
- కానరాని అధికారుల పర్యవేక్షణ
- కరీంనగర్, రామగుండం, జగిత్యాలలోనే వధశాలలు
- మున్సిపాలిటీలు, గ్రామాల్లో కనిపించని వైనం
- ఉమ్మడి జిల్లాలో రోజుకు 3 వేల నుంచి 5వేల వరకు జీవాలు కట్
పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మటన్ అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఎలాంటి రూల్స్ పాటించకపోగా.. మటన్ కూడా క్వాలిటీ ఉండడం లేదు. మాంసం అమ్మకాలపై దృష్టి పెట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మటన్ సెంటర్యజమానులు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. కోసే మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదోనని నిర్ధారించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వెటర్నరీ అధికారులు మటన్క్వాలిటీని నిర్ధారిస్తే.. మున్సిపల్అధికారులు స్టాంపింగ్చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ 3వేల నుంచి 5వేల వరకు వరకు జీవాలను కట్ చేస్తుండగా.. ఆదివారం ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇక పండగ రోజుల్లో అయితే లక్షల్లో ఉంటుందని అధికారుల అంచనా.
నామమాత్రపు తనిఖీలు, ఫైన్లు
కోసే మేకలు, గొర్రెలు హెల్దీగా ఉన్నాయో లేదో అని వెటర్నరీ అధికారులు పరిశీలించాలి. మున్సిపాలిటీ స్టాంపింగ్ చేయాలి. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని స్లాటింగ్ సెంటర్లలో (వధశాలలు) మాత్రమే మేకలు, గొర్రెలను కోయించాలి. కానీ ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. ఎక్కడ పడితే అక్కడే మేకలు కోస్తున్నారు. కాగా సంబంధిత అధికారుల తనిఖీలు నామమాత్రంగానే ఉన్నాయి. అప్పుడప్పుడు తనిఖీలు చేసి ఫైన్లు వేస్తున్నా వ్యాపారులు పట్టించుకోవడం లేదు.
యథావిధిగా అమ్మకాలు చేస్తున్నారు. మూడు రోజుల కింద పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్పొరేషన్ అధికారులు మటన్ షాపులను తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని, స్టాంపింగ్ లేని మాంసం అమ్మేవారికి రూ. వెయ్యి చొప్పున ఫైన్ వేసి వదిలేశారు. మరోవైపు మటన్బిజినెస్ ప్రతినెలా రూ.కోట్లలో జరుగుతున్నా క్వాలిటీ మెయింటెయిన్ చేయడంలో వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఒక్కటి, రెండు చోట్లే వధశాలలు
కార్పొరేషన్లతోపాటు, ప్రతి మున్సిపాలిటీలో స్లాటింగ్సెంటర్లు(వధశాలలు) ఉండాలి. అంతకుముందు కోసే మేకలు, గొర్రెలు ఆరోగ్యమైనవే అని వెటర్నరీ ఆఫీసర్లు సర్టిఫై చేయాలి. ఆ తర్వాత బల్దియా అధికారులు మాంసానికి స్టాంపింగ్ వేయాలి. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కేవలం కరీంనగర్, జగిత్యాల, రామగుండంలో మాత్రమే వధశాలలు ఉన్నాయి. అవి కూడా సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి.
దాదాపు 90 శాతం మేకలు, గొర్రెలు వధశాలల్లో కాకుండా బయటే కోయిస్తున్నారు. వాటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు. ఈక్రమంలో అనారోగ్యంగా ఉన్నవి.. చనిపోయినవాటిని కోసి అమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి మటన్ తింటే అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. ఇక గ్రామాల్లో అయితే మటన్ మార్కెట్లు లేకపోవడంతో దుమ్ము, ధూలి ఉన్న చోట కూడా అమ్మకాలు జరుగుతున్నాయి.
రూ. కోట్లల్లో టర్నోవర్
మటన్ అమ్మకాల ద్వారా రూ. కోట్లల్లో టర్నోవర్ జరుగుతోంది. ప్రతీ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల నుంచి 4 వేల వరకు మేకలు, గొర్రెలు కోస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఆదివారం దానికి రెండు, మూడు రెట్లు ఎక్కువగా అమ్మకాలుంటాయి. ఇక దసరా, సంక్రాంతి, న్యూఇయర్.. వంటి పండగ సందర్భాల్లో 20 వేల నుంచి 30 వేల మేకలు, గొర్రెలు కోస్తున్నారు. మటన్ అమ్మకాలపై నియంత్రణ లేకపోవడంతో అమ్మకందారులు విచ్చలవిడిగా ధరలు పెంచి అమ్ముతున్నారు. కేజీ రూ. 800 నుంచి రూ. 1000 వరకు అమ్ముతున్నా అధికారులు
పట్టించుకోవడం లేదు.