- 84 శాతం వరకు రిటర్న్ ఇచ్చిన ఈక్విటీ ఫండ్స్
- మెరిసిన డిఫెన్స్, ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధిత స్కీమ్‌లు
- ఏయూఎం 39 శాతం పెరిగి రూ. 68 లక్షల కోట్లకు
న్యూఢిల్లీ : ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలొచ్చాయి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొత్తం అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ ( ఏయూఎం) కిందటేడాది నవంబర్ నాటికి రూ.49 లక్షల కోట్లు ఉంటే, ఈ ఏడాది నవంబర్ నాటికి 39 శాతం పెరిగి రూ.68 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం ఈక్విటీ ఫండ్స్ మొత్తం ఏయూఎం రూ.30 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది కాలంలో 50 శాతం పెరిగింది. ఈక్విటీ ఫండ్ స్కీమ్‌లలోకి ఈ ఏడాది రూ.3.5 లక్షల కోట్ల ఇన్‌ఫ్లోస్ వచ్చాయి. మార్కెట్ పడినప్పుడు కూడా ఫండ్స్ స్కీమ్‌లలోకి పెట్టుబడులు నిలకడగా రావడాన్ని చూడొచ్చు.
మార్కెట్‌పై ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెరిగిందని, రిటైల్ ఇన్వెస్టర్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం పెరిగిందని ఈస్టీ అడ్వైజర్స్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ వివేక్ శర్మ అన్నారు. ఫైనాన్షియల్ అంశాల్లో ప్రజల్లో అవగాహన పెరిగేకొద్దీ ఈక్విటీ ఫండ్స్‌కు సిప్ వెన్నెముకలా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. యాప్‌ల ద్వారా ఈజీగా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. ‘ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి’ అని ఆయన వివరించారు.
ఈ ఏడాది ఇన్వెస్టర్లకు భారీ లాభాలిచ్చిన ఫండ్స్..
ఏసీఈ ఎంఎఫ్ డేటా ప్రకారం, ఈ ఏడాది రెండు ఓవర్‌సీస్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభాలిచ్చాయి. మిరాయి అసెట్ ఎన్‌వైఎస్‌ఈ ఫాంగ్+ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌ఓఎఫ్) ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 84 శాతం రిటర్న్ ఇచ్చింది. మిరాయి అసెట్ ఎస్ అండ్ పీ 500 టాప్ 50 ఈటీఎఫ్ ఎఫ్‌ఓఎఫ్ 67 శాతం లాభాలిచ్చింది. డొమెస్టిక్ ఫండ్స్‌లో మోతిలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ (58 శాతం), ఎల్‌ఐసీ ఎంఎఫ్ ఇన్‌ఫ్రా (52 శాతం), మోతిలాల్ ఓస్వాల్ ఈఎల్‌ఎస్‌ఎస్ ట్యాక్స్ సేవర్ (50 శాతం), బంధన్ స్మాల్ క్యాప్ (49 శాతం), మోతిలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ (48 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ డిఫెన్స్ (48 శాతం)
మోతిలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ (47 శాతం) వంటి ఫండ్ స్కీమ్‌లు ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలిచ్చాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మిడ్‌క్యాప్ ఫండ్స్ సగటున 32 శాతం రిటర్న్ ఇవ్వగా, స్మాల్‌క్యాప్ ఫండ్స్ 31 శాతం లాభాలిచ్చాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్ సగటున 20 శాతం రిటర్న్ ఇచ్చాయి.
ఈ సెక్టార్లపై మొగ్గు..
సెక్టార్ల పరంగా చూస్తే, డిఫెన్స్ (సగటున 48 శాతం రిటర్న్), ఫార్మా అండ్ హెల్త్‌కేర్ (38 శాతం), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (34 శాతం), పీఎస్‌యూ ఈక్విటీ (32 శాతం), టెక్నాలజీ (31 శాతం), మాన్యుఫాక్చరింగ్ (30 శాతం) సంబంధిత ఫండ్స్ స్కీమ్‌లు ఈ ఏడాది ఇన్వెస్టర్లకు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి.