సికింద్రాబాద్ లోని పలు మాంసం దుకాణాలలో మేక, గొర్రె మాంసంలో బీఫ్ కలిపి అమ్ముతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక బృందం తనిఖీలు చేసి , నకిలీ మాంసం అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేసింది. లాక్ డౌన్ సమయంలో మాంసాన్ని ఎక్కువ ధరలకు విక్రయించడంతో పాటు, ధరల సూచిని ఏర్పాటు చేయని దుకాణాలపై కేసులు నమోదు చేసి, నోటీసులు జారీ చేశారు.
మాంసం దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని మంత్రి తలసాని ఆదేశాల మేరకు.. జిహెచ్ఎంసి, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని అనేక దుకాణాలకు ప్రభుత్వ అనుమతులు లేవని తెలిపారు. ఇటువంటి దుకాణాలలో రోగాల బారిన పడిన మేకలను అక్రమంగా ప్రైవేట్ ప్రాంతంలో కోసి అమ్మే అవకాశం ఉందని, వాటిని తినడం వలన ప్రజలు రోగాల బారిన పడతారని పేర్కొన్నారు.
ప్రస్తుతం హోటల్స్ అన్నీ బంద్ అవ్వడం వల్ల.. ఎటువంటి పెళ్ళీలు, శుభకార్యాలు జరగడం లేకపోవడంతో దుకాణదారులు మాంసం రేట్లను విపరీతంగా పెంచి అమ్ముతున్నారని చెప్పారు. సమాజం మొత్తం నష్టాల్లో ఉన్న సమయంలో రేట్లు పెంచి మళ్ళీ వారిని దోచుకోవద్దని ఆయన కోరారు.
మటన్ వ్యాపారులు నకిలీ మాంసం అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. వ్యాపారులు ఎక్కువ ధరలకు మటన్ అమ్మితే…టోల్ ఫ్రీ నెంబర్ 9848747788లో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. మటన్ చికెన్ షాపుల వద్ద ప్రజలు సామాజికదూరం పాటించాలన్నారు.