ముత్తిరెడ్డికి టిక్కెట్​ ఇస్తే పార్టీకి నష్టం: మండల శ్రీరాములు

ముత్తిరెడ్డికి టిక్కెట్​ ఇస్తే పార్టీకి నష్టం: మండల శ్రీరాములు

చేర్యాల, వెలుగు : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసుగు చెంది ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు మళ్లీ టిక్కెట్​ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని బీఆర్​ఎస్​ స్టేట్​లీడర్, ఆప్కో మాజీ చైర్మన్​మండల శ్రీరాములు తెలిపారు. బుధవారం దూల్మిట్ట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్​ మూడోసారి సీఎం కావాలని బీఆర్​ఎస్​ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన అనుచరుల ద్వారా లబ్ధిదారుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. 

నియోజకవర్గంలోని గ్రామాల పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లు ముత్తిరెడ్డి చెప్పగలిగితే ఈసారి ఎన్నికల్లో తాను పార్టీ నుంచి టిక్కెట్​ఆశించబోనని సవాల్​ చేశారు. సర్వేల రిపోర్టు ఆధారంగా టికెట్​కేటాయించాలని సీఎం కేసీఆర్​ను ఆయన కోరారు. సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.లక్ష్మయ్య, ఎస్.రేణుక, కోలా ఐలయ్య, బండి చంద్రయ్య, బి. గంగాధర్​, శ్రీనివాస్​, చంద్రమౌళి, రాజు, పరశురాం, చామచంద్రం, జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు.