ట్రాన్స్ ఫర్ల కోసం.. టీచర్ల మ్యూచువల్ డీల్స్ రూ.100 కోట్లు.!

ట్రాన్స్ ఫర్ల కోసం.. టీచర్ల మ్యూచువల్ డీల్స్ రూ.100 కోట్లు.!
  • కోరుకున్న చోట ట్రాన్స్​ఫర్​ కోసం ఉపాధ్యాయుల మధ్య దందా
  • అందినకాడికి రాబట్టుకుంటున్న కొందరు రిటైర్​ కాబోయే టీచర్లు​
  • హైదరాబాద్ శివార్లలో పోస్టింగ్​కు రూ.50 లక్షల వరకు డిమాండ్​
  • జిల్లా కేంద్రాల్లో పోస్టుకు రూ.20 లక్షల నుంచి 30 లక్షలు
  • కనీసం రూ.15 లక్షలు ఇస్తేనే మొదటి అండర్ ​టేకింగ్ ​లెటర్​
  • పరస్పర బదిలీలకు ఇటీవలే సర్కారు పచ్చ జెండా 
  • విచారణ జరిపితే బయట పడనున్న దందాల బాగోతం 

(వెలుగు ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్) : కోరుకున్న పోస్టింగ్​ కోసం కొందరు టీచర్లు రూ.లక్షలు పోస్తున్నారు. హైదరాబాద్​కు దగ్గరగా వచ్చేందుకు ఎంత పెట్టడానికైనా రెడీ అయ్యారు. దీంతో వందల సంఖ్యలో ‘మ్యూచువల్​ డీల్స్’ కుదిరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ దందా విలువ రూ.100 కోట్ల పైమాటే. గత పదేండ్లుగా బదిలీలు సరిగా లేకపోవడం, 317 జీవోతో భార్యాభర్తలు చెట్టుకొకరు పుట్టకొకరు కావడంతో సొంత ప్రాంతాలకొచ్చేందుకు కొందరు ఉపాధ్యాయులు ఎంత డబ్బైనా ఖర్చుచేసేందుకు వెనుకాడడం లేదు. దీన్నే ఆసరాగా చేసుకుంటూ త్వరలో రిటైర్​ కాబో తున్న టీచర్లు రంగంలోకి దిగి లక్షలకు లక్షలు దండుకుని మ్యూచువల్ ​ట్రాన్స్​ఫర్స్​కు అండర్​టేకింగ్ ​లెటర్స్​ (అంగీకార పత్రాలు) ఇచ్చారు.  

సగం డబ్బులు ముందే..

తాజాగా స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మ్యూచువల్ ట్రాన్స్​ఫర్స్ కోసం ఇటీవలే విద్యాశాఖ దరఖాస్తులు తీసుకోగా 928 మంది పరస్పర బదిలీలకు అంగీకారం కుదుర్చుకుని అండర్​టేకింగ్​లెటర్స్ ఇచ్చారు. ఈ అంగీకార పత్రం ఇవ్వడానికి ముందే సగం డబ్బులు అడ్వాన్స్​గా చేతులు మారాయి. మరో 24 గంటల్లో చివరి అంగీకార పత్రాన్ని సంబంధిత డీఈఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మొత్తం డబ్బులిస్తేనే అంగీకార పత్రాలిస్తామని  కొంత మంది రిటైర్డ్ కాబోతున్న టీచర్లు పేచీలు పెడుతుండడంతో దందా విషయం బయటకు పొక్కింది. ప్రభుత్వం విడుదల చేసిన 928 మంది పరస్పర బదిలీల జాబితాను మరోసారి పరిశీలించి విచారణ జరిపిస్తే దిమ్మతిరిగే లంచావతారాల బాగోతాలు బయటపడనున్నాయి. అయితే, ఇందులో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఫోన్లు చేసి మరీ డీల్స్ 

మరో ఆరు నెలలు, ఏడాదిలో రిటైర్ కాబోయే టీచర్లంతా కొత్తగా చేరిన టీచర్లకు రెండు మూడు నెలల నుంచే ఫోన్లు చేశారు. ‘మీరు సొంత జిల్లాలో హాయిగా దర్జాగా పనిచేసుకోవచ్చు. ఇంత మంచి అవకాశం దొరకదు’  అంటూ చివరి తేదీ వరకు ఆఫర్లిచ్చారు. సగం నగదు, మరో సగం చెక్కుల రూపంలో డబ్బుల మార్పిడి జరిగింది. అంతేకాదు.. ఒకవేళ ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచితే మరో రూ.5 లక్షలివ్వాలని కూడా బాండు పేపర్లు రాసుకున్నారట. టీచర్ల పరస్పర బదిలీల దందాపై ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా.. ‘ఇదంతా నిజమే. ప్రతీసారి బదిలీల్లో కొంతమేర చేతివాటం ఉంటుంది. దానికి మేమేం చేయలేం’ అని చెప్పారు.  ప్రభుత్వం కొన్నాళ్లు పరస్పర బదిలీలకు బ్రేకులు వేస్తే డబ్బుల బాగోతాలన్నీ బయటపడే అవకాశాలున్నాయని సదరు అధికారే చెబుతున్నారు.