బాల్కొండ, వెలుగు: కాంగ్రెస్అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని ఆ పార్టీ బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ చెప్పారు. మంగళవారం కమ్మర్ పల్లి మండలంలోని కమ్మర్ పల్లి, ఉప్లూర్, నాగపూర్, ఆర్ఆర్ నగర్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలను నిలువు దోపిడీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12,000 సాయం అందిస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో ప్రతినెలా రూ. 2,500 జమ చేస్తామని తెలిపారు. ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో అహంకారాన్ని ఓడించి ప్రేమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ALSO READ : ప్రజలకు సైనికుడిగా పనిచేస్తా : మదన్ మోహన్ రావు