పల్లా గోబ్యాక్​.. జనగామలో ముత్తిరెడ్డిఅనుచరుల ఆందోళన

జనగామ, వెలుగు: పల్లా గోబ్యాక్ అంటూ జనగామ చౌరస్తా దద్దరిల్లింది. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికే జనగామ టికెట్ ను తొలి జాబితాలోనే ఖరారు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సుమారు వెయ్యి మంది బీఆర్ఎస్ ​పార్టీ లీడర్లు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో సుమారు 2 గంటల పాటు బైఠాయించారు. పల్లాకు వ్యతిరేకంగా, ముత్తిరెడ్డికి అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే ఏనాడు ఆయన జనగామ నియోజకవర్గానికి రాలేదని అన్నారు. ఒక్క గ్రామానికి కూడా అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. 

కనీసం జనగామలో ఉన్న లీడర్ల ముఖాలు కూడా సరిగా ఆయనకు తెలియవని అన్నారు. సడెన్​గా ఎమ్మెల్యే టికెట్ కావాలని ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం దారుణమని అన్నారు. పల్లాను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు గతంలో కృషిచేసిన ముత్తిరెడ్డినే మోసం చేయాలని చూడడం తగదన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, లీడర్లు ముత్తిరెడ్డి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆలోచించి జనగామ టికెట్ ముత్తిరెడ్డి కే ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. పల్లాకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని కోరారు. కాగా, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ లొల్లి రోజు రోజుకు ముదురుతున్నది. ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య పోటీ తీవ్రమైంది. శనివారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ముత్తిరెడ్డి అనుచరులు చేపట్టిన భారీ ర్యాలీతో ఈ విషయం హాట్​ టాపిక్​గా మారింది. ముత్తిరెడ్డికే టికెట్​ కేటాయించాలన్న అనుచరుల డిమాండ్​ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఏ మేరకు కలిసివస్తుందోనని స్థానికంగా చర్చ జరుగుతున్నది. 

పల్లా.. నీచపు పనులు మానుకో 

‘పల్లా రాజేశ్వర్ రెడ్డి.. నీచపు పనులు మానుకో.. అధర్మానికి పాల్పడకు.. తప్పుడు సర్వే రిపోర్టులతో పార్టీని మోసం చేయవద్దు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన జనగామలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడా అభ్యర్థిత్వాలను ఖరారు చేయని సీఎం కేసీఆర్.. నీకు మాత్రమే జనగామ టికెట్ ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నావని పల్లాను ప్రశ్నించారు. బిడ్డ తుల్జా భవానిరెడ్డికి మాయమాటలు చెప్పి తనపైకే ఉసిగొలుపుతావా అని దుయ్యబట్టారు. 

కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు మీ ఇంట్లో ఎందుకు ఉన్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు బిడ్డ వల్ల ఏడిస్తే.. ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తీరు వల్ల ఏడ్వాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు. కుటుంబ కలహాలు పెట్టి ఏదో సాధిద్దాం అనుకుంటే జనగామ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. మంచిగా ఉన్న నియోజకవర్గంలో ఎందుకు కలహాలు పెడుతున్నావని మండిపడ్డారు. ‘మా నాయకులకు డబ్బులు పంచి.. మరో హుజురాబాద్ చేస్తావా’ అని ముత్తిరెడ్డి ప్రశ్నించారు. పల్లా కుట్రలను కేసీఆర్ పసిగట్టాడని, మూడోసారీ జనగామ టికెట్ ఇచ్చేది తనకేనని, గెలిచేది తానేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, జనం మద్దతు తనకే ఉందని అన్నారు. ఎమ్మెల్యే వెంట  బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు.