
- ఫిష్ మార్కెట్లలోనూ విపరీతమైన రద్దీ
- ఇదే అదనుగా రేట్లు భారీగా పెంచేసిన వ్యాపారులు
- రూ.వెయ్యి దాటిన కిలో మటన్, నాటుకోడి రూ.500
- చేపల రేట్లు కిలోకు రూ.50 నుంచి రూ.350 దాకా పెంపు
హైదరాబాద్ సిటీ / వరంగల్ / ఖమ్మం / ఆదిలాబాద్, వెలుగు: బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆదివార మైనా గిరాకీ లేక చికెన్ షాపులు వెలవెలబోయాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ కు దూరంగా ఉన్న జనం.. మటన్, చేపలు, నాటుకోళ్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో మటన్ షాపులు, చేపల మార్కెట్లు మాత్రం కళకళలాడాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ రాంనగర్లోని చేపల మార్కెట్కు జనం భారీగా తరలివచ్చారు. సిటీలోని మటన్ షాపుల్లోనూ విపరీతమైన రద్దీ కనిపించింది. కొన్నిచోట్ల మధ్యాహ్నానికల్లా నో స్టాక్ బోర్డులు కనిపించాయి.
ఇక ఇదే అదనుగా వ్యాపారులు మటన్, చేపల రేట్లు పెంచేశారు. గత వారం కిలో మటన్ రూ.800 నుంచి రూ.840 వరకు ఉండగా, ఇప్పుడు రూ.1,000 నుంచి రూ.1,100 వరకు పలికింది. రాంనగర్ ఫిష్ మార్కెట్ లో వారం కింద బొచ్చె కిలో రూ.80 ఉండగా, ప్రస్తుతం రూ.120కి చేరింది. రవ్వు రూ.100 నుంచి రూ.150కి, కొరమీను రూ.450 నుంచి రూ. 800కు, రొయ్యలు రూ.350 నుంచి రూ.500కు, సీ ఫిష్ రూ.500 నుంచి రూ.800కు, అపోలో ఫిష్ రూ.350 నుంచి రూ.500కు పెరిగింది.
హైదరాబాద్ లో 70% సేల్స్ డౌన్..
ఆదివారం ఒక్కరోజే 70 శాతం అమ్మకాలు పడిపోయాయని హైదరాబాద్ లోని చికెన్ షాపుల నిర్వాహకులు ఆందోళన చెందారు. ఐదారు రోజులుగా క్రమంగా అమ్మకాలు తగ్గుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. అయితే, అమ్మకాలు తగ్గుతున్నా చికెన్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండడం లేదు. గత వారం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.220 ఉండగా, ఆదివారం రూ.200 ఉంది.
సేల్స్తగ్గుతుండడంతో కొందరు షాపుల నిర్వాహకులు పర్సనల్గా 10 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ప్రకటిస్తున్నా.. జనం అటువైపు వెళ్లడం లేదు. ‘‘ఈ సమయంలో చికెన్ ధరలు తగ్గిస్తే బర్డ్ ఫ్లూ ఉందనే కారణంతో రేట్లు తగ్గించారని జనం అనుకుంటారు. దీంతో అమ్మకాలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. అందుకే స్ట్రాటెజిక్ గా ధరలు పెంచకుండా, తగ్గించకుండా పౌల్ట్రీ వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు” అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.
హోటల్స్లోనూ సేల్స్ ఢమాల్..
చికెన్ షాపులే కాదు.. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా చికెన్ ఐటమ్స్ ఆర్డర్లు తగ్గిపోయాయి. సాధారణ రోజుల్లో ఆర్డర్లలో 70 శాతం చికెన్ సంబంధిత వైరైటీలే ఉంటాయని.. కానీ ఇప్పుడు వాటి సేల్స్తగ్గాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఎక్కువగా చికెన్ బిర్యానీపై ఎఫెక్ట్పడిందంటున్నారు. ‘‘స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్స్ లో వచ్చే ప్రతి 30 ఆర్డర్లలో 20 చికెన్ సంబంధించిన వంటకాలవే ఉంటాయి. ప్రస్తుతం ప్రతి 30 ఆర్డర్లలో మూడు నాలుగే చికెన్ సంబంధిత ఫుడ్ ఆర్డర్లు ఉంటున్నాయి.
మటన్, సీ ఫుడ్, పన్నీర్, ఇతర వెజ్ఫుడ్ ఆర్డర్స్పెరిగాయి” అని పేర్కొన్నారు. అలాగే ఆదివారం ఎక్కువ మంది రెస్టారెంట్లకు వెళ్లి లంచ్/డిన్నర్ చేస్తుంటారు. మధ్యాహ్నం నుంచే రెస్టారెంట్లు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. కానీ బర్డ్ఫ్లూఎఫెక్ట్ తో కస్టమర్ల సంఖ్య కూడా తగ్గిందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లకు వచ్చి తినేవారి సంఖ్య 20 నుంచి 30 శాతం పడిపోయిందంటున్నారు.
ఇటు ఖమ్మంలో.. అటు ఆదిలాబాద్లో..
ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా బార్డర్ లోని ఉమ్మడి ఖమ్మంపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతున్నది. ఇక్కడ గత వారం రోజులుగా చికెన్అమ్మకాలు పడిపోయాయి. జనం చికెన్ బదులు.. మటన్, చేపలు, నాటుకోళ్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నాటుకోడి, మటన్ రేట్లను వ్యాపారులు భారీగా పెంచేశారు. మొన్నటి వరకు కిలో రూ.800 నుంచి 900 వరకు ఉన్న మటన్.. ఇప్పుడు రూ.వెయ్యి దాటింది. ఇక నాటు కోడి లైవ్ కిలో రూ.400 నుంచి రూ.500కు చేరింది. ఇక ఆదిలాబాద్లోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తున్నది. పక్కనున్న మహారాష్ట్రలోని నాగ్ పూర్, చంద్రపూర్ లో బర్డ్ ఫ్లూ బయటపడడంతో.. జిల్లాలోని జనం చికెన్ తినేందుకు భయపడుతున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని దాదాపు 200 చికెన్ షాపుల్లో ప్రతి ఆదివారం 15 టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. కానీ ఈ ఆదివారం కనీసం 3 టన్నుల చికెన్ కూడా అమ్ముడుపోలేదని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కిలో చికెన్ రూ.240 ఉండగా, ఇప్పుడది రూ.160కి పడిపోయింది. ఆదిలాబాద్ లో ప్రతి ఆదివారం రూ. 60 లక్షల నుంచి 70 లక్షల చికెన్అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు 20 శాతం కూడా గిరాకీ కాలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడ మటన్ కు గిరాకీ పెరగడంతో కిలో ధర రూ.650 నుంచి రూ.750కి పెంచేశారు.
రూ.60 వేల గిరాకీ పోయింది
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ గిరాకీ భారీగా పడిపోయింది. నాకు ప్రతి ఆదివారం రూ.70 వేల గిరాకీ జరిగేది. ఇప్పుడు కనీసం రూ.10 వేలు కూడా కాలేదు. రూ. 60 వేల వరకు లాస్ వచ్చింది. ఆదిలాబాద్లో బర్డ్ ఫ్లూ సమస్య లేదు. కానీ ప్రజల్లో అపోహల కారణంగా మాకు గిరాకీ తగ్గింది.
శివాజీ, ఆదిలాబాద్
బార్డర్ లో తనిఖీలు చేస్తున్నం
ఆదిలాబాద్ లో బర్ల్ ఫ్లూ లేదు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లక్షణాలు కనిపిస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు ప్రాంతాలైన గన్ పూర్, ఆనంద్ పూర్, లక్ష్మీపూర్, బోరజ్ చెక్ పోస్టుల వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశాం.
కిషన్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి
30 కిలోలు కూడా అమ్మలేదు..
బర్డ్ ఫ్లూ ప్రచారంతో చికెన్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. నా షాపులో ప్రతి ఆదివారం 3 క్వింటాళ్ల చికెన్ అమ్మకాలు జరిగేవి. కానీ ఈ ఆదివారం 30 కిలోలు కూడా అమ్మలేదు. బర్డ్ ఫ్లూ భయంతో జనం ఎక్కువగా చేపలు, మటన్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
బి.రవికుమార్,ఖానాపురం (ఖమ్మం)