కొమురవెల్లి, వెలుగు : జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. గురువారం చేర్యాల నుంచి కొమురవెల్లి మల్లన్న టెంపుల్ వరకు దాదాపు 500 బైక్ తో ర్యాలీగా వచ్చి మల్లన్న ఆలయంలోని గంగిరేగి చెట్టు వద్ద మోకాళ్లపై కూర్చొని సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని కోరుతూ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో కనిపించని పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గం కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడేండ్లు ఎమ్మెల్సీగా ఉండి ఒక్క రూపాయి నిధులు కూడా జనగామ నియోజకవర్గానికి కేటాయించలేదని విమర్శించారు. పల్లా కబ్జాల బాగోతం సమాజం మొత్తానికి తెలుసన్నారు.
కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం గౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి, కొమురవెల్లి, చేర్యాల ఎంపీపీలు తలారి కీర్తన, కరుణాకర్, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, టెంపుల్ చైర్మన్ గీస భిక్షపతి, బీఆర్ఎస్ మద్దూర్ మండల అధ్యక్షుడు మేక సంతోష్ తో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.