భూకబ్జాలు తప్ప అభివృద్ధి పట్టని ముత్తిరెడ్డి..మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి

చేర్యాల, వెలుగు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూకబ్జాలు తప్ప చేర్యాల అభివృద్ధిని పట్టించుకోలేదని -మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి విమర్శించారు.  సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. చేర్యాల పెద్ద చెరువు మత్తడి దగ్గర తరతరాలుగా నడుస్తున్న అంగడి ప్రాంతాన్ని కబ్జా చేసి కూతురు పేరిట రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని స్వయంగా తుల్జాభవానీ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తుచేశారు.  అంతేకాదు చేర్యాల ప్రజలకు చెప్పి.. మా నాన్న చేస్తున్న తప్పును సరిదిద్దుతున్నానని ప్రకటించడం పట్టణ ప్రజల సమష్టి విజయంగా భావిస్తున్నామన్నారు.  అయితే తుల్జాభవాని రెడ్డి, తన అల్లుడు ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యారని ఎమ్మెల్యే ఆరోపించడం సరికాదన్నారు. తమకు వారి కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.  ప్రజలనే కాదు కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే మోసం చేస్తున్నారని మండిపడ్డారు.  

ALSOREAD:కరెంట్​ రిపేర్లు ఆలస్యం చేయొద్దు

తన హయాంలో చేసిన అభివృద్ధి తప్ప తొమ్మిదేళ్లలో చేసిందేమీ లేదని, దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్​ విసిరారు. భూకబ్జాలే కాదు సుఫారీ హత్యలను ప్రోత్సహిస్తున్న తీరును  ప్రజలు గమనిస్తున్నారన్నారు.  మంగళవారం నుంచి మత్తడి భూమిలో పశువుల సంతను ఏర్పాటు చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, డి. కళావతి, మాజీ సర్పంచ్​యాదయ్య, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ నేతలు అందె అశోక్​, అందె బీరయ్య, ఈరి భూమయ్య, బి. సుదర్శన్​, జె. సిద్దారెడ్డి, వెంకటమావో, మోటె శ్రీనివాస్​, బి. నర్సింగరావు పాల్గొన్నారు.