత్తగూడెం కలెక్టరేట్​ సోమవారం ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లింది. సింగరేణిలో కాంట్రాక్ట్​ కార్మికులను పర్మినెంట్​ చేస్తానని సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని కాంట్రాక్ట్​ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఆందోళన చేశారు. ఇల్లందును రెవెన్యూ డివిజన్​ చేయాలని, కొమరారం, బోడు ప్రాంతాలను మండలాలుగా చేయాలని డిమాండ్​ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆధ్వర్యంలో ఆల్​పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, దమ్మపేట మండలానికి చెందిన మద్దిశెట్టి సామేలుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని అణగారిన వర్గాల సంఘం ఆధ్వర్యంలో మహిళలు ధర్నా చేశారు. అలాగే పీడీఎస్​యూ, యోగా శిక్షకులు, అభిమానులు నిరసన తెలిపారు. బూర్గంపహాడ్​ మండలాన్ని పోలవరం ముంపు మండలంగా ప్రకటించి, ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ ప్రకటించాలని ధర్నా చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  - భద్రాద్రికొత్తగూడెం, వెలుగు