టికెట్​ కోసం కవిత వద్దకు ముత్తిరెడ్డి

టికెట్​ కోసం కవిత వద్దకు ముత్తిరెడ్డి

జనగామ, వెలుగు: జనగామ అసెంబ్లీ టికెట్​పెండింగ్​ ఉండడంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన ఆఖరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్​ లోని ఆమె నివాసంలో కలిశారు. తన సతీమణి పద్మలతారెడ్డి స్వయంగా గీసిన చిత్రాల లామినేషన్ ఫొటోలను బహూకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆయన తన అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సిట్టింగ్​ఎమ్మెల్యేగా ఉన్న తనకే మళ్లీ టికెట్​ ఇచ్చేలా చూడాలని విన్నవించారు. 

హరిత ప్లాజా ఘటన నుంచి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న ముత్తిరెడ్డికి కేసీఆర్​ ను కలిసే చాన్స్ దక్కడం లేదు. ఈ క్రమంలో కేటీఆర్​ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ కవిత పైనే ఆశలు పెంచుకున్నారు. మూడో సారి అవకాశం కోసం పాట్లు పడుతున్నారు. కాగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డికి జనగామ టికెట్​ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఇదే సీటును ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఆప్కో చైర్మన్​ మండల శ్రీరాములు కూడా ఆశిస్తున్నారు. దీంతో 25న తుది జాబితా ప్రకటించే వరకు జనగామ బీఆర్​ఎస్​ శ్రేణులకు ఉత్కంఠ తప్పేలా లేదు.